Off The Record: దెబ్బలు… ఒకదాని వెంట ఒకటిగా వరుస దెబ్బలు… అది కూడా అలా ఇలా కాదు… విధి పగబట్టినట్టుగా, వాచిపోయేట్టు.. లాగిపెట్టి కొడుతున్న దెబ్బలు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ విషయంలో ప్రస్తుతం జరుగుతున్నది ఇదే. అటు రాజకీయంగా, ఇటు వ్యక్తిగతంగా తగులుతున్న స్ట్రోక్స్‌తో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారట ఆయన. లోలోపల ఫ్రస్ట్రేషన్ ఎంత పీక్స్‌కు చేరుకోకపోతే… నాలో అగ్నిపర్వతం రగులుతోందని ఆయన అంటారన్న చర్చ జరుగుతోంది. తాజాగా తమ పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో ఆ కామెంట్ చేశారు కేసీఆర్. 14 ఏళ్ళ తెలంగాణ ఉద్యమంలో, పదేళ్ళ అధికారంలో.. తిరుగులేని ఆధిపత్యం చెలాయించారాయన. పవర్‌లో ఉన్న పదేళ్ళ కాలం సరే.. అంతకు ముందు ఉద్యమ సమయంలో కూడా ఒకరకంగా అనధికారికంగా కేసీఆర్ మాటే చెల్లుబాటైందన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం.
అంటే.. దాదాపు 24 ఏళ్ళపాటు ఆయన హవానే నడిచింది. కానీ, ఇప్పుడాయన పరిస్థి ఆకాశంలో కట్లు తెగి అమాంతం పాతాళంలోకి పడిపోయినట్టుగా ఉందంటున్నారు. తాను ఉన్నన్నాళ్ళు శాశ్వతమనుకున్న అధికారం చేజారిపోయింది. ఓడిపోగానే.. తుంటి ఎముక విరిగి ఆసుపత్రి పాలయ్యారు. ఆ తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బిడ్డ కవిత అరెస్టయి నాలుగు నెలలవుతోంది. అప్పటి నుంచి తీహార్ జైల్లోనే ఉన్నారామె. ఇక పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి లోక్‌సభలో ప్రాతినిధ్యం పోయింది. ఫస్ట్‌టైం ఒక్క ఎంపీ సీటు కూడా గెలవక చతికిల పడింది బీఆర్‌ఎస్. దాన్ని చాలా పరువు తక్కువ వ్యవహారంగా ఫీలవుతున్నారట కేసీఆర్. ఇక అది చాలదన్నట్టు.. ఎద్దు పుండును కాకి పొడిచినట్టు ఇప్పుడు ఎమ్మెల్యేల వలసల పర్వం. ఒకప్పుడు కనుసైగలతో శాసించి పక్క పార్టీల ఎమ్మెల్యేల్ని లాగేసుకోవడమే కాదు.. ఏకంగా ఆయా పార్టీల శాసనసభా పక్షాల్నే విలీనం చేసేసుకున్న కేసీఆర్ ఇప్పుడు సొంత గుర్తు మీద గెలిచిన వాళ్ళని కాపాడుకోలేని దీన స్థితికి పడిపోయారు. తన సహజ శైలికి భిన్నంగా ఆయన దిగొచ్చి ఎమ్మెల్యేల్సి బాబ్బాబు అని బతిమాలుకున్నా… ఎవ్వరూ ఆగడం లేదట. ఇలా ఎటు చూసినా… సమస్యలు, సమస్యలు… ఒకటే సమస్యలు. తిండి పోదు, నిద్ర రాదు, కుదురుగా కూర్చోలేని, నిల్చోలేని పరిస్థితి.. .అందుకే ఫ్రస్ట్రేషషన్… ఫ్రస్ట్రేషన్… ఒకటే ఫ్రస్టేషన్ అంటున్నాయి రాజకీయ వర్గాలు.
ఆ అసహంలో నుంచే అగ్నిపర్వతం మాటలు వచ్చి ఉంటాయని అంచనా వేస్తున్నారు పొలిటికల్ పండిట్స్. పార్టీని జాతీయ స్థాయికి విస్తరించేస్తా… ఛాన్స్ వస్తే ప్రధానమంత్రి అయిపోతా… దేశాన్నేలేస్తానంటూ ఒకప్పుడు డాంబికాలు పోయిన నాయకుడు ఇప్పుడు కనీసం కన్న కూతురు నాలుగు నెలల నుంచి జైల్లో ఉన్నా… బయటికి తీసుకురాలేని స్థితిలో ఉండటమన్నది నిజంగా ఆయనకు శిక్షేనన్న మాటలు బలంగానే వినిపిస్తున్నాయి. కనీసం జైలుకు వెళ్ళి కూతుర్ని పరామర్శించలేని స్థితిలో ఏ తండ్రికీ రాకూడనిది ఇది అంటున్నారు పరిశీలకులు. అందుకే నాలో అగ్నిపర్వతం పెరుగుతోందని ఆయన అని ఉండవచ్చంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని పెట్టిన కొత్తల్లో కూడా అనే ఆటుపోట్లు ఎదుర్కొన్న కేసీఆర్… ఇప్పుడు అంతకు మించిన ఇబ్బందుల్లో కూరుకుపోయారని, మరి లోపల పెరుగుతున్న అగ్నిపర్వతాన్ని అణిచేస్తారా? లేక అది ఉన్నట్టుండి ఏదో ఒక రూపంలో బయటికి వస్తుందా? వస్తే.. ఆ లావా ఎవర్ని ముంచెత్తుతుందన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. కేసీఆర్ యాక్టివ్‌గా ఉన్నన్ని రోజులు తెలంగాణలో అధికారానికి దూరం అవుతామని ఆయనతో పాటు వంది మాగదులు ఎవరూ ఊహించలేదు.
మూడోసారి కూడా అధికారంలోకి వస్తామనే అతి విశ్వాసంతోనే ఫలితాలు వెలువడే చివరి క్షణం వరకు ఉన్నారు. కానీ చివరికి అంతా తిరగబడేసరికి నిటారుగా నిలబడే కేసీఆర్ ఒక్కసారి కుప్పకూలిపోయారు. తాను తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దితే ప్రజలు ఇలా తీర్పు ఇచ్చారేంటంటూ నివ్వెరపోయారు. ఫలితమే ఆయన ఫామ్ హౌజ్‌లో పడిపోయి కాలుకు గాయమైంది. ఓడిపోగానే… ఆయనకా దెబ్బ తగలడంతో పార్టీ శ్రేణుల్లో అభద్రత వాతావరణం నెలకొంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏవీ ఆయన ఊహించినవి కాదు. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్‌ఎస్ ఎల్పీ మీటింగ్‌లో కేసీర్ ఆవేదన చూసిన నేతలు ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత నిబ్బరంగా ఉన్నారంటూ గుసగుసలాడుకున్నారట. అధికారం కోల్పోయినా, బిడ్డ జైలులో ఉన్నా, ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినా, లోక్‌సభ ఎన్నికల్లో సున్నా రిజల్ట్ వచ్చినా…లోపల రగులుతున్న అగ్నిపర్వతాన్ని మాత్రం బద్దలవకుండా చూసుకుంటున్నారన్నది బీఆర్‌ఎస్ నేతల వెర్షన్. మరి ఆఅగ్నిపర్వతం బద్దలవుతుందా? బద్దలయితే అందులో దహించకపోయే వాళ్లు ఎవరు? గరళ కంఠుడుగా మారానని పరోక్షంగా చెప్పుకుంటున్న కేసీఆర్ బీఆర్‌ఎస్‌ను ఎటువైపు తీసుకెళుతాడో చూడాలంటున్నారు పరిశీలకులు.