Off The Record: ట్రబుల్ షూటర్…. ఈ మాట వినగానే….. కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా ఠక్కున గుర్తుకు వచ్చే పేరు హరీష్‌రావు. ఉద్యమ సమయంలో… కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో చేరింది బీఆర్‌ఎస్. అప్పుడు ఎమ్మెల్యేగా కూడా లేని హరీష్‌రావుని మంత్రిని చేశారు కేసీఆర్. అలాగే హరీష్ కూడా మామకు నమ్మిన బంటు అనడంలో ఆశ్చర్యం లేదంటారు పొలిటికల్ పండిట్స్. అదంతా నాణేనికి ఒకవైపు… మరోవైపు మాత్రం ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో ఆయన మీద రకరకాల పుకార్లు పుడుతూనే ఉన్నాయి. నాడు తెలంగాణ కోసం రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గం నుంచి తప్పుకుని రాజీనామా చేశారు హరీష్. ఆ తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి ఆయన కాంగ్రెస్‌లో చేరతారన్న ప్రచారం జరిగింది. అంతా సెట్ అయిపోయిందని, ఇక హరీష్‌రావు మూడు రంగుల కండువా కప్పుకోవడమే మిగిలి ఉందన్నంతగా చెప్పుకున్నారు అప్పట్లో. కానీ… ఫైనల్‌గా అలాంటిదేం జరగలేదు.
Read Also: Rekha Gupta: కాల్పుల విరమణపై కేంద్రాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు
ఇక బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక చాలా కీలకంగా ఉన్నారు హరీష్ రావు. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు, రాజకీయ ఇబ్బందులు వచ్చినప్పుడు రకరకాల సంప్రదింపులతో ట్రబుల్ షూటర్‌గా పేరుంది ఆయనకు. అంచ ఉన్నాసరే… ఆయన మీద ప్రచారాలు మాత్రం ఆగడం లేదు. ఎప్పటికప్పుడు శీల పరీక్షకు నిలబడుతూ…. సమాధానం చెప్పుకోవాల్సి వస్తోందన్న అభిప్రాయం బలంగా ఉంది పొలిటికల్ సర్కిల్స్‌లో. ప్రతి ఎన్నికల సమయంలో ఆయన పార్టీ మారతారన్న ప్రచారం గుప్పుమంటోంది. కేటీఆర్‌కు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చినప్పుడు హరీష్ తీవ్ర వత్తిడిలో ఉన్నారని, ఇక కారు దిగేస్తారని ఓ రేంజ్‌లో చెప్పుకున్నారు. కానీ.. ఆ ప్రచారాన్ని ఖండించారాయన. కేసీఆర్ గీసిన గీత దాటను… మామ మాటే నా బాట అంటూ కుండ బద్దలు కొట్టేశారు. ఇక ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ట్రబుల్ షూటర్ మీద ప్రచారాలు ఆగలేదు. ఈసారి ప్రచారంలో పార్టీ మారిపోయింది. కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకుని ఆయన బీజేపీలోకి వెళతారంటూ సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరిగింది. ఆ టైంలో కూడా హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఇక పార్లమెంటు ఎన్నికల సమయంలో సైతం అదే సీన్. బీజేపీ లేదా కాంగ్రెస్… ఏదో ఒక జాతీయ పార్టీలోకి వెళ్తారని ప్రచారం జరగడం, ఆయన ఖండించడం షరా మామూలే. అంతదాకా ఎందుకు….బీఆర్‌ఎస్ రజతోత్సవ వేడుకల వేళ కూడా ఆయన మీద ఇదే ప్రచారం గతంలోకంటే ఉధృతంగా జరిగింది సోషల్ మీడియాలో. ప్లీనరీ బహిరంగ సభ కంటే ముందే ఆయన గులాబీ కండువా పక్కన పడేస్తారంటూ… సోషల్ మీడియాలో ఎవరికి నచ్చిన స్టోరీస్ వాళ్ళు అల్లేసుకున్నారు. మళ్ళీ సేమ్ సీన్. అక్కడితో ఆగారా?… అదీ లేదు.
Read Also: Off The Record: రీఛార్జ్ మోడ్‌లోకి పార్టీ..? వైసీపీ కొత్త గేమ్ ప్లాన్..?
ఈసారి ఏకంగా హరీష్‌రావు కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ మరో ప్రచారం. దీనిపై పార్టీ నాయకులు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఇలా… సందర్భం వచ్చిన ప్రతిసారి…. హరీష్‌రావు పార్టీ మార్పు మీద ఏదో ఒక ప్రచారం జరగడం, ఆయన ఖండించడం జరిగిపోతున్నాయి. చివరికి ఈసారి… తాను కేసీఆర్ వెనకే ఉంటానని, క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తానంటూ ప్రెస్ నోట్ విడుదల చేయాల్సి వచ్చింది. కేసీఆర్ గీసిన గీతను దాటబోనని, పార్టీ నాయకత్వాన్ని కేటీఆర్‌కి అప్పగించాలని ఆయన డిసైడైతే… పూర్తిగా స్వాగతిస్తానని కూడా చెప్పారు హరీష్. ఇప్పటికే వందసార్లకు పైగా అదే విషయం చెప్పానని.. జీవితాంతం బీఆర్ఎస్ కార్యకర్తగానే కొనసాగుతాను అన్నారాయన. అయితే… ప్రతిసారి, ఆయన మరో మాట లేకుండా వివరణ ఇస్తున్నా… ఇంకో ఆలోచన లేదని చెబుతున్నా… అలాంటి ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు? ఎవరు పుకార్లు పుట్టిస్తున్నారన్నది ఇక్కడ ప్రశ్న. హరీష్‌రావుని బద్నాం చేస్తే… ఎవరికి లాభం అని తాజాగా ఆరా తీస్తున్నాయట రాజకీయ వర్గాలు. అసలు మా నాయకుడు పదేపదే శీల పరీక్షకు నిలబడాల్సిన అవసరం ఏంటన్నది ఆయన అనుచరుల క్వశ్చన్. మాస్ లీడర్‌గా ప్రజల్లో గుర్తింపు ఉన్న హరీష్ మీద పుకార్లు పుట్టించి ఆయన క్రెడిబిలిటీని తగ్గించడం ద్వారా బీఆర్‌ఎస్‌ని దెబ్బ కొట్టాలన్న వ్యూహం కూడా ఉండి ఉండవచ్చన్నది కొందరి అనుమానం. కారణం ఏదైనా… సందర్భం వచ్చిన ప్రతిసారి హరీష్‌కు లింక్ పెట్టి ప్రచారం చేయడం వెనక మాత్రం ఏదో పెద్ద లాబీనే పని చేస్తుండవచ్చన్నది ఆయన వర్గం అనుమానమని తెలుస్తోంది.