Off The Record: అసెంబ్లీ ఎన్నికల సీట్ల సంగతి తేలిపోవడంతో… తెలంగాణలో జంపింగ్ జపాంగ్‌లు పెరిగిపోతున్నారు. ప్రధాన పార్టీల తరపున ఇన్నాళ్ళు టిక్కెట్ల కోసం ఎదురు చూసి… నిరాశపడ్డ నేతలు ఎక్కువ మంది ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు. ఉన్న పార్టీల్లో ఇక లాభం లేదనుకుని డిసైడైన నేతలంతా గోడ దూకుతున్నారు… దూకడానికి మరికొంత మంది సిద్ధంగా ఉన్నారు. ఇన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వలసలు హాట్ టాపిక్ అవగా … ఇప్పుడు బీఆర్‌ఎస్ కారు డోర్లు బార్లా తెరవడంపై చర్చ జరుగుతోంది. కాంగ్రెస్, బీజేపీల నుంచి అసమ్మతులు, అసంతృప్తులు కారెక్కేస్తున్నారు. అయితే ఇక్కడే… ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు రాజకీయ పరిశీలకులు. ఇప్పటికే కారు వోవర్‌లోడై… గులాబీ పార్టీ నిండు కుండలా ఉందని అంటున్నారు. అయినా సరే… కొత్తగా ఎవరు వచ్చినా… ద్వారము తెరిచే ఉన్నదన్న మాట వినిపించడం వెనక ఆంతర్యం ఏంటన్న చర్చ జరుగుతోంది. వస్తున్న వాళ్ళందరికీ… పార్టీ ఎలాంటి హామీలు ఇస్తోంది? వారి చేరికతో జరిగే పరిణామాలు ఏంటంటూ మాట్లాడుకుంటున్నారు నాయకులు.
కాంగ్రెస్ పార్టీలో టికెట్ దక్కని నేతల చూపులు BRS వైపునకు మళ్ళుతున్నాయి. అదే సమయంలో BRS కూడా కాంగ్రెస్ లోని అసమ్మతి… ఆసంతృప్త నేతలకు గాలం వేస్తోంది. అధికార పార్టీలోని పెద్ద నేతలే స్వయంగా టచ్ లోకి వెళ్లి కలిసి పనిచేద్దామని చెబుతున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ నుంచి పొన్నాల లక్ష్మయ్య,నాగం జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణు కారెక్కారు. దీంతో వీరికి ఇచ్చిన హామీ ఏంటన్నది ఇప్పుడు టాక్ ఆఫ్ ది బీఆర్‌ఎస్ అయింది. మరో వైపు బిజెపి నుంచి కూడా జిల్లా స్థాయి నేతలు గులాబీ పార్టీలోకి వెళ్తున్నారు. తాజాగా ముథోల్ నియోజకవర్గానికి చెందిన రమాదేవి, మానకొండుూరుకు చెందిన దరువు ఎల్ల్నన్న గులాబీ కండువా కప్పుకున్నారు. అయితే… చాలా కాలంగా పార్టీలో ఉన్న వారు పదవుల కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితుల్లో …కొత్తగా వచ్చిన వాళ్ళకు ఎంత వరకు అవకాశాలు ఇవ్వగలుగుతారన్న విశ్లేషణలు మొదలయ్యాయి. గతంలో వివిధ సందర్భాల్లో పార్టీలో చేరిన వారు అవకాశాలు రాక కారు దిగిన సందర్భాలను గుర్తు చేస్తున్నారు పొలిటికల్ పండిట్స్. మరోవైపు చేరుతున్న నేతల స్థాయిని బట్టి పదవుల ఆఫర్ వస్తోందంటున్నారు. మొత్తంగా గులాబీ పార్టీలో వరుస చేరికలు హాట్ టాపిక్ గా మారుతున్నయి. ఈ తాజా చేరికలు ఆ పార్టీకి ఎటువంటి ఫలితాల్ని ఇస్తాయో చూడాలి.