Off The Record: సోము వీర్రాజు ఏపీ బీజేపీ బండిని లాగలేకపోతున్నారని, పార్టీ నేతలతో సరిగా వ్యవహరించలేకపోతున్నారని, ఆయన కారణంగానే చాలామంది బయటికి వెళ్ళిపోతున్నారని రకరకాల ప్రచారాలు జరిగాయి. పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదులు అదే రేంజ్‌లో వెళ్ళాయి. మిత్ర పక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వీర్రాజు తీరు మీద గుర్రుగా ఉన్నారట. దీంతో ఇవాళ కాకుంటే రేపైనా ఆయన్ని ఇంటికి పంపడం ఖాయమన్న అభిప్రాయం చాలా మంది పార్టీ నాయకుల్లో ఉందట. అలాంటి చర్చ తెర మీదకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ కడప జిల్లా నేత, యాదవ సామాజిక వర్గానికి చెందిన సత్య కుమార్ పేరు తెర మీదకు వచ్చేది. పార్టీ పరంగా వెంకయ్యనాయుడుకు ఎంత అనుబంధం.. పరిచయాలు ఉన్నాయో.. సత్యకు కూడా అదే స్థాయిలో పరిచయాలు ఉన్నాయి. దీంతో ఈసారి ఎన్నికల్ని సత్యకుమార్ సారధ్యంలోనే ఎదుర్కొంటామని మానసికంగా ఫిక్సయ్యారట ఏపీ కాషాయ దళంలోని చాలామంది. కానీ… చివరికి ఎవ్వరూ ఊహించని విధంగా పురంధేశ్వరి తెర మీదికి రావడంతో సత్యకు ఎక్కడ తేడా కొట్టిందన్న విశ్లేషణలు మొదలయ్యాయి.
వెంకయ్య నాయుడికి అనుచరుడని సత్యకుమార్ మీద ముద్ర ఉంది. దీంతో సహజంగానే టీడీపీ ముద్ర కూడా పడిపోయిందన్నది ఓ విశ్లేషణ. బీజేపీలో ఉన్నా .. ఆయన టీడీపీ అనుకూలుడిగానే వ్యవహరిస్తుంటారని, ఆ పార్టీ నేతలతో అనుబంధం ఉందన్న ప్రచారం జరుగుతోంది. మరి ఆ ఒక్క ఈ కారణంతోనే ఆయన్ని దూరం పెట్టారా..? అంటే … కాదనేది పార్టీ వర్గాల సమాధానం. సత్యకుమార్‌కు, అధిష్టానానికి యూపీ ఎన్నికల తర్వాత నుంచి గ్యాప్ పెరుగుతూ వచ్చిందనేది ఇంటర్నల్ టాక్.
యూపీలో బీజేపీ గెలిచాక.. అక్కడ కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇన్ఛార్జ్‌గా ఉన్న సత్యకుమార్‌కు ఏపీలో భారీ ఎత్తున సన్మానాలు జరిగాయి. అది తప్పు కాకున్నా.. సోము వీర్రాజు వ్యతిరేక వర్గం ఆ సన్మానాలను లీడ్ చేయడం..ఆయన్ని విపరీతంగా పొగిడేయడంతో… నాటి పార్టీ అధ్యక్షుడి వర్గం ఇబ్బందిగా ఫీలైందట. పైగా యూపీలో బీజేపీని సత్యకుమారే ఒంటి చేత్తో గెలిపించారన్నంతగా ఏపీలో బిల్డప్ ఇస్తూ… సన్మానాలు చేయించుకుంటున్నారని అధిష్టానానికి కొందరు ఫిర్యాదు చేశారట. దీంతో అధినాయకత్వం సీరియస్ అయిందని, దాని పర్యవసానమే ఈ నిర్ణయమని అంటున్నారు కొందరు నాయకులు.
ఇక రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. మేం అడక్కుండానే వైసీపీ మద్దతిస్తోందని, వాళ్ల మద్దతు మాకేం అవసరం లేదనే రీతిలో చేసిన కామెంట్స్ అప్పట్లో దుమారం రేపాయి. ఆ మాటల్ని వైసీపీ సీరియస్‌గా తీసుకుని ఫిర్యాదులు చేయడంతో డిఫెన్స్‌లో పడ్డారట బీజేపీ పెద్దలు. సత్యకుమార్ కామెంట్లు ఆయన వ్యక్తిగతమే తప్ప.. పార్టీ వాయిస్‌గా తీసుకోవద్దని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఈ ఎపిసోడ్ బీజేపీలో సత్యకుమార్‌కున్న ట్రాక్ రికార్డ్‌పై మాయని మచ్చగా మిగిలిపోయిందన్నది పార్టీ వర్గాల అభిప్రాయం.
ఈ క్రమంలోనే అధ్యక్ష పదవికి.. సత్యకుమార్ పేరు వచ్చిన ప్రతిసారి ఈ లోగుట్టు తెలిసిన వారు మాత్రం ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ హైకమాండ్ అంగీకరించబోదని చెప్పుకొచ్చేవారట. ఇప్పుడీ నిర్ణయంతో చూశారుగా… మేం చెప్పిందే నిజమైందని సదరు నేతలు నాటి వ్యవహారాలను గుర్తు చేస్తున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి బీజేపీలో సత్యకుమార్‌కు అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉన్నా.. ఈ మచ్చ.. మరకల కారణంగా అధ్యక్ష స్థానాన్ని దక్కించుకోలేకపోయారన్నది పార్టీ వర్గాల అభిప్రాయం. మరి ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.