Off The Record: లోక్‌సభతో పాటు.. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒకే షెడ్యూల్లో జరగనున్న క్రమంలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఉమ్మడిగా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి టీడీపీ-జనసేన. మేనిఫెస్టో, సీట్ల సర్దుబాటుపై రెండు పార్టీల అధ్యక్షులు కసరత్తు చేస్తున్నారు. అలాగే బహిరంగ సభలు నిర్వహించే అంశం పైనా ఇద్దరి మధ్య కీలక చర్చ జరిగినట్టు తెలిసింది. ఇదంతా ఓ ఎత్తయితే…. బీజేపీ రూపంలో వచ్చే ప్రమాదం మరో ఎత్తు అన్నట్టుగా ఉందట ఇప్పుడు వ్యవహారం. ఎన్నికల్లో టీడీపీతో కలిసి వెళ్లాలని జనసేన ఓవైపు ఫిక్స్ అయినా.. ఇంకా బీజేపీతో కలిసే ఉంది. తెలంగాణ ఎన్నికల్లో కూడా ఆ పార్టీతో కలిసి పోటీ చేసింది. ఇప్పుడిదే టీడీపీకి ఇబ్బందికరకమైన.. సంకటంగా మారే అంశంగా కన్పిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ-జనసేనతో కలిసి తాము కూడా పొత్తులోకి వస్తామని బీజేపీ పట్టుబడితే పరిస్థితేంటనే దిశగా ఇప్పుడు టీడీపీ వర్గాల్లో చర్చ మొదలైందట. కాషాయ పార్టీ నేరుగా అలా అడిగితే …. ఏం చేయాలో తెలియక కిందా మీదా పడుతున్నారట టీడీపీ నాయకులు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్లడం చంద్రబాబు, లోకేష్ సహా పార్టీ ముఖ్యులెవరికీ ఇష్టం లేదు. కాషాయంతో కలిసి వెళ్తే నష్టమే తప్ప.. ఎలాంటి లాభం ఉండదన్నది ఆ పార్టీ నేతల అభిప్రాయంగా తెలిసింది. ఈ పరిస్థితుల్లో బీజేపీ సై అంటే దానికి నో అని ఎలా చెప్పగలమనేది టీడీపీ నేతలను వేధిస్తున్న ప్రశ్నఅట. పైగా మిత్రపక్షంగా ఉన్న జనసేన బీజేపీతో సఖ్యతగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ కనుక పొత్తుకు సిద్దమని ప్రతిపాదిస్తే.. దాన్ని ఆమోదించే దిశగానే జనసేన కూడా ఆలోచించే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ కూడా బీజేపీని కలుపుకుని వెళ్దామని ఒత్తిడి తెచ్చే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నారు సైకిల్ పార్టీ నేతలు. దీంతో బీజేపీని ఎలా వదిలించుకోవాలి..? ఇదే విషయాన్ని పవన్‌కు ఎలా చెప్పాలి..? అనే అంశంపై టీడీపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం. బీజేపీతో ఎన్నికల్లో కలిసి వెళ్తే కొన్ని వర్గాల ఓట్లు కచ్చితంగా దూరమవుతాయన్నది టీడీపీ అంచనా. గత ఎన్నికల్లో వైసీపీకి పెట్టని కోటగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల్లో కొంత మేర మార్పు వచ్చిందని.. బీజేపీతో వైసీపీ సన్నిహితంగా ఉంటుందని అర్ధమైనట్టు అంచనా వేస్తున్నారు తెలుగుదేశం నాయకులు. ఆయా వర్గాల నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు వచ్చే పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే.. ఆ ఓట్లు రావేమోననే ఆందోళన టీడీపీ వర్గాల్లో కన్పిస్తోంది.
ఇదే సందర్భంలో కలిసి నడవడం ఇష్టపడడం లేదనే విషయాన్ని బీజేపీ అధినాయకత్వానికి కూడా చాలా జాగ్రత్తగా చెప్పాల్సి ఉంటుందన్న అభిప్రాయం ఉంది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ మూడు చోట్ల గెలిచింది. జాతీయ స్థాయిలో ఆ పార్టీ బలం ఎలా ఉందన్నది చెబుతున్నాయి ఎన్నికల ఫలితాలు. ఈ పరిస్థితుల్లో బీజేపీని కాదంటున్నామనే విషయాన్ని చెప్పే క్రమంలో చాలా జాగ్రత్తగా డీల్ చేయాలంటున్నారట. ఏ మాత్రం తేడా జరిగినా.. కాషాయదళం ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోందట. దీంతో ఈ వ్యవహారం మొత్తం కత్తి మీద పొత్తుగా మారిందని అంటున్నారు. ఈ విషయంలో బీజేపీ పెద్దలను ఒప్పించడమే కాకుండా.. పవన్‌కు నచ్చచెప్పుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. ఇక తప్పదు అనుకుంటే కొంత నష్టానికి సిద్దపడే బీజేపీతో పొత్తుకు వెళ్లక తప్పదని అంటున్నారట తెలుగు తమ్ముళ్లు. ఈ పరిస్థితుల్లో ఏపీ పొత్తుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోననే ఉత్కంఠ పెరుగుతోంది.