Off The Record: కాంగ్రెస్ నల్గొండ ఎంపీ అభ్యర్థిగా సీనియర్ నేత జానారెడ్డి పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డిని ప్రకటించింది పార్టీ హై కమాండ్. ఆ ప్రకటన మీదే ఇప్పుడు కొందరు సీనియర్స్, ఇతర నాయకులు మండిపోతున్నారట. అంతా మీరేనా.. ? అన్నీ మీకేనా? మాకు టిక్కెట్స్ లేవా? కనీసం మాపేర్లు పరిగణనలోకి కూడా తీసుకోరా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. ఇదే టైంలో అసెంబ్లీ ఎన్నికలప్పుడు సూర్యాపేట టికెట్ ఆశించి భంగపడి, నల్లగొండ లోక్‌సభ సీటు హామీ పొందిన పటేల్ రమేష్ రెడ్డి సంగతి ఏంటన్న ప్రస్తావన కూడా వస్తోంది. పార్టీ సీనియర్ నేతలు ఇచ్చిన హామీకి కూడా దిక్కులేదా అని ప్రశ్నిస్తున్నారు. నోటి మాటగా కాకుండా అప్పటి నల్లగొండ ఎంపీ, ప్రస్తుత రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరో సీనియర్ నేత రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి లిఖిత పూర్వకంగా తమ లెటర్ హెడ్స్ మీద రాసి సంతకాలు చేసి ఇచ్చారు. ఆ లేఖలే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా గ్రూప్స్‌లో సర్క్యులేట్ అవుతున్నాయి. వాటికింద ఇదేనా మీ నిబద్ధత అన్న కామెంట్స్ కూడా వస్తుండటంతో ఉక్కిరి బిక్కిరి అవుతోందట నల్గొండ కాంగ్రెస్.
ఈ టిక్కెట్ ఆశించిన ఇంకొందరు నేతలైతే… ఉదయ్ పూర్ డిక్లరేషన్ నల్లగొండ జిల్లా కాంగ్రెస్ సీనియర్లకు వర్తించదా? డిక్లరేషన్లు, తీర్మానాలు, రూల్స్ అన్నీ మాకు,… పదవులు, కీలక భాధ్యతలు మాత్రం పెద్దపెద్ద హోదాలు ఉన్న వాళ్లకా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి, ఆయన భార్య పద్మావతి కోదాడ నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కోమటిరెడ్డి ఫ్యామిలీ నుంచి వెంకటరెడ్డి నల్లగొండ, రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మరో సీనియర్ నేత జానారెడ్డి కుటుంబం నుండి ఆయన చిన్న కుమారుడు జైవీర్ రెడ్డి నాగార్జునసాగర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డికి నల్లగొండ ఎంపీ టిక్కెట్ ఇవ్వడాన్నిఎలా సమర్ధించుకుంటారని ప్రశ్నిస్తున్నారు సదరు నేతలు. కొత్త పాత అన్నదాంతో సంబంధం లేకుండా… పెద్దోళ్ళ పేర్లు చెప్పి ఇలా ఫ్యామిలీ ప్యాకేజీలు తీసుకుంటే… ఇక మాకెప్పుడు అవకాశాలు? మేం ఎదిగేది ఎన్నడు అని ప్రశ్నిస్తున్నారు నల్గొండ కాంగ్రెస్ ఇతర సీనియర్ లీడర్స్. భార్య, తమ్ముడు, చిన్నకొడుకు, పెద్దకొడుకు, ఇలా అంతా వాళ్ళేనా? ఇతర పార్టీల నుండి వచ్చిన నేతలు, సీనియర్ నేతల కీలక అనుచరులకు మాత్రమే టిక్కెట్ అడిగే అర్హత ఉంటుందా. అన్నది ఆశావహుల క్వశ్చన్.
బీఆర్ఎస్ హవా నడుస్తున్నప్పుడు… క్యాడర్ కేసులపాలైతే… వీళ్ళంతా ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నారు. తమ పేరు కనీసం టిక్కెట్ రేసులో చర్చకు కూడా రాకుండా కొందరు సీనియర్లు అడ్డుపడుతున్నారని ఆవేదనగా ఉన్నారట నల్గొండ కాంగ్రెస్ నేతలు. పెద్దోళ్ళ వ్యవహారశైలే తమ రాజకీయ ఎదుగుదలకు అడ్డుగా ఉందని లోలోపల రగిలిపోతున్నట్టు తెలిసింది. గతంలో ఒకరి పేరు మరొకరు పలకడానికి కూడా ఇష్టపడని, ఎదరుపడితే పలకరించుకోకుండా ముఖం చాటేసుకున్న సీనియర్లు… ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా మారేసరికి ఫ్యామిలీ ప్యాకేజీలతో దిగిపోతున్నారని, అంతా బాగున్నప్పుడు మేమున్నామని వచ్చేవారికంటే……. పార్టీ కష్టం కాలంలో ఉన్నప్పుడు అంటిపెట్టుకుని ఉన్న వారికి అవకాశం ఇవ్వకూడదా…. అని గాంధీభవన్ పెద్దలను ప్రశ్నిస్తున్నారు నల్గొండ నేతలు. ఎంపీ అభ్యర్థిగా రఘువీర్ పేరు ప్రకటనతో ఆధిపత్యపోరుకు తెరలేచినట్లేనని, అంతా కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నారనే చర్చజరుగుతోంది. ఈ పరిస్థితుల్లో రేపు ఎన్నికలప్పుడు ఎవరు ఎంత మేరకు సహకరిస్తారు? సహకరించినట్టు నటించి కొంప ముంచేవాళ్ళు ఎవరన్న ప్రస్తావన కూడా వస్తోంది.