*వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా నిధులు విడుదల
వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీతోఫా కింద లబ్ధిదారులకు నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బు జమ చేసే కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నిధులను విడుదల చేశారు. క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా కార్యక్రమాన్ని నిర్వహించారు. జనవరి- మార్చి త్రైమాసికంలో వివాహాలు చేసుకున్న 12,132 మంది లబ్ధిదారులకు వైయస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా నిధులు తమ ఖాతాలో జమ కానున్నాయి. రూ. 87.32 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వివాహాలు చేసుకున్న పేదలకు అండగా నిలుస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ఆర్థికంగా ఆదుకోవడం ఒక్కటే కాకుండా, ఇలా చేయడంలో పదోతరగతి కచ్చితంగా చదివి ఉండాలని నిబంధన తీసుకువచ్చామన్నారు. అప్పుడే కళ్యాణమస్తు, షాదీ తోఫాలు వర్తిస్తాయని స్పష్టంగా చెప్పామన్నారు. దీని వల్ల పదో తరగతి వరకూ చదివించాలన్న తపన ప్రతి పేద కుటుంబంలో మొదలవుతుందన్నారు. ఆడపిల్లకు 18 ఏళ్లు ఉండాలి, అబ్బాయికి కచ్చితంగా 21 సంవత్సరాలు ఉండాలన్న నిబంధన పెట్టామని సీఎం స్పష్టం చేశారు. పదోతరగతి అయ్యేసరికి అమ్మాయికి 15 ఏళ్లు నిండుతుందని.. ఆ తర్వాత వివాహం కోసం మరో మూడేళ్లు ఆగాల్సి వస్తుందన్నారు. అందువల్ల నేరుగా ఇంటర్మీడియట్‌కు వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. ఎలాగూ మనం అమ్మ ఒడి ఇస్తున్నామని.. ఇంటర్మీడియట్ అయ్యాక.. ఫీజు రియింబర్స్‌మెంట్ వర్తింపచేస్తున్నామన్నారు. జగనన్న వసతి దీవెన కూడా డిగ్రీ విద్యార్థులకు ఇస్తున్నామని.. ఏడాదికి రూ.90వేల వరకూ ఇస్తున్నామని సీఎం జగన్ చెప్పారు.
*తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వానలు
తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు దంచి కొడుతున్నాయి. వడగళ్లు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు అన్నదాతను ఆగమాగం చేశాయి. ఎండాకాలంలో అకాల వర్షాలతో పంటలు భారీగా దెబ్బతిన్నడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. నష్టపోయిన పంటను చూసి కన్నీరు పెడుతున్నారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ క్రమంలో వాతావరణ శాఖ మళ్లీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. కాగా, ఈ నెల 7వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం చోటుచేసుకోనుంది. ఇది 8వ తేదీన వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇక, బంగాళాఖాతం వైపు కదులుతూ తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అయితే, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ద్రోణి కారణంగా తెలంగాణలో నేడు, రేపు మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఇక, ఏపీలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో వాతావరణం మళ్లీ మారిపోయింది. గత రాత్రి హైదరాబాద్ సహా మెదక్, సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి రోడ్లు జలమయ్యాయి. ఎప్పట్లానే ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయయ్యాయి. ఇక, నాగర్ కర్నూలు, కామారెడ్డి, రాజన్నసిరిసిల్ల, నిర్మల్, జగిత్యాల, వికారాబాద్, కుమురంభీం, ములుగు, మంచిర్యాల జిల్లాల్లో స్పల్ప వర్షపాతం నమోదైంది. తెలంగాణలో నేడు కూడా పలు ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో రేపు ఉపరితల ఆవర్తనం ఏర్పడి, దాని ప్రభావంతో ఎల్లుండి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.
*టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం
టీఎస్‌పీఎస్పీ పేపర్ లీకేజీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సిట్ల అధికారులు మరో ఇద్దరిని అదుపులో తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రేణుక భర్త డాక్యా నాయక్ నుంచి ఏఈ పేపర్ కొనుగోలు చేసిన కేసులో మరో ఇద్దరిని సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. కోస్గి భగవంత్ కుమార్, కోస్గి రవికుమార్‌లను శుక్రవారం అరెస్టు చేశారు. భగవంత కుమార్ తన తమ్ముడు కోస్గి రవికుమార్ కోసం పేపర్ కొనుగోలు చేసినట్లు సిట్ పోలీసులు గుర్తించారు. దర్యాప్తు అధికారులు ఢాకా నాయక్ బ్యాంకు ఖాతాలపై ఆరా తీస్తున్నారు. అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో కోస్గి భగవంత్ కుమార్ విషయం బయటకు వచ్చింది. కోస్గి భగవంత్ కుమార్ వికారాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో పని చేస్తూ దొరికిపోయాడు. రెండు లక్షలకు ఢాకా నాయక్ నుంచి ఏఈ పేపర్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. వారిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా..టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో విచారణ దాదాపుగా ముగిసింది. మరికొందరు అనుమానితులను కూడా విచారిస్తున్నారు. నిందితులు ఇప్పటివరకు రూ.33.4 లక్షలు అందుకున్నట్లు సిట్ నిర్ధారించింది. కొందరు నేరుగా నగదు తీసుకుంటే, మరికొందరు తమ బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు అధికారులు గుర్తించారు. పేపర్ లీక్ కావడంతో ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్ కు రూ.16 లక్షలు లభించాయి. రేణుకా రాథోడ్ ప్రవీణ్ కుమార్ ద్వారా రూ.10 లక్షలకు ఏఈ పేపర్ తీసుకున్నారు. ఆ తర్వాత రేణుక భర్త డాక్యా, రాజేశ్వర్ మరో ఐదుగురికి విక్రయించారు. ఈ విక్రయం ద్వారా రాజేశ్వర్, దాఖ్యలకు రూ.27.4 లక్షలు లభించినట్లు సిట్ అధికారులు తేల్చారు. ఇందులో ప్రవీణ్ కుమార్ కు రూ.10 లక్షలు, రాజేశ్వర్, డాక్యాలకు రూ.17.4 లక్షలు మిగిలాయి. డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పేపర్‌ను ప్రవీణ్ కుమార్ ఖమ్మంకు చెందిన దంపతులకు రూ.6 లక్షలకు విక్రయించాడు. ప్రవీణ్ ఈ డబ్బును బ్యాంకులో దాచగా.. సిట్ అధికారులు ఆ డబ్బును స్తంభింపజేశారు. ఆ తర్వాత గ్రూప్-1 ప్రశ్నపత్రాన్ని ప్రవీణ్, రాజశేఖర్ ఉచితంగా ఇచ్చినట్లు విచారణలో తేలింది. ప్రశ్నపత్రాల ద్వారా వచ్చిన డబ్బుతో రాజేశ్వర్ ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు.
*తెలంగాణ సర్కార్ కూల్ వార్త.. త్వరలో ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్
ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద పనిచేసే ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎండ నుంచి రక్షణ కోసం ఏసీ హెల్మెట్‌లను అందించాలని నిర్ణయించింది. ఇటీవల వాటిని ప్రయోగాత్మకంగా కొందరు ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు ఇచ్చారు. మిగిలిన ట్రాఫిక్ కానిస్టేబుళ్ల పనితీరు, కానిస్టేబుళ్లకు ఉపయోగపడే అంశాలను పరిశీలించిన తర్వాత అందరికీ ఇస్తారు. ముఖ్యంగా ట్రాఫిక్ లో విధులు నిర్వహించే కానిస్టేబుళ్ల కోసం తెలంగాణ పోలీస్ శాఖ తాజాగా ఈ ఏసీ హెల్మెట్ ను సిద్ధం చేసింది. వారం రోజుల క్రితం రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ ఎల్‌టీనగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో కొంతమంది ట్రాఫిక్ సిబ్బందికి ఏసీ హెల్మెట్‌లు ఇచ్చారు. ప్రస్తుతం వారి పనితీరుపై విచారణ జరుగుతోంది. త్వరలోనే వీటిని అందరికీ అందించేందుకు కృషి చేస్తున్నారు. ఈ ఏసీ హెల్మెట్‌ను అరగంట పాటు చార్జింగ్ చేస్తే మూడు గంటల పాటు పనిచేస్తుంది. ఈ AC హెల్మెట్ బ్యాటరీ ఆధారంగా పనిచేసేలా అభివృద్ధి చేయబడింది. ఈ హెల్మెట్ మూడు గుంటల నుంచి గాలి వచ్చేలా రూపొందించబడింది. ముఖం మీద, హెల్మెట్ లోపల మూడు వైపుల నుండి చల్లని గాలి వీస్తుంది. ఈ హెల్మెట్‌లు ఎండ ప్రభావం నుంచి కొంత ఉపశమనం కలిగిస్తాయని, చల్లటి గాలిని అందిస్తాయని చెబుతున్నారు. ఇది చల్లని వాతావరణంలో పని చేస్తుందని చెప్పారు. ఈ ఏసీ హెల్మెట్ ట్రాఫిక్ కానిస్టేబుళ్లను వడదెబ్బ, వేడిమి నుంచి కాపాడుతుందని పోలీసు అధికారులు చెబుతున్నారు. ట్రాఫిక్ కానిస్టేబుళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వీటిని అందించాలని పోలీస్ శాఖ తాజాగా నిర్ణయించింది. త్వరలో అందరికీ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏసీ హెల్మెట్ ధరించిన ట్రాఫిక్ కానిస్టేబుళ్లు త్వరలో రోడ్లపై కనిపించనున్నారు. కానిస్టేబుళ్లకు ట్రాఫిక్‌లో డ్యూటీ చాలా కష్టమైన పని. ఎండలో చేయడం కూడా చాలా కష్టం. మండుతున్న ఎండలకు ట్రాఫిక్ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ కానిస్టేబుళ్లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ కారణంగా వారు అనారోగ్యానికి గురవుతారు. ఎండలతో పాటు మరోవైపు కాలుష్యంతో ట్రాఫిక్ కానిస్టేబుళ్లు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. దీన్ని అర్థం చేసుకున్న పోలీసు శాఖ కానిస్టేబుళ్ల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటోంది. గతంలో ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు కూలింగ్ గ్లాసులు అందించిన పోలీసు శాఖ త్వరలో అందరికీ ఈ వినూత్న ఏసీ హెల్మెట్లను అందించనుంది.
*మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన.. పట్టణాల్లో 500 బస్తీ దవాఖానాలు..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త బస్తీ దవాఖానల ఏర్పాటుపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన చేశారు. జూన్ నాటికి పట్టణాల్లో 500 బస్తీ దవాఖానలు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి జిల్లాలో 350 బస్తీ దవాఖానలు, రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో 150 బస్తీ దవాఖానలను తీసుకురానున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 363 బస్తీ దవాఖానలు సేవలు అందిస్తుండగా, మరో 57 బస్తీ దవాఖానలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఇవి త్వరలో అందుబాటులోకి రానున్నాయని, వెంటనే ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జూన్ నెలాఖరు నాటికి మరో 80 బస్తీ దవాఖానలను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. మే నెలాఖరు నాటికి 3,206 గ్రామీణ దవాఖానలను పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామాల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని హరీశ్ రావు స్పష్టం చేశారు. దవాఖానలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తెరిచి ఉంటాయని, డిస్పెన్సరీ సమయాలు, వైద్యుల ఫోన్ నంబర్లు, అందించే వైద్య సేవలు, పరీక్షల గురించి ప్రజలకు తెలియజేసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామీణ దవాఖానల పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు. ఆదివారం కూడా బస్తీ దవాఖానలు తెరిచేలా ఏర్పాట్లు చేస్తున్నామని హరీశ్ రావు తెలిపారు. బస్తీ దవాఖానలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సీనియర్ డాక్టర్ తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని తెలిపారు. గ్రామీణ దవాఖానల్లో ఖాళీగా ఉన్న 321 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా అందరికీ కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్లద్దాలు ఇవ్వాలని సూచించారు. కంటి వెలుగు రెండో విడత కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 1.31 కోట్ల మందికి కంటి పరీక్షలు పూర్తి చేయగా 12 లక్షల మందికి అద్దాలు పంపిణీ చేశారు. హైదరాబాద్‌లో కంటి అద్దాల పంపిణీకి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. దవాఖానల ఏర్పాటు, కంటి వెలుగు కార్యక్రమంపై ఇటీవల వైద్యశాఖ అధికారులతో హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నిమ్స్ నూతన భవనం, వరంగల్ హెల్త్ సిటీ పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు.
*శరద్ పవార్ రాజీనామా తిరస్కరణ
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ రాజీనామా చేయడం ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. తదుపరి అధ్యక్షుడి ఎన్నిక కోసం ఈ రోజు ఎన్సీపీ కోర్ కమిటీ ముంబైలో భేటీ అయింది. అయితే శరద్ పవారే ఎన్సీపీ అధినేతగా కొనసాగాలని కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. మరికొంత కాలం ఆయనే అధ్యక్షుడిగా ఉండాలని నేతలంతా కోరుకున్నారు. ఆయన తన రాజీనామాను వెనక్కి తీసుకోవాలని కోరారు. ఆయన రాజీనామా తర్వాత క్యాడర్ లో, నాయకుల్లో భావోద్వేగ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆయనకు మద్దతుగా పలువురు కీలక నేతలు, ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధ పడ్డారు. తాజాగా రాజీనామా తిరస్కరించడంతో ఎన్సీపీ నేతల్లో సంబరాలు మొదలయ్యాయి. సమావేశం అనంతరం ప్రఫుల్ పటేల్ మాట్లాడుతూ.. శరద్ పవార్ నిర్ణయంతో తామంతా షాక్ లో ఉన్నామని, ఆయన అలాంటి నిర్ణయం ప్రకటిస్తారని తెలియదని, ఆయన తర్వాత ఎన్సీపీ అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ఆయన కమిటీని నిర్ణయించారు, నాతో సహా అందరు నేతలు ఆయన రాజీనామాను తిరస్కరించారని వెల్లడించారు. ఆయన సేవలు ప్రజలు, దేశానికి అవసరం అని ప్రపుల్ పటేల్ అన్నారు. ప్రజలే కాదు ఇతర పార్టీల నాయకులు కూడా ఆయన అధ్యక్షుడిగా కొనసాగాలని కోరుకుంటున్నారని వెల్లడించారు. కమిటీ ఆయన రాజీనామాను తిరస్కరించిందని, ఆయనే ఎన్సీపీ నేతగా కొనసాగాలని కోరుకుటుందని చెప్పారు. 82 ఏళ్ల శరద్ పవార్ మూడు రోజుల క్రితం పార్టీ అధ్యక్షుడి పదవికి రాజీనామా చేశారు. ఈ రోజు సమావేశంలో కూతురు సుప్రియా సూలే, మరో కీలక నేత అజిత్ పవార్, ఎన్సీపీ వైస్ చైర్మన్ ప్రఫుల్ పటేల్ హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో శరద్ పవార్ వారసత్వాన్ని ఆమె కూతురు సుప్రియా సూలే తీసుకుంటారని, మరో నేత అజిత్ పవార్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తారని అంతా అనుకున్నారు.
*కోడికూర వడ్డించి కోట్లు కొట్టేసింది..
తమిళనాడులో విచిత్రమైన దోపిడీ జరిగింది. కిలాడీ లేడి తన స్నేహితురాలికి ప్రేమతో కోడికూర వడ్డించి కోట్ల రూపాయలు కొట్టేసింది. కోయంబత్తూరులోని రామనాథపురం కృష్ణ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వర్షిణి అనే యువతి స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే రాజేశ్వరి అనే మహిళతో పరిచయం పెంచుకుంది. రియల్ ఎస్టేటు విషయమై వేలాది ఎకరాలు కొనడానికి తన వద్ద కస్టమర్స్ ఉన్నారని రాజేశ్వరికి తెలిపింది. దీంతో రాజేశ్వరి వాళ్లను తీసుకొని రమ్మని కోరగా తన స్నేహితులైనా అరుణ్‌కుమార్, సురేంద్రన్, ప్రవీణ్‌లను తీసుకొని రాజేశ్వరి ఇంటికి వచ్చింది. ఇంటిలో భోజనం చేస్తూ మాట్లాడుతుండగా సడన్ గా రాజేశ్వరి స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే అప్రమత్తమైన కిలాడీలు ఇంట్లో ఉన్న రెండున్నర కోట్ల నగదు… వంద సవర్ల బంగారం, ఆభరణాలతో పరారయ్యారు. మత్తునుంచి తేరుకోగానే రాజేశ్వరి తన ఇంట్లో దోపిడీ జరిగినట్లు గ్రహించింది. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో చోరీ విషయంపై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వర్షిణి ఆమె స్నేహితులపై కేసు నమోదు చేశారు. అనంతరం వర్షిణి స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో తనకు బయట నుండి తెచ్చిన కోడి కూర పెట్టారని రాజేశ్వరి పోలీసులకు తెలిపింది. అది తిన్న వెంటనే కళ్ళు తిరిగిపడినట్లు రాజేశ్వరి పోలీసులకు వివరించింది. ప్రస్తుతం పరారీలో ఉన్న కీలాడి లేడి వర్షిణి కోసం కోయంబత్తూరు పోలీసులు గాలిస్తున్నారు. వర్షిణి విదేశాలకు పరారీ అయినట్లు ఆమె స్నేహితులు చెబుతున్నారు.
*గర్భంలో శిశువుకు బ్రెయిన్ సర్జరీ.. ప్రపంచంలోనే తొలిసారి..
అమెరికన్ వైద్యులు అత్యంత అరుదైన బ్రెయిన్ సర్జరీ చేశారు. గర్భంలో ఉన్న శిశవుకు విజయవంతంగా బ్రెయిన్ సర్జరీ నిర్వహించారు. ఇలా గర్భంలో ఉన్న శిశువుకు శస్త్రచికిత్స చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి. మెదడులో అరుదైన రక్తనాళాల అసాధారణ పరిస్థితిని సరిచేసేందుకు వైద్యులు ఈ సర్జరీని నిర్వహించారు. ‘‘వీనస్ ఆఫ్ గాలెన్ మాల్ ఫార్మెషన్’’(VOGM) అనే అరుదైన వైకల్యంతో బాధపడుతున్న శిశువుకు బ్రిఘం అండ్ ఉమెన్స్ హాస్పిటల్, బోస్టన్ చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యులు సర్జరీ చేశారు. మెదడు నుంచి గుండెకు రక్తాన్నీ తీసుకెళ్లే రక్తనాళం సరిగ్గా అభివృద్ధి చెందనప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. దీని వల్ల అధిక మొత్తంలో రక్తం సిరలు, గుండెపై ఒత్తిడి పెంచుతుంది. ఇది దీర్ఘకాలంలో పలు ఆరోగ్య పరిస్థితులకు దారి తీయవచ్చని వైద్యులు తెలిపారు. మెదడుకు గాయాలు, గుండె వైఫల్యం వంటి సవాళ్లను శిశువు ఎదుర్కొనే అవకాశం ఉందని డాక్టర్ డారెన్ ఓర్బాచ్ తెలిపారు. సాధారణంగా శిశువు పుట్టిన తర్వాత రక్తప్రవాహాన్ని మందగించడానికి చిన్న కాయిల్స్ ను చొప్పించడానికి కాథెటర్ ను ఉపయోగించి చికిత్స చేస్తారు. అయితే ఈ రకం చికిత్స చాలా ఆలస్యంగా జరుగుతుంది. ఈ పరిస్థితి ఉన్న శిశువుల్లో 50 నుంచి 60 శాతం మంది వెంటనే అనారోగ్యానికి గురవుతారు. 40 శాతం మంది మరణించే అవకాశం ఉంది. జీవించి ఉన్న శిశువుల్లో తీవ్రమైన నరాల జబ్బులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. శిశువు తల్లి గర్భంలో ఉన్న సమయంలో ఆల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తున్న సమయంలో మెదడులో అరుదైన రక్తనాళ అసాధారణతను కనుగొన్నారు. ఈ పరిస్థితి చాలా మంది పిల్లల గుండె వైఫల్యం, మెదడు దెబ్బతినే పరిస్థితిని ఏర్పరస్తుంది. శిశువు గుండెపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. 34 వారాల గర్భంలో శిశువుకు బోస్టన్ చిల్డ్రన్స్, బ్రిఘామ్ వైద్యులు ఆల్ట్రాసౌండ్ ఉపయోగించి, అమ్నియోసెంటెసిస్ కోసం ఉపయోగించే సూది, చిన్న కాయిల్స్ ను ఉపయోగించి, అసాధారణంగా ఉన్న రక్తనాళాల్లోకి వీటిని జొప్పించి విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు.
*ఐపీఎల్ తర్వాత విరాట్ కోహ్లీపై బీసీసీఐ సీరియస్ యాక్షన్
ఐపీఎల్‌లో లక్నో వర్సెస్ ఆర్సీబీ మధ్య జరిగిన గొడవ.. విరాట్ కోహ్లీ తలకు చుట్టుకునేలా కనిపిస్తోంది. లక్నో ప్లేయర్లు నవీన్ ఉల్ హక్, అమిత్ మిశ్రాలతో పాటు మెంటర్ గౌతమ్ గంభీర్ తో కూడా వాగ్వాదానికి దిగాడు. తన కెరీర్ ఆరంభం నుంచే విరాట్ కోహ్లీలో దూకుడు కనిపిస్తోంది. దాదాపు ప్రతీ మ్యాచ్ లో క్యాచ్ పట్టినా.. వికెట్ పడినా చాలా అగ్రెసివ్ గా కోహ్లీ సెలబ్రేట్ చేసుకుంటాడు. ఈ సెలబ్రేషన్స్ కారణంగా కొన్ని మ్యాచ్ ల్లో జరిమానా కూడా చెల్లించుకున్నాడు. అయితే నవీన్ ఉల్ హక్ ని స్లెడ్జ్ చేయడంతో పాటు అతన్ని నువ్వు నా బూటికి అంటిన మట్టితో సమానం అని మీనింగ్ వచ్చేలా విరాట్ కోహ్లీ చేసిన సైగలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీంతో నవీన్ ఉల్ హక్ పర్సనాల్ గా తీసుకోవడమే కాకుండా నన్ను అంటే నా వల్లను అన్నట్టే అంటు వ్యాఖ్యానించాడు. దీంతో అప్పటి వరకు విరాట్ కోహ్లీకి సపోర్ట్ చేసిన వాళ్లందరు అతను చేసింది తప్పుపట్టడం స్టార్ట్ చేశారు. భారత్ మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, రాబిన్ ఊతప్ప, హర్భజన్ సింగ్ లు కోహ్లీ చేసింది తప్పేనంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే విషయాన్ని బీసీసీఐ కూడా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. లక్నో సూపర్ జెయింట్స్,చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ కి హాజరైన బీసీసీఐ వైఎస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా-నవీన్ ఉల్ హక్ ని కలిసి అసలు ఏం జరిగింది అనే దానిపై ఆరా తీశాడు. దీంతో పాటు లక్నో టీమ్ సభ్యులతో పాటు మెంటర్ గౌతమ్ గంభీర్ తో కూడా చాలా సేపు చర్చించాడు. అసలు ఏం జరిగింది..? విరాట్ కోహ్లీ ఏం మాట్లాడాడు.. ? నిజంగానే జాత్యాంహంకార వ్యాఖ్యలు చేశాడా..? అనే కోణంలో బీసీసీఐ దర్యాప్తు చేస్తుంది. ఐపీఎల్ 2023 సీజన్ ముగిసిన వెంటనే విరాట్ కోహ్లీపై బీసీసీఐ సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే టీమింయాకి విరాట్ కోహ్లీ కీలకమైన బ్యాటర్. అతను ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ తో పాటు వరల్డ్ కప్ 2023 టోర్నీలోనూ కీలకమైన ఆటగాడిగా ఉండబోతున్నాడు. ఇప్పటికే బీఐసీసీ మాజీ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ కక్షకట్టి, విరాట్ కోహ్లీని టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పించాడని మాజీ చీఫ్ సెలక్షర్ చేతన్ శర్మ స్టింగ్ ఆపరేషన్ లో బయటపెట్టడం సంచలనం రేపింది. ఇప్పుడు మరోసారి బీసీసీఐ-కోహ్లీపై యాక్షన్ తీసుకునేందుకు సిద్దమువుతుందా..? అనేది చాలామందిని వెంటాడుతున్న అనుమానం.. అదే జరిగితే విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది.