Off The Record: వైసీపీలో అభ్యర్థులే లేరు. అక్కడి నుంచి ఇక్కడికి.. ఇక్కడి నుంచి అక్కడికి ఎత్తిపోతల వ్యవహారాలు చేస్తున్నారు. ఒకచోట చెత్త ఇంకో చోట బంగారం అవుతుందా..? ఇవీ… వైసీపీలోని మార్పులు చేర్పులను ఉద్దేశించి టీడీపీ పదే పదే అంటున్న మాటలు. అలాగే పోటీకి అభ్యర్థుల్లేక ఎవరెవర్నో తెచ్చి పెడుతున్నారని కూడా విమర్శలు గుప్పిస్తూనే ఉంది టీడీపీ. కానీ.. రాజకీయం కాబట్టి పైకి అలాంటి మాటలు అంటున్నా.. అదే సందర్భంలో స్థానచలనం పొందిన నేతలను చూసి.. వారు చేస్తున్న పనులను చూస్తూ ప్రతిపక్ష పార్టీ ఉలిక్కి పడుతోందట. చాలా చోట్ల కొత్త ఇన్చార్జులు పరిస్థితుల్ని చక్కబెట్టుకునే పనిలో నిమగ్నం కావడమే కాకుండా.. ప్రత్యర్థి పార్టీల్లోని అసంతృప్తులను దారికి తెచ్చుకోవడంలో బిజీ బిజీగా ఉన్నట్టు తెలిసింది.
వాళ్ల పార్టీలోని అసంతృప్తులను దారి తెచ్చుకోవడమే కాకుండా.. పక్క పార్టీల మీద కన్నేసేంత స్థాయిలో వ్యవహారాలను చక్కబెట్టుకుంటున్నారంటే వాళ్ళ పనితీరు ఏ స్థాయిలో ఉందో… అర్థం చేసుకోవచ్చనేది టీడీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఇదే సందర్భంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, విజయ సాయి రెడ్డి వంటి వారి విషయమై టీడీపీలో ఇంకా ఆసక్తికర చర్చ జరుగుతుున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ ఇద్దరు నేతలు స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్‌పై పార్టీలో విపరీతంగా చర్చ జరుగుతోన్నట్టు సమాచారం. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లా నేతల్లో ఈ తరహా చర్చ ఎక్కువగా ఉందంటున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రజలను.. ఓటర్లను మేనేజ్ చేయడంలో, అందరినీ పూలప్ చేయడంలో దిట్ట అని చెబుతున్నారు. రకరకాల మార్గాల్లో పార్టీలోని కేడర్‌ను తన దారికి తెచ్చుకోవడంలో చెవిరెడ్డి అందెవేసిన చేయి అంటున్నారు. పైగా ప్రకాశం జిల్లాలో చెవిరెడ్డికి చెందిన ప్రత్యేక టీంలు ఇదే పని మీద పూర్తి స్థాయిలో రంగంలోకి దిగి.. పని చక్కబెడుతున్నట్టు సమాచారం.
ఒంగోలు ఎంపీ సీట్లో వైసీపీ తరపున బరిలో దిగుతున్న చెవిరెడ్డి… ఇప్పటికే సగానికి పైగా పనిని క్షేత్ర స్థాయిలో పూర్తి చేసేశారనేది టీడీపీ వర్గాల్లో టాక్. ఈ క్రమంలో చెవిరెడ్డి సొంత సెగ్మెంట్ చంద్రగిరిలో ఆయన పనితీరు ఏ విధంగా ఉంటుందనే అంశంపై పార్టీ నేతలు ఆరా తీస్తున్నారట. పండుగలు, పబ్బాలు,.. ఇతర ముఖ్యమైన కార్యక్రమాలకు భారీ ఎత్తున బహుమతులను జనానికి పంచడం చెవిరెడ్డికున్న అలవాటు. ఇక కరోనా సమయంలో కూడా చంద్రగిరి ప్రజలకు భారీ ఎత్తున సాయం చేశారాయన. ఎన్నికల సమయంలో అయితే ఓటర్లకు కానీ.. కేడర్‌కుగానీ… పండుగే పండుగట. ఇప్పుడు ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని వివిధ నియోజకవర్గాల్లో కూడా ఇదే తరహా విధానాన్ని అవలంభించాలని ప్రణాళికలు సిద్దం చేస్తున్నారట చెవిరెడ్డి. దీంతో ఆయన్ని ఏ విధంగా ఎదుర్కొవాలనే దానిపై టీడీపీ వర్గాల్లో ఓ రేంజ్‌లో చర్చ జరుగుతున్నట్టు తెలిసింది.
మరోవైపు విజయసాయి రెడ్డి గురించి కూడా ఇదే తరహా చర్చ నడుస్తోంది. ఎవ్వరూ ఊహించని విధంగా విజయసాయి రెడ్డి తెర మీదకు వచ్చారు. సొంత జిల్లానే కావడంతో… నెల్లూరు నేతలందరికీ ఆయన గురించి అవగాహన ఉంది. కానీ ఎన్నికల్లో వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందన్నది మాత్రం పెద్దగా తెలియదు. అందుకే నెల్లూరు లీడర్స్ చాలామంది విశాఖ నాయకులకు ఫోన్లు చేసి విజయసాయి గురించి ఆరా తీస్తున్నట్టు తెలిసింది. అలాగే నెల్లూరు జిల్లాలోని టీడీపీ నేతల ఇళ్లల్లో భారీ ఎత్తున సోదాలు జరగడం వెనుక విజయసాయి రెడ్డి ఉన్నారనే చర్చ టీడీపీ వర్గాల్లో జరుగుతోంది. ఈ స్థాయిలో ప్రతిపక్ష నేతలు, కేడర్‌ని భయభ్రాంతులకు గురి చేయడమనేది వైసీపీ వ్యూహమని.. విశాఖలో కూడా గతంలో చాలా మంది టీడీపీ నేతలను టార్గెట్ చేసుకుని వాళ్ల ఆస్తులు.. భవనాలపైకి బుల్డోజర్లు వెళ్లిన అంశాన్ని గుర్తు చేస్తున్నారు కొందరు నేతలు. ఇప్పుడు అదే తరహాలో నెల్లూరులో కూడా ఏకరీతిన టీడీపీ నేతల ఇళ్లలో సోదాలు చేపట్టడంతో ఇదంతా విజయసాయి రెడ్డి ఆపరేషనా..? అనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో చెవిరెడ్డి, విజయసాయి రెడ్డి వంటి వారిని ఏ విధంగా కంట్రోల్ చేయాలి..? వాళ్ల వ్యూహాలకు ప్రతి వ్యూహాలు ఏ విధంగా రచించాలనే దానిపై అన్ని కోణాల్లో ఆలోచించాల్సిన అవసరం ఉందన్న భావన టీడీపీ వర్గాల్లో విన్పిస్తోంది.