కామ్రేడ్స్… కాంగ్రెస్ మీద అలిగారా? అంతా మీ వల్లే… అంటూ నిందిస్తున్నారా? దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో లుకలుకలు మొదలయ్యాయా? ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అగ్గికి ఆజ్యం పోసిందా? తెలంగాణ కామ్రేడ్స్ కూడా మేము సైతం అంటూ… ఓ పుడక వేసేస్తున్నారా? అసలిప్పుడు కమ్యూనిస్ట్‌లు ఏమనుకుంటున్నారు? జరుగుతున్న చర్చ ఏంటి? రకరకాల పొలిటికల్ ఈక్వేషన్స్, ఎన్నో ప్రాధాన్యతల నడుమ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనుకున్న ఇండియా కూటమి వ్యవహారం నానాటికీ తీసికట్టు అన్నట్టుగా మారుతోందంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. మిత్ర పక్షాల మధ్య లుకలుకలు, వరుస పరాజయాలు నైతిక స్ధైర్యాన్ని దెబ్బ తీస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయంటున్నారు. అదే సమయంలో అలకలు చాలవా అన్నట్టు ఇంకో స్టెప్ ముందుకేస్తున్న మిత్రపక్షాల నేతలు కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఇప్పుడసలు ఇండియా కూటమిలో ఏం జరుగుతోందన్న డౌట్స్ వస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్‌లో. కర్ణాటక, తెలంగాణ తప్ప ఇటీవలి కాలంలో ఇంకెక్కడా కాంగ్రెస్ పార్టీ అంత ప్రభావం చూపలేకపోవడంతో… సహజంగానే మిత్ర పక్షాల్లో గౌరవం తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తోందన్నది కొందరి వెర్షన్. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీ నేతల వైఖరి, వాళ్ళ మాటలు కొత్త ప్రశ్నలు లేవనెత్తుతున్నాయట. కాంగ్రెస్ నాయకత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు ఎర్రన్నలు. మాతో సహా… ఇండియా కూటమిలోని ఏ పార్టీతోనూ…కాంగ్రెస్ అధినాయకత్వం సరిగా సమన్వయం చేసుకోలేకపోతోందని అసహనం వ్యక్తం చేస్తున్నారట లెఫ్ట్ నాయకులు. కూటమి నుంచి ఎవైనా పార్టీలు పక్కకు తప్పుకున్నాయంటే… అది కాంగ్రెస్ కారణంగానే అంటూ తాజాగా సీపీఐ నాయకులు కామెంట్ చేస్తున్నారంటే… పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు. అంటే… కూటమికి బీటలు వారుతున్నాయని వామపక్ష నేతలు చెప్పకనే చెబుతున్నారా అన్న డౌట్స్ సైతం వస్తున్నాయట.
ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పునరాలోచించుకోకుంటే…. మొదటికే మోసం వస్తుందన్నది వామపక్ష నేతల వార్నింగ్‌గా చెప్పుకుంటున్నారు. దేశవ్యాప్తంగా కూటమిలో చీలికలు వస్తున్నా… నాయకత్వ స్థానంలో ఉన్న కాంగ్రెస్ అందరినీ కలుపుకుని పోవడంలో విఫలమైందని ఆరోపిస్తున్నారు లెఫ్ట్ లీడర్స్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్ని కూడా ఈ సందర్భంగా ఉదహరిస్తున్నట్టు సమాచారం. కేవలం కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాల వల్లే అక్కడ ఆప్ విడిగా పోటీ చేసిందని, ఫలితంగా ఓట్లు చీలిపోయి బీజేపీ అధికారంలోకి వచ్చిందంటూ విశ్లేషిస్తున్నారట వామపక్ష నాయకులు. ఢిల్లీలో ఆప్ ఓటమికి ఎవరినైనా నిందించాల్సి వస్తే…. అది ముందు కాంగ్రెస్‌నే అన్నది వాళ్ల వెర్షన్‌గా తెలుస్తోంది. తెర వెనక బీజేపీ అనేక కుట్రలు చేస్తున్నా…
కాంగ్రెస్ అధినాయకత్వం పసిగట్టలేకపోతోందని, నాయకత్వ లక్షణం ఇదేనా అంటూ ఫైరైపోతున్నట్టు సమాచారం. కేజ్రీవాల్ అరెస్ట్, జైలు జీవితం, విడుదల లాంటి వ్యవహారాల్లో కాంగ్రెస్ నిర్లక్ష్యమే కొంప ముంచిందన్నది సీపీఐ ఆరోపణ. మొత్తంగా కాంగ్రెస్ అధిష్టానం నిర్లిప్తత, ప్లానింగ్ లేమి, ఒంటెద్దు పోకడలవల్లే ఇండియా కూటమి బలహీనపడుతోందని, అంతిమంగా అది బీజేపీకి బలంగా మారుతోందన్నది సీపీఐ నేతల వెర్షన్‌గా కనిపిస్తోంది. తెలంగాణలో కూడా కాంగ్రెస్, సీపీఐ కలిసే పోటీ చేశాయి. ఈ పరిస్థితుల్లో లెఫ్ట్ తాజా వైఖరి, వ్యాఖ్యలు ఇక్కడ కూడా ఎలాంటి ప్రభావం చూపిస్తాయోనని ఆసక్తిగా గమనిస్తున్నారు పరిశీలకులు.