*కాంగ్రెస్ అంటే దళారీ, పైరవీకారుల రాజ్యం
తెలంగాణ ఎన్నికలు దగ్గర పడే కొద్ది రాజకీయ పార్టీ నేతలు జోరు పెంచుతున్నారు. వీలైనంత వరకు అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేసే విధంగా షెడ్యూల్ చేసుకుని ప్రచారంలో దూసుకుపోతున్నారు. అందులో భాగంగా.. సీఎం కేసీఆర్ తాండూరులో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కత్తి వారికి ఇచ్చి యుద్ధం మనల్ని చేయమనడం సమంజసం కాదు.. ప్రజలు ఆలోచించండని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో తాండూర్ ప్రజలు కాగ్న వాగులో ఉన్న నీటిని తోడుకొని తాగేవారని.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంటింటికి భగీరథ నీటిని అందించామని సీఎం కేసీఆర్ తెలిపారు. రైతుబంధు, 24 గంటలు విద్యుత్ ఉండాలంటే పైలెట్ రోహిత్ రెడ్డిని గెలిపించాలని సీఎం ప్రజలను కోరారు. పార్టీల పనితీరును గమనించి ప్రజలు ఓటు వేయాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు చచ్చేది లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరణిని భూమాత చేస్తా అని అంటున్నారు… భూమాత కాదు భూమేత అవుతాదని కేసీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అంటే దళారీ, పైరవీకారుల రాజ్యమని ఆరోపించారు. తాండూర్ ప్రజలు కర్ణాటక బోర్డర్ లో ఉంటున్నారు.. కర్ణాటకలో కాంగ్రెస్ పాలన ఉంది.. అక్కడ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ ఎంత సమయం ఇస్తున్నారో… ఇక్కడ ప్రభుత్వం ఎంత సమయం వస్తుందో ప్రజలు గమనించాలని సీఎం తెలిపారు. మంత్రి మహేందర్ రెడ్డి ఆశీస్సులు పైలెట్ రోహిత్ రెడ్డికి మెండుగా ఉన్నాయని.. అధికారంలోకి వచ్చిన తర్వాత రోహిత్ రెడ్డి కోరిన పనులన్నీ చేసి చూపిస్తామని పేర్కొన్నారు. బంజారా బిడ్డల కోసం బంజారాహిల్స్ లో బంజారా భవనం వారికి గౌరవ చిహ్నంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిందని సీఎం తెలిపారు. సేవాలాల్ సేన బీఆర్ఎస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. భారీ సంఖ్యలో సభకు ప్రజలు రావడంతో ఇక్కడ గులాబీ జెండా ఎగిరిపోయిందని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
*తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన.. షెడ్యూల్ ఇదే.. !
ప్రధాని మోడీ షెడ్యూల్ ఖరారు అయింది. ఈనెల 25వ తేదీన కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాలో ప్రచారం చేయనున్నారు. ఇక, 26వ తేదీన తుఫ్రాన్, నిర్మల్ పబ్లిక్ మీటింగ్ లో పాల్గొననున్నారు. అలాగే, 27వ తేదీన మహబూబాబాద్, కరీంనగర్ పబ్లిక్ మీటింగ్ తో పాటు హైదరాబాద్ లో రోడ్డు షోలో మాట్లాడనున్నారు. అయితే, అయితే, ఈ నెల ఈనెల 25వ తేదీన మధ్యాహ్నం 1:25 గంటలకు దుండిగల్ విమానాశ్రయానికి ప్రధాని మోడీ చేరుకుని.. అక్కడి నుంచి 2:05 గంటలకు కామారెడ్డిని బీజేపీ నిర్వహిస్తున్న బహిరంగ సభకు చేరుకుంటారు. మధ్యాహ్నం 2:15 నుంచి 2:55 వరకు సభలో పాల్గొంటారు.. ఆ సభ అనంతరం అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4:05 గంటలకు రంగారెడ్డి జిల్లాకు చేరుకుంటారు.. సాయంత్రం 4:15 నుంచి 4:55 గంటల వరకు నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు. అక్కడి నుంచి బయలుదేరి 7:35 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.. అక్కడి నుంచి రోడ్డు మార్గాన రాజ్ భవన్ కు చేరుకుంటారు.. రాత్రికి రాజ్ భవన్ లో ప్రధాని మోడీ బస చేయనున్నారు. ఇక, 26వ తేదీన దుబ్బాక, నిర్మల్ పబ్లిక్ మీటింగ్ లో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు కన్హయ్య శాంతివనంలో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి నేరుగా మధ్యాహ్నం 2 గంటలకు దుబ్బాకకు వెళ్తారు.. 2:15 గంటల నుంచి 2:45 వరకు తుఫ్రాన్ లో నిర్వహించే పబ్లిక్ మీటింగ్ లో మోడీ ఉంటారు.. ఆ సభ అనంతరం నిర్మల్ కు వెళ్లనున్నారు.. మధ్యాహ్నం 3:45 నుంచి సాయంత్రం 4:25 వరకు బహిరంగ సభలో పాల్గొని మాట్లాడుతారు.. అక్కడి నుంచి దుండిగల్ విమానాశ్రయానికి చేరుకుని సాయంత్రం 5:45 గంటలకు తిరుపతికి బయలుదేరనున్నారు. అలాగే, 27వ తేదీన మహబూబాబాద్, కరీంనగర్ పబ్లిక్ మీటింగ్ తో పాటు హైదరాబాద్ లో నిర్వహించే రోడ్డు షోలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారు. 27వ తేదీన తిరుపతి నుంచి బయలుదేరి 11:30 గంటలకు హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.. అక్కడి నుంచి మహబూబాబాద్ చేరుకుని మధ్యాహ్నం 12:45 నుంచి 1:25 వరకు నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు.. ఆ సభ అనంతరం నేరుగా కరీంనగర్ బయలుదేరి వెళ్లనున్నారు.. 2:45 గంటల నుంచి 3:25 వరకు కరీంనగర్ లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు.. ఇక, అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4:40కి హైదరాబాద్ కు చేరుకుంటారు.. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు నిర్వహించే రోడ్ షోలో మోడీ పాల్గొననున్నారు. విమానాశ్రయం నుంచి ఈ రోడ్ షో ప్రారంభం కానుంది.. రోడ్ షో అనంతరం నేరుగా హైదరాబాద్ నుంచి 6:25 గంటలకు ఢిల్లీకి ప్రధాని మోడీ తిరుగు పయనం కానున్నారు.
*కాళేశ్వరం ప్రాజెక్టును చూపించి ఓట్లు అడగగలరా?.. కేసీఆర్‌కు రేవంత్ సవాల్
ఈ ఎన్నికలు ఆశామాషీ ఎన్నికలు కాదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి యాత్రలో రేవంత్ మాట్లాడారు. పదేళ్లలో పోడు భూముల సమస్య తీర్చలేదు.. లంబాడాలను ఆదుకోలేదని ఆయన విమర్శించారు. మంచిప్ప ప్రాజెక్టును పూర్తిచేయలేదన్న ఆయన.. వందరోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పి పదేళ్లయినా హామీ నెరవేర్చలేదన్నారు. కవితను ఇక్కడి రైతాంగం బండకేసి కొట్టారని.. అందుకే అప్పటి నుంచి కేసీఆర్ ఈ ప్రాంత రైతులపై కక్ష కట్టారని ఆయన ఆరోపించారు. బాజిరెడ్డి గోవర్ధన్ నిర్లక్ష్యంతో ఆర్టీసీ కార్మికుల హక్కులను కాలరాశారన్నారు. 50మంది ఆర్టీసీ కార్మికులను పొట్టనబెట్టుకున్నారని ఆయన విమర్శించారు. కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్‌కు పదవి పోతుందన్న భయంపట్టుకుందని.. మతి తప్పి మాట్లాడుతున్నారో.. మందేసి మాట్లాడుతున్నారో తెలియదన్నారు. కాంగ్రెస్‌కు 20 సీట్లు కూడా రావని కేసీఆర్ మాట్లాడుతున్నారని… నిజామాబాద్ సాక్షిగా కేసీఆర్ కు చెబుతున్నా.. 80 సీట్ల కంటే ఒక్క సీటు తగ్గకుండా ప్రజలు కాంగ్రెస్ ను గెలిపిస్తారని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. 80కి ఒక్క సీటు తగ్గినా ఏ శిక్షకైనా సిద్ధమన్నారు. బక్కోన్ని బక్కోన్ని అని చెప్పుకునే కేసీఆర్… లక్ష కోట్లు దిగమింగాడు..10వేల ఎకరాలు ఆక్రమించుకున్నారని రేవంత్ ఆరోపణలు చేశారు. అందుకే ఈ ఎన్నికల్లో కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. నిజామాబాద్ జిల్లా రైతులు ఆత్మ గౌరవంతో బ్రతుకుతారని ఆయన పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి నుంచి అధిష్టానం నన్ను బరిలోకి దించింది. నిజామాబాద్ జిల్లా ప్రజలు ఎటువైపు ఉంటారో.. ఆ పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. జిల్లాలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ ను గెలిపించాలి.శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును చూపించి మేం ఓట్లు అడుగుతాం.. కాళేశ్వరం మేడిగడ్డను చూపించి కేసీఆర్ ఓట్లు అడగగలవా… దమ్ముంటే కేసీఆర్ నా సవాల్ ను స్వీకరించాలి. కేసీఆర్ గుర్తుపెట్టుకో.. నీ దొరల రాజ్యాన్ని, దొంగల రాజ్యాన్ని పొలిమేరల వరకు తరిమి బొందపెడతాం. బరాబర్ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాం. ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం.” అని రేవంత్ అన్నారు.
*మాదాపూర్, హైటెక్ సిటీలా.. మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధి…
రాబోయే రోజుల్లో మహేశ్వరం నియోజకవర్గాన్ని మాదాపూర్, హై టెక్ సిటీ, కొండాపూర్‌లాగా కేఎల్ఆర్ అభివృద్ధి చేస్తారన్నారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క్. బుధవారం కాంగ్రెస్ నేత కిచ్చాన్నగారి లక్ష్మారెడ్డికి మద్దతుగా ఆయన మహేశ్వరం నియోజకవర్గంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. కేఎల్ఆర్ అంటే నీతికి నిజాయితీకి మారుపేరుగా ఉన్నారన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నవారు భూములను ఆక్రమంచుకోడం తప్పా వేరే పనులేవీ చెయ్యడం లేదని సబిత ఇంద్రారెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రజల కోసం లక్ష్మారెడ్డి పనిచేస్తారని, కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టో నీ తుచా తప్పకుండా అమలు చేయడంలో ముందు ఉంటారన్నారు. పార్టీ కోసం సొంత డబ్బులతో ఖర్చులు పెట్టీ పనిచేస్తున్నారు.. కాంగ్రెస్ పార్టీ గుర్తు నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డి ఈ రోజు బీఆర్ఎస్‌లోకి వెళ్ళారని పేర్కొన్నారు. ఆమె పార్టీ వీడితే కాంగ్రెస్‌కి నష్టం జరుగుతుందని భావించారు…కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెక్కుచెదరకుండా ఉన్నారన్నారు. అయితే అటువంటి సబితా ఇంద్రారెడ్డి కి ఈసారి బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగ కల్పన లేదు.. రెషన్ కార్డులు ఇవ్వలేదు… దళిత బందు ఇవ్వలేదు.. ఆరోపించారు. ఉపాధి హామీ పథకం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమని, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది కాంగ్రెసే అని పేర్కొన్నారు. కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులను ప్రతి ఇంటికి పంపిస్తమన్నారు. రాష్ట్రం వస్తే మన సంపద మనది అవుతుందని అనుకున్నాం.. కానీ, సంపద రాకపోగా అప్పులు వచ్చాయన్నారు. సంపద మొత్తం BRS నేతలు పందికొక్కుల్లగా తిన్నారు కాబట్టి ప్రజలకు అందలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అదంతా కక్కిస్తామని, సంపద నీ పంచడం కోసమే కాంగ్రెస్ 6 గ్యారెంటీ లు తీసుకువచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సంపదని ప్రజలకు పంచుతామని తెలిపారు. ఈసారి మహేశ్వరం నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో KLR నీ గెలిపించాలని ఆయన కోరారు. తమకున్న సమాచారం మేరకు కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీతో గెలిచి అధికారం చేపట్టబోతుందని ఆయన అన్నారు. అనంతరం దొరల ప్రభుత్వం పోవాలి… ప్రజల ప్రభుత్వం రావాలి అంటూ భట్టి నినదించారు.
*కమ్యూనిష్టులు దాదాపు కనుమరుగయ్యారు.. సీపీఐ, సీపీఎంలు పిట్ట పార్టీలు
దిశ రాష్ట్ర స్ధాయి కమిటీ సమావేశం ఇవాళ జరిగిందని.. మొదటిగా ఈ సమావేశం చాలా ఆలస్యంగా జరిగిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు. ఉచిత బియ్యం పక్కదారి పడుతోంది అని కూడా సమావేశంలో మాట్లాడానని ఆయన తెలిపారు. ఈ కమిటీలో కేంద్ర పధకాల అమలు గురించి చర్చించామన్నారు. ఉపముఖ్యమంత్రి ముత్యాల నాయుడి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగిందన్నారు. జలజీవన్ మిషన్ వంటివి అమలు సరిగా జరగడం లేదని, ఇళ్ళ నిర్మాణం మూడు నెలల్లో పూర్తిచేయాలని చెప్పానని ఆయన పేర్కొన్నారు. NREGS నరేగా పథకం అమలుపై చర్చించామన్నారు. రైతుల బీమా చెల్లించలేదని అధికారులే చెప్పారని.. కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు మార్చొద్దని కోరానన్నారు. తూర్పుకాపులకు ఓబీసీ రిజర్వేషన్ ఇవ్వాలని ఎన్‌సీబీసీ నిర్ణయించిందన్నారు. మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వస్తుందన్నారు. తూర్పు కాపులకు ఓబీసీ రిజర్వేషన్ కల్పించాలని ప్రతిపాదించానని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నివేదిక తెప్పించుకుని, ఎన్‌సీబీసీ సమావేశాన్ని కేంద్రం నిర్వహించిందన్నారు. కమ్యూనిష్టులు దిక్కు తోచక ప్రధానిపై అనేక ఏడుపుకొట్టు మాటలు మాట్లాడుతున్నారని ఎంపీ జీవీఎల్ నరసింహరావు పేర్కొన్నారు. కమ్యూనిష్టులు దాదాపు కనుమరుగయ్యారని.. తెలంగాణలో ఒకటో రెండో సీట్లు పొందారు… ఏపీలో కూడా సీట్లు కోసం కమ్యూనిష్టులు ఇలా మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్‌ను ఓడించగల పార్టీగా బీజేపీ ఉందన్నారు. సీపీఐ, సీపీఎంలు పిట్ట పార్టీలు అని ఆయన అన్నారు. ఎంపీ జీవీఎల్ నరసింహరావు మాట్లాడుతూ.. “ఇండియా అలయెన్స్‌లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని చోట్ల పోటీ చేస్తోంది. ఇండియా అలయెన్స్‌లో ఒకరిపై ఒకరికి అసహనం ఉంది. అందరూ కలిసొచ్చినా, విడివిడిగా వచ్చినా, ఇంకో నలుగురిని తెచ్చుకున్నా మోదీదే గెలుపు. బీజేపీపై ఏ పార్టీ వ్యాఖ్యలు చేసినా వారిది అభద్రతా భావమే. జనసేన, బీజేపీ బంధంపై ఎలక్షన్లు దగ్గరపడే కొద్దీ మరింత స్పష్టత వస్తుంది. మరెవరినైనా కలుపుకోవాలా అనే దానిపై భవిష్యత్తులో చర్చిస్తాం. రాజకీయాల్లో రేపెలా ఉంటుందో తెలియాలంటే రేపటి వరకూ ఆగాలి. జనసేన పొత్తుపై మాకెలాంటి కన్ఫ్యూజన్ లేదు.” అని ఆయన అన్నారు.
*గాజా సంధిలో భారత్ సాయం కోరనున్న ఇస్లామిక్ దేశాలు..
ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందం, సంధి కోసం ఇస్లామిక్ దేశాలతో పాటు ప్రపంచ దేశాలు పిలుపునిస్తున్నాయి. అక్టోబర్ 7నాటి దాడి తర్వాత ఇజ్రాయిల్ గాజాపై విరుచుకుపడుతోంది. 23 లక్షల జనాభా ఉన్న అత్యంత రద్దీ ఉన్న ప్రాంతంపై దాడులు చేయడం వల్ల అక్కడ 13 వేల మంది పాలస్తీనియన్లు చనిపోయారు. అయితే వీరిలో 5 వేల మంది వరకు చిన్నారులు ఉండటంపై అన్ని దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంధి కోసం భారత్ సాయం కోరేందుకు పవర్ ఫుల్ ఇస్లామిక్ దేశాల ప్రతినిధి బృందం మన దేశాన్ని సందర్శించనున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఈజిప్ట్, సౌదీ అరేబియా, ఖతార్, జోర్డాన్, పాలస్తీనా, ఇండోనేషియా విదేశాంగ మంత్రులతో కూడిన ప్రతినిధి బృందంతో పాటు ఐఓసీ జనరల్ సెక్రటరీ గాజాపై చర్చించడానికి భారతదేశాన్ని సందర్శించనున్నట్లు తెలిసింది. గాజా సంక్షోభంపై చొరవ తీసుకునేందుకు రియాద్‌లో ఏర్పాటు చేసిన అరబ్, ఇస్లామిక్ దేశాలకు చెందిన ఏడుగురు సభ్యుల ప్రతినిధి బృందం భారత్‌తో పాటు P5 దేశాలను సందర్శించనున్నారు. అయితే ఇప్పటి వరకు వారి తేదీలు ఖరారు కాలేదు. ఈజిప్ట్, సౌదీ అరేబియా, ఖతార్, జోర్డాన్, పాలస్తీనా, ఇండోనేషియా విదేశాంగ మంత్రులు మరియు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) ప్రధాన కార్యదర్శి ప్రతినిధి బృందంలో ఉన్నారు. ఐక్యరాజ్యసమితిలోని శాశ్వత సభ్యదేశాలైన యూఎస్, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలను పీ5 దేశాలుగా పిలుస్తారు. కాల్పుల విరమణ, గాజాపై శతృత్వానని వీడేలా ఇజ్రాయిల్‌ని ఒప్పించాలనీ పీ5 దేశాలతో పాటు ఇండియాను కోరనున్నారు. ఇటీవల సౌదీ రాజధాని రియాద్‌లో ఇస్లామిక్ దేశాలు నవంబర్ 11న భేటీ అయ్యాయి. ఈ సమావేశంలో ఇజ్రాయిల్‌పై చర్యలు తీసుకోవాలని ఇరాన్ సభ్యదేశాలను కోరింది. ప్రతినిధి బృందం చైనాలో పర్యటించి, ఈ యుద్ధాన్ని నిలపుదల చేయాలని కోరింది. ఈ పర్యటన తర్వాత రష్యాలో పర్యటించిన బృందం, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌తో సమావేశమైంది. పౌరుల రక్షణ, మానవతా కారిడార్లు, బందీల విడుదలపై చర్చించారు.
*ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో నెం. 1 స్థానం చేరువలో విరాట్ కోహ్లీ
భారత్లో జరిగిన ప్రపంచకప్ లో రన్ మిషన్ విరాట్ కోహ్లీ రికార్డులు బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. ఆ మెగా టోర్నీలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డును తిరగరాశాడు. ఈ క్రమంలో ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరువలో ఉన్నాడు. 50 ఓవర్ల ఫార్మాట్‌లో బ్యాటింగ్ జాబితాలో టాప్ 5లో భారత్ కు చెందిన ముగ్గురు బ్యాటర్లు ఉన్నారు. ప్రపంచ కప్‌లో సెమీ-ఫైనల్‌లో సెంచరీ.. ఫైనల్‌లో హాఫ్ సెంచరీ సాధించిన తర్వాత వన్డే ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లి నం. 3 స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. కోహ్లీ రేటింగ్ పాయింట్లు పొంది టాప్ 2 బ్యాటర్లు శుభ్‌మన్ గిల్, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్‌ల దగ్గరిలో ఉన్నాడు. ఇదిలా ఉంటే.. టాప్ 4 స్థానానికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎగబాకాడు. కాగా.. 826 రేటింగ్ పాయింట్లతో శుభ్‌మన్ గిల్ అగ్రస్థానంలో ఉండగా, బాబర్ ఆజం 824 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ప్రపంచకప్ ముగిసే సమయానికి కోహ్లీ 791 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.