Off The Record: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కీలక నేతలు వారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన సీనియర్లు. కాంగ్రెస్ అధికారానికి దూరం కావడంతో పార్టీ మారాలని జంప్ అయ్యారట. గంపెడాశలతో గులాబీ తీర్థం పుచ్చుకున్న ఆ నేతలకు…ఏ పదవీ దక్కకపోవడంతో అడియాశలయ్యాయట. కాంగ్రెస్‌లో కాంతులీనిన వారి పొలిటికల్ లైఫ్… ఒక్కసారిగా కళావిహీనంగా మారిందని వాపోతున్నారట. ఏదో ఒక పదవి వస్తుందని ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న వారంతా…ఎన్నికలు సమీపిస్తుండటంతో మెల్లగా నోరు విప్పుతున్నారట. ఆశించిన రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు రాక. ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించే పరిస్థితి కూడా లేదట. పార్టీలో చేరిన తర్వాత కనీస ప్రాధాన్యం దక్కక లోలోపల కుమిలి పోతున్నారట సదరు నేతలు. ఇలాగైతే తాము పాలిటిక్స్‌కు దూరం అయినట్టేననే భయం…వారిలో మొదలైందట.
కరీంనగర్ అసెంబ్లీ నుంచి చల్మెడ లక్ష్మీనర్సింహరావు…రెండుసార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. మంత్రి గంగుల కమలాకర్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తూ ఆయన బీఆర్‌ఎస్‌లో చేరారని ప్రచారం జరిగింది. ఎమ్మెల్యేల కోటా, స్థానిక సంస్థల కోటా, నామినేటెడ్ కోటాలోని ఎమ్మెల్సీలు ఒక్కొక్కటిగా భర్తీ కావడంతో చల్మెడ ఆశలపై చన్నీళ్లు చల్లినట్టయిందట. వేములవాడ అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఉంటారని ప్రచారం మొదలైందట. ఆయన స్వగ్రామైన మలకపేట ఆ నియోజకవర్గంలోనే ఉండడంతో పాటు…ఆయన ట్రస్టు ద్వారా పలు కార్యక్రమాలు చేస్తున్నారు. కోర్టు కేసులతో చెన్నమనేని రమేష్‌కు ఈసారి టికెట్ రాదని…తొలుత వ్యూహత్మక ప్రచారం ప్రారంభించారట. వేములవాడలో లక్ష్మీనర్సింహారావే బీఆర్‌ఎస్ అభ్యర్థి అని పార్టీలో డిస్కషన్ నడుస్తోందట. దీంతో రమేశ్‌బాబుకు, చల్మెడ లక్ష్మీనర్సింహారావుకు మధ్య కోల్డ్ వార్ షురూ అయిందట. కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్‌లో చేరినా…చల్మెడ కలిసిరావడం లేదన్న చర్చ నడుస్తోంది.
చొప్పదండి మాజీ శాసనసభ్యుడు కోడూరి సత్యనారాయణను… గౌడ సామాజిక వర్గంలో బలమైన నేత. ఆయన చేరితో చొప్పదండి, కరీంనగర్ అసెంబ్లీకలో కలిసి వస్తుందని బీఆర్ఎస్లో జాయిన్ చేసుకున్నారట. ఆయనకు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవి లేదా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. ఓ దశలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్ష పదవివి ఆయన పేరు తెరపైకి వచ్చిందట. అవేమి దక్కక పోగా…క్రమేపి పార్టీలో ఆయన ప్లేస్ నామమాత్రంగా మారిందట. పాపం ఈ మాజీ ఎమ్మెల్యే కరివేపాకులాగా మారారని చర్చ సాగుతోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైన తన సత్తా చూపాలని భావిస్తున్నారట కోడూరి. మరో సీనియర్ నేత సంతోష్‌కుమార్..సైతం బీఆర్ఎస్‌లో అసంతృప్తిగా ఉన్నారట. ఆయన తర్వాత చేరిన ఎల్ రమణకు ఎమ్మెల్సీ పదవి రావడంతో…తెరుమరుగయ్యారట. వచ్చే ఎన్నికల్లో తన సత్తా చూపించాలని ఫిక్స్ అయ్యారట.
మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్…రసమయి బాలకిషన్ చేతిలో వరుసగా రెండుసార్లు ఓడిపోయారు. 2018లో తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్‌లో చేరిపోయారు. గులాబీ పార్టీలో ఆరేపల్లి మోహన్‌కు సముచిత స్థానం దక్కలేదని వాపోతున్నారట. మానకొండూరు టికెట్ ఆశిస్తున్న ఆయనకు అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదట. పార్టీలో ప్రాధాన్యత లేకపోవడంతో పక్కదారులు చూస్తున్నారట. కాంగ్రెస్‌లో ఎదురు లేని స్థితి నుంచి ప్రస్తుతం ఉనికి కోసం పాకులాడాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోతున్నారట మోహన్ అనుచరులు. తన అనుచరులతో చర్చలు జరిపిన మోహన్ తాడో పేడో తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారట.