*అమిత్ షా వ్యాఖ్యలకు బొత్స హార్డ్ కౌంటర్
ఇటీవల విశాఖలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. అమిత్ షా చెప్పేంత వరకు జీవీఎల్ కు తెలియదా అంటూ మండిపడ్డారు. విశాఖలో భూదందా నిజంగా జరిగితే ఎందుకు అడగలేదన్నారు. ఎన్నికలు వస్తున్నాయనే అమిత్ షా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. రాజకీయ లబ్ధి పొందాలనే ఈ ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇన్నేళ్ళూ టీడీపీ చెప్పిన మాటలనే ఇవాళ బీజేపీ నేతలు చెబుతున్నారని .. రాష్ట్రం అభివృద్ది చెందుతుందనే కడుపు మంటతో గురువింద గింజ లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. దేశంలో ఏం జరుగుతుందో వాళ్ళు చూసుకుంటే మంచిదన్నారు. ముష్టి వేసినట్లు నిధులు ఇస్తున్నారన్న మండిపడిన మంత్రి.. ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ గురించి గతం నుంచే అడుగుతున్నామన్నారు. కేంద్రం నుంచి వచ్చే వారు ఒక విజన్‌తో మాట్లాడాలన్నారు. కేంద్రం నుండి రావాల్సిన నిధులు మన హక్కు అంటూ మంత్రి తెలిపారు. మనం చెల్లిస్తున్న పన్నులే కదా వాళ్లు ఇచ్చేదంటూ మంత్రి తెలిపారు. రెండు వందేమాతరం రైళ్ళు ఇచ్చాం అని అమిత్ షా చెప్పటం సిగ్గు చేటన్నారు. అదనంగా కేంద్రం ఏం ఇచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమన్నారు. టీడీపీ చెప్పిన మాటలనే అమిత్ షా ఉటంకించారని.. బీజేపీ వాళ్ళ ఆలోచన ఏమయ్యిందని ప్రశ్నించారు. మాకు ఏ పార్టీతోనూ పొత్తు లేదు… ఉండదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. దేశ గౌరవానికి సంబంధించిన అంశాల్లో కేంద్ర ప్రభుత్వానికి మా మద్దతు ఉంటుందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.
*అన్నవరంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు
నేటి నుంచి వారాహి విజయయాత్ర చేపట్టనున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నవరం సత్యదేవుని ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వారాహి వాహనానికి పూజలు నిర్వహంచారు. సాయంత్రం అన్నవరం నుంచి కత్తిపూడి సభకు పవన్ వెళ్తారు. కత్తిపూడిలో నిర్వహించనున్న తొలి బహిరంగ సభలో పవన్ పాల్గొంటారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహియాత్ర ఈ సాయంత్రం ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం నుంచి ప్రారంభం కానుంది. పది రోజుల పాటు 9 నియోజకవర్గాల్లో పర్యాటించి ఏడు సభల్లో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు. వారాహి అన్నవరంలో సందడి చేస్తుంది. జనసైనికులు వారాహిని చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వారాహి వాహనం నుంచి పవన్ తొలి బహిరంగ సభ ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడి కూడలిలో జరుగనుంది. వారాహి వాహనంపై నుంచి పవన్ ప్రసంగించనున్నారు. కత్తిపూడి అనంతరం పిఠాపురం, కాకినాడ గ్రామీణ, కాకినాడ నగరం, ముమ్మిడివరం, అమలాపురం, పి గన్నవరం, రాజోలు, నరసాపురం నియోజకవర్గాల మీదుగా పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కొనసాగుతుంది. తొలి 10 రోజుల్లో ఏడు బహిరంగ సభల్లో పవన్ ప్రసంగిస్తారు. ప్రతి నియోజకవర్గంలో వివిధ వర్గాల ప్రజలతో పవన్ సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రజల కష్టాలు, బాధలు తెలుసుకొనేందుకు జనవాణి కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అన్నవరం నుంచి నరసాపురం వరకు వారాహి యాత్ర షెడ్యూల్ ఖరారైంది. వారాహి యాత్ర నేపథ్యంలో ఇప్పటికే అన్నవరం, కత్తిపూడి ప్రాంతాల్లో జనసేన శ్రేణులు, నాయకుల సందడి మొదలైంది. జనసేన శ్రేణులు ఎంతో ఉత్సహంతో ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ కటౌట్స్, జెండాలతో కత్తిపూడి ప్రాంతం మొత్తం కన్నుల పండగలా ఉంది. కత్తిపూడి మొత్తం పవన్ మేనియాతో ఊగిపోతోంది. కత్తిపూడి నుంచి ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పలు నియోజకవర్గాల మీదుగా వారాహి యాత్ర సాగనుంది.
*ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఈఏపీ సెట్–2023 ఫలితాలను బుధవారం ఉదయం 10.30 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈ ఫలితాలను విజయవాడలో మంత్రి విడుదల చేశారు. ఈ ఫలితాల్లో ఇంజినీరింగ్‌లో 76.32 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. అగ్రికల్చర్‌లో 89.65 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంజనీరింగ్‌లో మొత్తం 2,24,724 మందికి గానూ 1,71,514 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. అగ్రికల్చర్‌లో 90,573 మందికి గానూ, 81,203 మంది అభ్యర్థులు క్వాలిపై అయ్యారు. మే 15 నుంచి 19 వరకు జరిగిన ఇంజినీరింగ్ స్ట్రీమింగ్ పరీక్షకు 2.24 లక్షల మంది హాజరవగా.. అదే నెల 22, 23 తేదీల్లో నిర్వహించిన అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీం పరీక్షకు 90,573 మంది హాజరయ్యారు. ఇక ఇంజినీరింగ్ ప్రవేశాలకు 2,37,193 మంది విద్యార్ధులు.. అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశాలకు 99, 557 మంది దరఖాస్తు చేసుకున్న విషయం విదితమే. కోవిడ్ సమయంలో తొలగించిన ఇంటర్మీడియెట్ వెయిటేజ్ మార్కులను ఈసారి పరిగణలోకి తీసుకుని ఫలితాలను ప్రకటించారు.
*బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్లలో ఐటీ అధికారుల సోదాలు
బీఆర్‌ఎస్‌కు చెందిన ముగ్గురు ప్రజాప్రతినిధుల ఇళ్లలో ఇవాళ ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి, మెదక్ ఎంపీ కోట ప్రభాకర్ రెడ్డి నివాసాల్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. మరోవైపు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. మర్రి జనార్దన్ రెడ్డి వస్త్ర వ్యాపారం చేస్తున్నాడు. మర్రి జనార్దన్ రెడ్డికి చెందిన బట్టల షోరూమ్‌ల్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని పలు దుస్తుల షోరూమ్‌లలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మర్రి జనార్దన్ రెడ్డికి జేసీ బ్రదర్స్ తో పాటు మరికొన్ని వస్త్ర దుకాణాలు ఉన్నాయి. ఇవాల ఉదయం నుంచి బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఎంపీ నివాసంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కోట ప్రభాకర్ రెడ్డి నివాసం ఎదుట కేంద్ర బలగాలు కాపలా కాస్తున్నాయి. కోట ప్రభాకర్ రెడ్డి నివాసం, కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇక భువనగిరి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో ఉదయం నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే శేఖర్ రెడ్డి ఇంట్లో కూడా సిబ్బంది సోదాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే నివాసాలు, కార్యాలయాలు, సిబ్బంది ఇళ్లలో ఏకకాలంలో 70 ప్రత్యేక ఐటీ బృందాలు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఆ వ్యాపార లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల పాటు సోదాలు కొనసాగే అవకాశం ఉంది. బీఆర్ఎస్ భువనగిరి ఎమ్మెల్యే పైలా శేఖర్ రెడ్డి పలు కంపెనీల్లో బినామీగా ఉన్నట్లు సమాచారం. అతను 15 కంపెనీలలో పెట్టుబడిదారుడు. ఎమ్మెల్యే ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. హైదరాబాద్ కేంద్రంగా కొంతకాలంగా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. రియల్ ఎస్టేట్ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయపు పన్ను శాఖకు రిటర్నుల్లో పేర్కొన్న అంశాలపై అనుమానాలతో ఐటీ శాఖ అధికారులు పలు సంస్థల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులపై ఐటీ, ఈడీ సోదాలు నిర్వహిస్తున్నాయి. సాధారణ తనిఖీల్లో భాగంగానే ఈ సోదాలు నిర్వహించినట్లు దర్యాప్తు సంస్థలు ప్రకటించాయి. తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, బీఆర్ఎస్ ఎంపీ రవిచంద్ర నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
*లండన్‌లో తెలంగాణ యువతి మృతి
తాజాగా టెక్సాక్ కాల్పుల్లో హైదరాబాద్ బాలిక తాటికొండ ఐశ్వర్య మృతి చెందిన ఘటన మరువక ముందే మరో విషాదం చోటుచేసుకుంది. లండన్‌లో మరో తెలుగు యువతి ప్రాణాలు కోల్పోయింది. బ్రెజిల్‌కు చెందిన ఓ యువకుడు ఆమెపై దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మరో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని చంపాపేట్‌కు చెందిన తేజస్విని చదువు కోసం లండన్ వెళ్లింది. అది స్నేహితులతో కలిసి ఉంటోంది. అయితే తేజస్విని, అఖిల అనే మరో విద్యార్థినిపై బ్రెజిల్‌కు చెందిన ఓ యువకుడు దాడి చేశాడు. ఈ దాడిలో తేజస్విని తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. మరో యువతి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అఖిల నుంచి ఎలాంటి సమాచారం వస్తుంది? దాడి చేసిన యువకుడు అఖిల గుర్తు పడుతుందా? తేజస్విని, అఖిల ఉంటుందన్న అపార్ట్ మెంట్ వద్దకు దాడి చేసిన యువకుడు ఎందుకు వెళ్లాడు? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఆ గుర్తు తెలియని వ్యక్తి ఎవరు? ఇద్దరు అమ్మాయిలపై ఎందుకు దాడి చేశాడు? పోలీసులు విచారిస్తున్నారు. తేజశ్విని మృతిపై లండన్‌లోని అధికారులు ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కూతురు మరణవార్త విని తేజస్విని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తన మృతదేహాన్ని వారికి అప్పగించాలని వేడుకుంటున్నారు. తన కూతురిపై బ్రిజిల్ యువకుడు ఎందుకు దాడి చేశాడో? అసలు తను మా అమ్మాయికి ఎలా పరిచయమో తమకు తెలియదని అంటున్నారు. తేజస్వి చదువులో చురుకుగా ఉండేదని, అందుకే పై చదువులకు లండన్ పంపామని అన్నారు. లండ్ లో చదువుకుని మంచి ఉద్యోగం చేస్తుందని భావించామని కానీ.. ఇంతలోనే ఇలా జరుగుతుందని ఊహించలేమని వాపోయారు. తేజస్వినిపై దాడి చేసిన యువకుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
*శిరీష కేసులో వీడిన మిస్టరీ
వికారాబాద్ జిల్లా కాలాపూర్ లో శిరీష హత్యకేసులో నాలుగు రోజులుగా కొనసాగుతున్న మిస్టరీ ఎట్టకేలకు వీడింది. శిరీష అనే యువతిని ఆమె బావ అనిల్ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. శిరీష భవాని అనిల్‌కు సహకరించిన రాజు అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 10వ తేదీ రాత్రి శిరీష నీటి కుంటలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ నెల 11న శిరీష నీటి కుంటలో శవమై కనిపించింది. ఈ కేసుని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్న పరిగి పోలీసులు.. తాజాగా శిరీష బావ అనిల్‌ను అదుపులోకి తీసుకొని, విచారించారు. శనివారం రాత్రి ఫోన్ విషయంలో అనిల్, శిరీష మధ్య గొడవ జరగడం.. ఈ క్రమంలోనే అనిల్ కోపంతో శిరీషను కొట్టడంతో.. ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అలా వెళ్లిన శిరీష.. ఇంటికి కీలోమీటర్ దూరంలో ఉన్న నీటి కుంటలో శవమై తేలింది. దీంతో.. శిరీషని అనిల్ హత్య చేసి ఉంటాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో శిరీష తండ్రి జంగయ్య, తమ్ముడు శ్రీకాంత్‌లను కూడా ప్రశ్నించారు. అయితే శిరీష మృతికి ఆమె బావమరిది అనిల్ కారణమని పోలీసులు నిర్ధారించారు. ఈ నెల 10న శిరీష తండ్రి, బావ అనిల్ శిరీషను మొబైల్ ఫోన్‌లో కొట్టారు. దీంతో శిరీష ఇంట్లోనే ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె సోదరుడు, బావ అనిల్ ఆమెను రక్షించారు. అదే రోజు రాత్రి శిరీష ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అదే సమయంలో శిరీష బావమరిది అనిల్ మద్యం మత్తులో ఇంటివైపు వస్తున్నాడు. ఆ సమయంలో శిరీషను చూసిన అనిల్ శిరీషపై చేయి చేసుకున్నాడు. వినకపోవడంతో శిరీషపై దాడి చేశారు. బీరు సీసాతో శిరీష కళ్లపై దాడి చేశారు. ఆ తర్వాత తలను నీటి కుంటలో ఉంచారు. ఈ సమయంలో అనిల్‌కు రాజు అనే వ్యక్తి సహాయం చేశాడు. వారిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా శిరీష బంధువులు అనిల్ ను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. తన మరదలిపై కన్నేసి అమానుషంగా చంపేశాడని వాపోయారు. ఇలాంటి వారికి బతికే అర్హత లేదంటూ కన్నీరుపెట్టుకున్నారు.
*సెంథిల్ బాలాజీ అరెస్టుపై విపక్షాల ఆగ్రహం.. బీజేపీపై సీఎం స్టాలిన్ సీరియస్
మనీలాండరింగ్ ఆరోపణలతో తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ అధికారులు అరెస్టు చేయడంపై విపక్ష పార్టీలు భగ్గుమంటున్నాయి. ప్రభుత్వ సంస్థలను చేతిలో పెట్టుకుని ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశాయి. అరెస్టు సమయంలో ఛాతి నొప్పితో కుప్పకూలి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మంత్రి సెంథిల్ బాలాజీని సీఎం స్టాలిన్ పరామర్శించారు. సీఎంతో పాటు డీఎంకే పార్టీ నేతలు మంత్రిని పరామర్శించేందుకు క్యూ కట్టారు. కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆరోపించారు. బీజేపీ బెదిరింపులకు భయపడేది లేదని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యనించారు. సిద్ధాంతపరంగా బీజేపీపై పోరాటం చేస్తామన్నారు. సెంథిల్ బాలాజీ అరెస్టుపై న్యాయపోరాటానికి దిగుతామని వెల్లడించారు. మానసికంగా, శారీరకంగా హింసించడంతో బాలాజీకి ఛాతిలో నొప్పి వచ్చింది.. బీజేపీ అణిచివేత వ్యూహాలను గమనిస్తున్నాం.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు అని సీఎం అన్నారు. సెంథిల్ బాలాజీ అరెస్టును కాంగ్రెస్ పార్టీ ఖండించింది. మోడీ సర్కార్ రాజకీయ కక్ష సాధింపులకు దిగుతోందని ఆ పార్టీ నేత మల్లిఖార్జున ఖర్గే అన్నారు. ఇలాంటి చర్యలను విపక్షాలు ఏ మాత్రం ఉపేక్షించవని ఆయన ఫైర్ అయ్యారు. ఈడీ దాడులను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆమ్‌ఆద్మీ పార్టీ నేతలు అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న సెంథిల్‌ను అరెస్టు చేయడం అమానవీయమని ఘటన అన్నారు. దేశంలో ఎన్నో సమస్యలు ఉంటే వాటన్నింటినీ గాలికొదిలేసి.. ప్రతిపక్ష నేతలపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపట్టడంలోనే కేంద్ర ప్రభుత్వం ఆసక్తి చూపిస్తుందని విమర్శించింది. సెంథిల్ బాలాజీ అరెస్టు రాజకీయ కక్ష సాధింపు చర్యేనని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని ఆమె విమర్శించారు. ఇలాంటి చర్యలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. మంత్రి సెంథిల్ బాలాజీ హెల్త్ బులిటెన్ ను వైద్యులు విడుదల చేశారు. మంత్రి సెంథిల్ బాలాజీ కరోనరీ యాంజియోగ్రామ్ చేయించుకున్నారు. వీలైనంత త్వరగా బైపాస్ సర్జరీ చేయడం మంచిది అని తమిళనాడు ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు తెలిపారు.
*మణిపూర్‌లో కొనసాగుతున్న అల్లర్లు.. 10 మంది మృతి
మణిపూర్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా.. రాష్ట్రంలో జరిగిన అల్లర్లలో ఓ మహిళతో పాటు మరో 9 మంది మరణించారు. మణిపూర్ లోని ఓ చర్చిలో గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడటంతో.. ఒక మహిళతో పాటు 10 మంది మరణించాగా.. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. తూర్పు ఇంఫాల్ లోని ఖమెన్ లోని ఓ చర్చిలో మంగళవారం రాత్రి దుండగులు కాల్పులకు దిగినట్లు తెలుస్తుంది. కాల్పులు జరిగే సమయంలో చర్చిలో 25 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారు ప్రస్తుతం ఇంఫాల్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మరణాలతో మణిపూర్ హింసాత్మక ఘటనల్లో మృతుల సంఖ్య 115కి చేరింది. ఈ ఘటనలో కుకీ మిలిటెంట్ ప్రమేయం ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుకీ వర్గంపై జరిగిన కాల్పులపై ఇంఫాల్ తూర్పు జిల్లా ఎస్పీ కె.కె. శివకాంత్ సింగ్ పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో అస్సాం రైఫిల్స్ భద్రతను మోహరించినట్లు ఎస్పీ తెలిపారు. అల్లర్లు జరుగకుండా బలగాల ఉనికిని పెంచామని పోలీసులు చెప్పారు. హింసాకాండ తర్వాత ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని ఎస్పీ వెల్లడించారు. ఇంతలో, కుకీ మరియు మెయిటీ కమ్యూనిటీల ప్రజల నుండి భిన్నమైన వాదనలు వస్తున్నాయి. తమ గ్రామంలో దాడి చేసింది.. మైటీ వర్గానికి చెందిన వారే చేశారని కుకీ సంఘం ప్రజలు ఆరోపిస్తున్నారు. తమ వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు లైసెన్స్ ఉన్న ఆయుధాలతో దుండగులను ఎదుర్కోవడానికి ప్రయత్నించారని కుకీ ప్రజలు పేర్కొన్నారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు అధునాతన ఆయుధాలతో నిద్రపోతున్న సమయంలో కాల్పులు జరపడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు.. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరుగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. మరో వివాదం తలెత్తకుండా నిరోధించడానికి ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది.
*టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం.. ‘కబాలి’ నిర్మాత అరెస్ట్
టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. ఇప్పట్లో డ్రగ్స్ నీడ వీడేలా కనిపించడం లేదు. డగ్స్ కేసులో సినీ పరిశ్రమకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధం ఉన్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. తాజాగా ఓ ప్రముఖ టాలీవుడ్ నిర్మాత డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం హాట్ టాపిక్ గా మారింది. నిర్మాత కేపీ చౌదరిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి కొకైన్ స్వాధీనం చేసుకోవడంతో సంచలనంగా మారింది. తమిళంలో రజనీకాంత్ నటించిన కబాలి చిత్రాన్ని తెలుగులో కెపి.చౌదరి విడుదల చేశారు. కొంతకాలంగా గోవాలో ఉంటున్నాడు. అతనికి సంబంధించిన డ్రగ్స్ ముఠా సైబరాబాద్ పోలీసులకు చిక్కింది. కేపీ చౌదరి డ్రగ్స్ వాడుతున్నట్లు తేలడంతో సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కొన్నాళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ కేసుల్లో ప్రముఖులు చిక్కుకున్నారనే వార్తలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రంగంలోకి దిగిన ఈడీ పలువురు సినీ ప్రముఖులను విచారించింది. వారిలో దర్శకుడు పూరీ జగన్నాథ్, రవితేజ, ఛార్మి, నవదీప్, తరుణ్, సుబ్బరాజు, నందు, తనీష్ ఉన్నారు. అయితే ఎట్టకేలకు ఫోరెన్సిక్ వారికి క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే ఇప్పుడు మరోసారి డ్రగ్స్ కేసులో నిర్మాత కేపీ చౌదరి అరెస్ట్ కావడం చర్చనీయాంశంగా మారింది.
*శ్రీలీల బర్త్ డే స్పెషల్.. ‘భగవంత్ కేసరి’ నుంచి ఫస్ట్ లుక్ విడుదల!
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ‘పెళ్లి సందడి’ సినిమాతో యంగ్ బ్యూటీ ‘శ్రీలీల’ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమానే అయినా కన్నడ బ్యూటీ తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. పెళ్లి సందడితో వచ్చిన క్రేజ్‌తో శ్రీలీల వరుస సినిమాలు చేసింది. ‘ధమాకా’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఆమె ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపొయింది. ఈ కన్నడ భామ సీనియర్ హీరోలతో పాటు యంగ్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. శ్రీలీల ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా ఉంది. నేడు (జూన్ 14) శ్రీలీల బర్త్‌డే. ఈ సందర్భంగా శ్రీలీల (Sreeleela Birthday) నటిస్తున్న సినిమాలలోని ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌లను చిత్ర యూనిట్ రిలీజ్ చేశాయి. నందమూరి బాలకృష్ణ 108వ చిత్రానికి ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) అనే టైటిల్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. సాహు గారపాటి – హరీశ్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాకు బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలోలో కాజల్ అగర్వాల్‌తో పాటు శ్రీలీల కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భగవంత్ కేసరి టీజర్ ఇటీవల విడుదల కాగా.. నేడు శ్రీలీల బర్త్ డే (Happy Birthday Sreeleela) సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో కన్నడ బ్యూటీ నవ్వుతూ చాలా అందంగా ఉన్నారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరీ ఇంత అందంగా ఉంటే కష్టం అంటూ ఫాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. భగవంత్ కేసరి సినిమాలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఎస్ తమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. భగవంత్ కేసరి చిత్రం ఈ దసరాకి థియేటర్లలో విడుదల కానుంది. ఇక ఇటీవల వచ్చిన టీజర్‌లో బాలయ్య బాబు సింహంలా గర్జించాడు. అతని లుక్స్, తెలంగాణ యాస, రాయల్టీ అద్భుతంగా ఉన్నాయి. టీజర్ అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పించింది. మహేష్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్నా ‘గుంటూరు కారం’లోనూ శ్రీలీల హీరోయిన్. నేడు ఈమె బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. ఇందులో విలేజీ బ్యూటీగా శ్రీలీల కనిపించింది. లంగా ఓణీలో కాలికి నెయిల్ పాలిష్ పెడుతున్న ఫొటోని రిలీజ్ చేశారు. పోస్టర్ చూస్తే ఏకంగా మహేష్ బాబునే శ్రీలీల డామినేట్ చేసేలా ఉంది. ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.