Off The Record: వేణుంబాకం విజయసాయిరెడ్డి…. ఒకప్పుడు వైసీపీలో నంబర్ టూగా ఓ వెలుగు వెలిగిన ఈ లీడర్ రాజకీయాల్లో డిఫరెంట్ పీస్ అని చెప్పుకుంటారు. చిన్న విషయాన్ని కూడా ఓ సంచలనంగా చెప్పడంలో సరిలేరు నాకెవ్వరూ….. అన్నట్టుగా ఉంటుందట ఆయన వ్యవహారం. ఈ క్రమంలోనే… తాజాగా ఆయన ఎక్స్‌లో పెట్టిన ఓ మెసేజ్…. పొలిటికల్ పండిట్స్‌కే గట్టి పని పెట్టిందంటున్నారు. ఏపీ మద్యం ముడుపుల కేసులో సిట్ విచారణకు హాజరు కావాల్సిన వేళ ఎక్స్‌లో మాజీ ఎంపీ పెట్టిన మెసేజ్ ఉద్దేశ్యం ఏంటో అర్ధంగాక బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారట చాలామంది. దాని చుట్టూ రకరకాల వాదనలు, విశ్లేషణలు బయలుదేరాయి. కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన! అంటూ… భగవద్గీతలోని ఆ పూర్తి శ్లోకాన్ని, దాని సారాంశాన్ని తన సందేశంలో రాసుకొచ్చారాయన. కర్మలను ఆచరించుటయందే నీకు అధికారము కలదు.. కానీ వాని ఫలితములు మీద లేదు. నీవు కర్మ ఫలములకు కారణం కారాదు. అట్లని కర్మలను చేయుట మానరాదు” అంటూ భగవద్గీతలోని శ్లోకాన్ని కోట్ చేయడం చుట్టూ చర్చ ఓ రేంజ్‌లో జరుగుతోంది ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో. దానికంటే ముందు… విపక్షాలు సహా అన్ని రాజకీ పార్టీలు రాజధర్మాన్ని అనుసరించాలి అంటూ ఓ హిందీ వాక్యాన్ని జత చేయడం ఇంకా ఉత్కంఠను పెంచింది.
Read Also: Varun Aaron: ఐపీఎల్ 2026 కోసం కొత్త బౌలింగ్ కోచ్‌ను ప్రకటించిన సన్‌రైజర్స్ హైదరాబాద్..!
వాస్తవానికి ఆ రోజే… లిక్కర్ కేసులో రెండోసారి విచారణకు హాజరవ్వాల్సి ఉంది సాయిరెడ్డి. కానీ… ముందుగా ఖరారైన కార్యక్రమాల వల్ల విచారణకు రాలేనని సిట్ అధికారులకు వర్తమానం పంపారు. అదేసమయంలో… ఎక్స్‌లో కర్మ సిద్ధాంతం గురించి పెట్టిన పోస్ట్…. మిలియన్ డాలర్ క్వశ్చన్‌గా మారిపోయింది. అలాగే అన్ని రాజకీయ పార్టీలు రాజధర్మం పాటించాలంటూ హిందీ వాక్యాన్ని జోడించటంతో ఆయన ఏ పార్టీని ఉద్దేశించి అలా రాసి ఉంటారన్న చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అందరికంటే ఎక్కువగా…రాజధర్మాన్ని పాటించాల్సిన బాధ్యత అధికార పార్టీల మీదే ఉంటుంది కాబట్టి… ఆ లైన్ కూటమి ప్రభుత్వాన్ని గురించే అయి ఉండవచ్చన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి. ఓ వైపు విజయసాయిరెడ్డి తిరిగి వైసీపీలోకి వెళ్తారన్న ప్రచారం పీక్స్‌లోకి వెళ్లటం, అటు పార్టీగానీ, ఇటు సాయిరెడ్డి టీం కానీ.. ఆ విషయంలో రియాక్ట్ అవకపోవడంతో అనుమానాలు పెరుగుతున్నాయట. దీంతో పాటు వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని కూడా ఆయనకు హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నానని చెప్పుకొచ్చారు సాయిరెడ్డి. ఎన్నో సంక్షేమ పథకాలతో ఉమ్మడి ఏపీలో పేదలకు గౌరవప్రదమైన జీవితాన్ని వైఎస్సార్ అందించారంటూ ఆకాశానికెత్తేశారు. వీటన్నిటినీ కలిపి చూసుకుంటూ… సోషల్ మీడియాలో ఎవరి స్టోరీలు వాళ్ళు రాసేసుకుంటున్నారు. తాజా ట్వీట్‌లో రాజధర్మం గురించి ప్రస్తావించడాన్ని చూస్తుంటే… ఆయన అధికార పార్టీకే ఆ లైన్‌లో ఏదో సందేశాన్ని పంపి ఉంటారన్న చర్చ నడుస్తోంది పొలిటికల్ సర్కిల్స్‌లో.
ఇక భగవద్గీత శ్లోకాన్ని పోల్చి చూసుకున్నా… తప్పు చేసిన వాళ్ళు అనుభవించాల్సిందేనన్న అర్ధం వచ్చేలా ఉందని చెప్పుకుంటున్నారు. అదే సమయంలో పద్ధతి ప్రకారం కేసు విచారణ చేయకుండా తమ ఇష్టానుసారం విచారణ చేస్తే అది రాజధర్మం అనిపించుకోదని అధికార పార్టీకి కూడా చెప్పినట్టు అనిపిస్తోందన్నది మరి కొందరి విశ్లేషణ. ఎంపీ పదవికి రాజీనామా చేసి, వైసీపీకి గుడ్‌బై చెప్పి… తానిక రాజకీయాల్లో ఉండనని, వ్యవసాయం చేసుకుంటానని గతంలో చెప్పాకు సాయిరెడ్డి. దాంతో ఆయన ఇక పలుగు.. పార పడతారని లెక్కలేసుకున్నారట కొందరు. ఆ లెక్కసేసిన పేపర్ మీద ఇంకు ఆరక ముందే…. ఆయన టీవీ స్క్రీన్లపై ప్రత్యక్షం అవ్వటం..వేరే కేసు విచారణ కోసం వచ్చి లిక్కర్ స్కాంని కెలకడం, రాజ్ కేసిరెడ్డి గురించి ప్రస్చావించడంతో… ఒక్క సారిగా అటెన్షన్ అటువైపు మళ్ళింది. ఇంకా చెప్పాలంటే… సాయిరెడ్డి టిప్ ఇచ్చాకే… ఏపీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు ముందుకు కదిలిందన్నది విస్తృతాభిప్రాయం. అంతలోనే అప్పుడు… తనకు మాజీ సీఎం జగన్ అంటే ఎంతో అభిమానమని.. తాను ఆయనకు ఇబ్బంది కలిగించే పనులు అసలు చేయనని కూడా ఎక్స్ మెసేజ్‌లు పెట్టారు. పనిలో పనిగా… పార్టీలో నంబర్ 2 గా ఉండే తాను కూడా జగన్ చుట్టూ ఉన్న కోటరీ వల్లే దూరం కావాల్సి వచ్చిందంటూ.. తనకు జగన్ పై ఉన్న అభిమానాన్ని తెలియజేసే ప్రయత్నం చేశారాయన. ఇవన్నీ అందరూ మరచి పోతున్నారు అనుకునేలోపు కేసు విచారణ కోసం రావాలంటూ సిట్ అధికారులు మరోసారి ఆయనకు నోటీసులు ఇచ్చారు. దీంతో… కొత్తగా ఏం బాంబులు వేస్తారోనని ఉత్కంఠగా చూస్తుండగానే… తనకు పది రోజుల సమయం కావాలని సిట్‌ను కోరారు. అక్కడితో ఊరుకోకుండా… భగవద్గీత శ్లోకాన్ని కోట్ చేస్తూ… ఎక్స్ మెసేజ్ పెట్టడంతో… విజయసాయిరెడ్డి ఉద్దేశ్యం ఏమై ఉంటుందంటూ… రకరకాల విశ్లేషణలు పెరుగుతున్నాయి. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా.. ఆయన గీతోపదేశం మాత్రం అర్ధం అవ్వాల్సన వారికి క్లియర్ కట్ గానే అర్ధమై ఉంటుందని అంచనా వేస్తున్నారు పొలిటికల్ పండిట్స్. లిక్కర్ కేసు దర్యాప్తును ఆయన కొత్త మలుపులు తిప్పుతారా.. లేక యూ టర్న్ తీసుకుంటారా అన్నది ఉత్కంఠగా మారింది.