నేటినుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ 2023–24 వార్షిక బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేడు మధ్యాహ్నం 12.10 గంటలకు సభ ప్రారంభం కానుంది. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగ పాఠం బుధవారం రాత్రి ప్రభుత్వం నుంచి రాజ్‌భవన్‌కు చేరింది. దాన్ని పరిశీలించిన గవర్నర్.. కొన్ని అంశాల్లో మరిన్ని వివరాలు కోరడంతో పాటు కొన్ని సూచనలు చేసినట్లు సమాచారం. ప్రభుత్వం కూడా గవర్నర్ సూచనలను పరిగణనలోకి తీసుకుని, ప్రసంగ పాఠంలో పలు మార్పులు చేసి తుదిరూపు ఇచ్చినట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఫిబ్రవరి 5న సమావేశం కానుంది. ఆదివారం ఉదయం 10.30గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో కేబినెట్ భేటీ కానుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఎన్నికల ఏడాది బడ్జెట్ కావడంతో ప్రాధాన్యాలు, కేటాయింపులు, ప్రతిపాదనలపై సమావేశంలో కీలకంగా చర్చిస్తారు. ఈ భేటీలో మంత్రులకు సీఎం కేసీఆర్ దిశానిర్ధేశం చేయనున్నారు. బడ్జెట్ సమావేశాల నిర్వహణ, ప్రభుత్వం తరపున చర్చ, విపక్షాలను ధీటుగా ఎదుర్కోవడం సహా సంబంధిత అంశాలపై కేబినెట్‌లో మార్గదర్శనం చేస్తారు.
కళా తపస్వి ఇక లేరు.. విషాదంలో టాలీవుడ్

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దివి నుంచి మరో తార భువికి వెళ్ళిపోయింది. ప్రముఖ దర్శకులు, కళాతపస్వి కె. విశ్వనాథ్ ఈ రోజు (గురువారం రాత్రి) తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం కె. విశ్వనాథ్ వయసు 92 ఏళ్ళు. కొన్ని రోజులుగా వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నారు. ఈ రోజు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అపోలో ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం ఆయన మరణించారు. కళాతపస్వి కే. విశ్వనాధ్ తెరకెక్కించిన శ్రుతిలయలు, స్వర్ణకమలం, స్వాతికిరణం, సాగరసంగమం, స్వాతిముత్యం, సప్తపది, సిరివెన్నెల వంటి గొప్ప సినిమాలు ఎన్నిసార్లు చూసినా తనివితీరదు. అలానే నటుడిగా కూడా అనేక సినిమాల్లో పలు కీలక పాత్రల్లో నటించి ఆడియన్స్ ని మెప్పించారు కె విశ్వనాధ్. ఇక వారి అకాల మరణం నిజంగా తెలుగు చిత్ర సీమకు తీరని లోటు అనే చెప్పాలి. విశ్వనాధ్ గారి అకాల మరణం విషయం తెలిసిన పలువురు సినీ ప్రముఖులు వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సంతాపం ప్రకటిస్తున్నారు. కాగా రేపు ఆయన పార్థివదేహాన్ని అభిమానులు, సినీ ప్రముఖులు సందర్శనార్ధం ఇంటివద్దనే ఉంచనున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ సచివాలయంలో అగ్నిప్రమాదం

ప్రారంభానికి సిద్ధమవుతున్న తెలంగాణ సచివాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. సచివాలయంలో మొదటి అంతస్తులో ప్రమాదం సంభవించడంతో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 11 యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించినట్టు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సెక్రటేరియట్ చుట్టుపక్కల రోడ్లు బ్లాక్ చేసినారు ఎవర్ని రానివ్వటం లేదు. అయితే.. ఎలాంటి నష్టం జరగలేదు అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కాగా.. సచివాలయంలో వుడ్ వర్క్ జరుగుతుండగా ప్రమాదవశాత్తు మంటలు చెలరేగినట్లు పోలీసులు భావిస్తున్నారు. సచివాలయం ప్రారంభోత్సవానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతుండగా ఈ అగ్నిప్రమాదం జరగడంతో ప్రమాదానికి గల కారణాలపై అధికారులు తెలుసుకుంటున్నారు.
అంతా అబద్దం.. కేసీఆర్ నాకు తండ్రిలాంటివారు

తెలంగాణ సీఎం కేసీఆర్ తో తనకు అభిప్రాయ బేధాలు లేవని.. తన తండ్రి తర్వాత అంతటి వారు కేసీఆర్ అని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తెలిపారు. కేసీఆర్ ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు కుమారస్వామి హాజరుకాకపోవడం అందరిలో అనేక అనుమానాలను తావిచ్చిన సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందనే ప్రచారం జరిగింది. ఈ వార్తలపై తాజాగా కుమారస్వామి స్పందిస్తూ ఊహాగానాలను కొట్టిపారేశారు. తన తండ్రి దేవెగౌడ తర్వాత తనకు అంతటి మార్గదర్శి కేసీఆరేనని చెప్పారు. కర్ణాటక రాయచూర్ లో జరిగిన పంచరత్న యాత్రలో నారాయణపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డితో కలిసి కుమారస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అధికారం లభిస్తే కేసీఆర్ స్ఫూర్తితో కర్ణాటకను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. కేసీఆర్‌తో కలలో కూడా విభేదాలు తలెత్తవని తేల్చి చెప్పారు. రాజకీయాల్లో తండ్రి దేవేగౌడ తర్వాత తనకు అంతటి మార్గదర్శి కేసీఆరేనని స్పష్టంచేశారు. కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో 24 జిల్లాల రైతులకు ఎంతో మేలు జరుగుతున్నదని, మిషన్ భగీరథ పథకం వల్ల ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందుతున్నదని తెలిపారు.
హిందీలోనూ అలరించిన విశ్వనాథ్

తెలుగులో కళాతపస్విగా తనదైన బాణీ పలికించిన కె.విశ్వనాథ్ హిందీలోనూ తనదైన బాణీ పలికించారు. తన దర్శకత్వంలో తెలుగులో ఘనవిజయం సాధించిన ‘సిరిసిరిమువ్వ’ ఆధారంగా హిందీలో ‘సర్గమ్’ చిత్రాన్ని రూపొందించారాయన. విశ్వనాథుని ప్రతిభ తెలిసి హిందీ చిత్రసీమలో ప్రముఖ నిర్మాతగా రాణిస్తున్న ఎన్.ఎన్.సిప్పి ఈ ‘సర్గమ్’ను నిర్మించారు. ఈ సినిమాతోనే జయప్రద బాలీవుడ్ లో అడుగు పెట్టారు. రిషికపూర్ హీరోగా రూపొందిన ఈ చిత్రం గోల్డెన్ జూబ్లీ చూసింది. అక్కడ కూడా తనదైన బాణీ పలికించిన విశ్వనాథ్ ఆ తరువాత హిందీలో “కామ్ చోర్, శుభ్ కామ్నా, జాగ్ ఉఠా ఇన్సాన్, సన్జోగ్, సుర్ సంగమ్, ఈశ్వర్, సంగీత్, ధన్ వాన్, ఔరత్ ఔరత్ ఔరత్” వంటి చిత్రాలు రూపొందించారు. వీటిలో ‘సర్గమ్’ స్థాయిలో ఏ చిత్రమూ విజయం సాధించలేదు. అయినా, అక్కడ కూడా విశ్వనాథ్ బాణీకి జనం జేజేలు పలికారు.
వాలంటైన్స్ డే స్పెషల్.. 9.5 కోట్ల ఉచిత కండోమ్స్ పంపిణీ

ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా థాయిలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రోజు తమ దేశవ్యాప్తంగా 9.5కోట్ల ఉచిత కండోమ్స్ పంపిణీ చేయాలని తలంచింది. పర్యాటకుల స్వర్గధామంగా థాయిలాండ్ దేశాన్ని భావిస్తారు. ఫిబ్రవరి 1 నుంచే థాయిలాండ్ దేశవ్యాప్తంగా ఫ్రీ కండోమ్స్ పంపిణి కార్యక్రమం ప్రారంభమైంది. మామూలు రోజుల్లోనే థాయిలాండ్ లో ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇక వాలంటైన్స్ డే అంటే.. ప్రేమికులంతా థాయిలాండ్‌లో విచ్చలవిడిగా రెచ్చిపోతారు. ఆ తర్వాత శృంగారానికి సిద్ధమవుతారు. సాధారణంగా సుఖ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. టీనేజ్ ప్రెగ్నెన్సీ ప్రమాదం కూడా ఉంది. ఆ తర్వాత వారంతా అబార్షన్లకు ప్రయత్నిస్తే అది మరో పెద్ద సమస్య. అందుకే అలాంటి సమస్యలేవీ లేకుండా ముందుగానే ప్రభుత్వం 9కోట్ల 50 లక్షల కండోమ్ లు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. థాయిలాండ్ హెల్త్ కేర్ కార్డ్ కలిగి ఉన్నవారికి వారానికి 10 కండోమ్ లు ఉచితంగా ఇస్తారు.
ఫిబ్రవరి మాసం… విశ్వనాథుని బంధం!

కాశీనాథుని విశ్వనాథ్ ఈ లోకంలో కన్నుతెరచింది 1930 ఫిబ్రవరి 19 న . తన బి.యస్సీ పట్టా పుచ్చుకోగానే చిత్రసీమపై ఆసక్తితో ఆయన విజయావాహినీ స్టూడియోస్ లో అడుగు పెట్టిందీ 1950 ఫిబ్రవరిలోనే. విజయా సంస్థ నిర్మించిన అనేక చిత్రాలకు వి.శివరామ్ వద్ద సౌండ్ రికార్డింగ్ విభాగంలో పనిచేశారు. అక్కడ ఉండగానే దర్శకత్వంపై మనసు మల్లించారు. కేవీ రెడ్డి, ఎల్వీ ప్రసాద్ వంటి దిగ్దర్శకుల పనితీరును గమనిస్తూ వచ్చారు. తరువాత ఆదుర్తి సుబ్బారావు వద్ద 1956లో చేరిందీ ఫిబ్రవరి మాసంలోనే. అన్నపూర్ణ సంస్థ నిర్మించిన అనేక చిత్రాలకు ఆదుర్తికి అసోసియేట్ గా పనిచేశారు విశ్వనాథ్. ఆయనలోని ప్రతిభను గమనించిన అన్నపూర్ణ అధినేత దుక్కిపాటి మధుసూదనరావు తమ ‘ఆత్మగౌరవం’ చిత్రంతో దర్శకునిగా పరిచయంచేశారు. ఆ సినిమా తొలి కాపీ సిద్ధమయింది 1966 ఫిబ్రవరిలోనే. అయితే సినిమాను పలువురికి చూపించి విడుదల చేసేటప్పటికి మార్చి 11 అయింది.