Off The Record: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌తో కలిసే మా ప్రయాణం. అది సుత్తీ కొడవలి అయినా… కంకీ కొడవలి అయినా… ఖచ్చితంగా కారులోనే ఉంటాయని ఘంటాపథంగా చెప్పారు రెండు పార్టీల నాయకులు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో మనమంతా ఒక్కటేనని భుజాలు భుజాలు కలిపి తిరిగేశారు లెఫ్ట్, బీఆర్‌ఎస్ నేతలు. ఆ ఎన్నిక ముగిసింది. ఆ తర్వాత ఎర్ర పార్టీలకు ప్రగతి భవన్ డోర్స్ క్లోజ్ అయిపోయాయి. సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోసం చాలాసార్లు ప్రయత్నించారట కమ్యూనిస్టులు. అయినా వాళ్లకు అపాయింట్‌మెంట్ దొరకలేదు. అలాగని అసెంబ్లీ ఎన్నికల్లో కలిసే పోటీ చేద్దామని బీఆర్‌ఎస్ వైపు నుంచి సంకేతాలు రాలేదు. అయినా సరే.. లెఫ్ట్ పార్టీల వన్‌సైడ్ లవ్ కొనసాగింది. చివరి నిమిషంలోనైనా పొత్తులో పోటీ చేయవచ్చని ఆశించారు. కానీ… బీఆర్‌ఎస్ ఫస్ట్ లిస్ట్‌కు టైం ఫిక్స్ చేసినా.. సీపీఐకి గానీ, సీపీఎంకి గానీ పిలుపు రాలేదు.
అలా ఎందుకని ఆరా తీస్తే.. లెక్కలు కుదరలేదన్నది సమాచారం. వచ్చే ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు రెండు ఎమ్మెల్యే సీట్లు, తర్వాత ఒక ఎమ్మెల్సీ సీటు అడిగాయట. బీఆర్‌ఎస్ మాత్రం రెండు ఎమ్మెల్సీలు ఒక ఎమ్మెల్యే సీటు ఇవ్వడానికి సిద్ధమైనట్టు తెలిసింది. అది కూడా కేసీఆర్ నేరుగా మాట్లాడకుండా కొందరు ఖమ్మం జిల్లా నేతలతో మాట్లాడించినట్టు ప్రచారం జరుగుతోంది. సీపీఎం భద్రాచలం, సీపీఐ మునుగోడు సీట్లు అడగ్గా బీఆర్‌ఎస్ అందుకు సుముఖంగా లేనట్టు తెలిసింది. చెప్పాల్సింది చెప్పేశాం.. ఇక మీ ఇష్టం అని డోర్స్ క్లోజ్ చేశారట బీఆర్‌ఎస్ లీడర్స్. దీంతో ఏం చేయాలో పాలుపోక దిక్కులు చూడటం లెఫ్ట్ వంతయింది.
అదే సమయంలో…. ఎన్నికల వ్యూహాల్లో దిట్టగా పేరున్న కేసీఆర్ మనసులో మరో ఆలోచన ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. లెఫ్ట్ పార్టీలతో పొత్తు లేకుండా వాళ్ళు సింగిల్‌గా బరిలో దిగితే కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ను దెబ్బ కొట్టవచ్చన్నది ఆయన వ్యూహగా చెబుతున్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో లెఫ్ట్ పార్టీలు బలంగా ఉన్నాయి. అక్కడ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అనుచరగణంతో కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఆ బలం కాంగ్రెస్‌కు ఉపయోగపడకుండా… ఉండాలంటే లెఫ్ట్ పార్టీలు సింగిల్‌గా పోటీ చేసి ఓట్లు చీలితే… తమకు లాభం కలుగుతుందన్నది బీఆర్‌ఎస్ అధినేత వ్యూహం అంటున్నారు. మరి ఎన్నికల నాటికి ఈ ఎత్తులు ఎలా వర్కౌట్ అవుతాయో చూడాలి.