రెండవ రోజు కోడిపందాల జోరు.. గుండాటల హోరు

సంక్రాంతి సందర్భంగా ఏపీలో సందడి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ నుంచి భారీ సంఖ్యలో భారీగా జనం చేరుకున్నారు. సినిమా తారలు, సెలబ్రిటీలు, రాజకీయ నేతల ఎంట్రీతో కోడిపందాల జోరు కొనసాగుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రెండవ రోజు సంక్రాంతి కోడిపందాలు ప్రారంభమయ్యాయి. కోనసీమ వ్యాప్తంగా వందల సంఖ్యలో బరులు ఏర్పాటు చేశారు. పలుగ్రామాల్లో రెండు నుంచి మూడు కోడిపందాల బరులు ఏర్పాటు చేసి జోరుగా పందాలు నిర్వహిస్తున్నారు. బరుల వద్దకు జోరుగా పందెం రాయళ్లు తరలివస్తున్నారు.పోలీసుల హెచ్చరికలు నేపధ్యంలో గుండాటలు, గ్యాంబ్లింగ్ గేమ్స్ పై నిషేధం కొనసాగుతుంది. రెండవ రోజు కోడిపందాల హోరుతో సంక్రాంతి పండుగ శోభ రెట్టింపయింది. కోడిపందాలలో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి.కాకినాడ రూరల్ లో కోడిపందాల నిర్వాహకులు ఆకర్షణీయమయిన బహుమతులు అందచేస్తున్నారు. వందల బరుల్లో కోడిసందాలు సాగుతున్నాయి. పందేల్లో గెలిచిన కోడిపుంజు యజమానులకు రాయల్ ఎన్ ఫీల్డ్ వంటి ఖరీదైన బైకులు బహుమతులు అందచేస్తున్నారు. కాయ్ రాజా కాయ్ అంటూ మంచి ఊపు మీదున్నారు.
ఫ్రెండ్ పిలిస్తే వచ్చా.. నాగబాబు కామెంట్లపై స్పందిస్తా

వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మళ్లీ వార్తల్లోకి వచ్చారు. సంక్రాంతి కోడి పందాల జోరు కొనసాగుతున్న వేళ ఆయన కాకినాడలో సందడి చేశారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి వచ్చారు రాంగోపాల్ వర్మ. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. నటుడు నాగబాబు వ్యాఖ్యలు పై స్పందించడానికి నిరాకరించారు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. నాగ బాబు ఏం మాట్లాడారో వినలేదు.. నాగబాబు కామెంట్స్ చూసి స్పందిస్తాను.. ఫ్రెండ్స్ పిలిస్తే ఇక్కడి వచ్చాను..అంతే అన్నారు రాంగోపాల్ వర్మ. నా జీవితంలో మొట్ట మొదటి సారి ఆంధ్రాలో పబ్లిక్ గా ప్రజలతో సంక్రాంతి సంబరాలలో పాల్గొనబోతున్నాను..దీని వెనుక ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదని నన్ను ద్వేషించే పార్టీ మీద ఒట్టేసి చెప్తున్నాను అంటూ పండుగకు ముందే ఆయన ట్వీట్ చేశారు. వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై జనసేన నాయకుడు, మెగా బ్రదర్ నాగబాబుతీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. రాంగోపాల్ వర్మ అనే వాడు పెద్ద ఎదవ అని.. నీచ్, కమీనే, కుత్తేగాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ గురించి, కాపు సామాజిక వర్గం గురించి ట్విట్టర్ వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోన్న రాంగోపాల్ వర్మపై నాగబాబు మండిపడిన సంగతి తెలిసిందే.
రాజకీయాలకు ఇక గుడ్ బై.. దగ్గుబాటి సంచలన ప్రకటన

దగ్గుబాటి వెంకటేశ్వరరావు… తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు అల్లుడు… మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి భర్త. మాజీ సీఎం చంద్రబాబునాయుడుకి తోడల్లుడు. ఒకప్పుడు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన దగ్గుబాటి సంక్రాంతి వేళ కీలక ప్రకటన చేశారు. ఒకవైపు ఏపీ రాజకీయాలు వేడెక్కిన వేళ తన రాజకీయాలపై సంచలన ప్రకటన చేసిన సీనియర్ పొలిటీషియన్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. రాజకీయాలకు నేను నాకుమారుడు హితేష్ స్వస్తి చెబుతున్నాం.. ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో మేము ఇమడ లేము అన్నారు. డబ్బుతో నడిచే రాజకీయాలు మనస్సు చంపుకొని చేయలేము..ప్రజా సేవ చేయాలనుకుంటే పదవులు లేకున్నా సొంతంగా చేస్తామన్నారు. ఇప్పుడు విలువలతో కూడిన రాజకీయాలు లేవు అన్నారు. దగ్గుబాటి వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. తాను, తన కుమారుడు హితేష్ రాజకీయాలకు స్వస్తి చెబుతున్నామని మాజీ మం దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రకటించడంపై ఇంకా ఎవరూ స్పందించలేదు. బాపట్ల జిల్లా ఇంకొల్లులో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవ వేదికపై ఈ ప్రకటన చేయడం ప్రాధాన్కత సంతరించుకుంది.
నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం

నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. యతి ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం కుప్పకూలింది. 72 సీట్ల సామర్థ్యం ఉన్న విమానం పోఖారాలోని అంతర్జాతీయ విమానాశ్రయం రన్ వేపై కుప్పకూలింది. దేశ రాజధాని ఖాట్మాండు నుంచి బయలుదేరిన విమానం పోఖారాలో ల్యాండ్ అవుతున్న సమయంలో ప్రమాదానికి గురైంది. ప్రమాదం సమయంలో ఫ్లైట్ లో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారని యతి ఎయిర్ లైన్స్ ప్రతినిధి సుదర్శన్ బర్తౌలా ప్రకటించారు. ల్యాండింగ్ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఎయిర్ పోర్టును మూసేశారు. ప్రమాదంలో చాలా మంది వరకు చనిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. మృతుల సంఖ్యపై ఇంకా ఎలాంటి వివరాలు ప్రకటించలేదు నేపాల్ ప్రభుత్వం.
గోధుమ పిండి ట్రక్కు వెంట వందలాది బైకులు..తిండి కోసం పాక్ ప్రజల తిప్పలు

కిస్తాన్ లో పరిస్థితులు దిగజారాయి. తినడానికి తిండిలేక అక్కడి ప్రజలు అల్లాడుతున్నారు. గోధుమ పిండి దొరక్క నానా అవస్థలు పడుతున్నారు పాకిస్తాన్ ప్రజలు. పిండికి పెరిగిన రెట్లు, వ్యాపారులు బ్లాక్ చేయడంతో అక్కడ గోధుమ పిండికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా బలూచిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్( పీఓకే)లో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. సింధ్, పంజాబ్ ప్రావిన్సుల నుంచి గోధుమల లోడ్ తో ఏదైనా ట్రక్కు వెళ్తే, బలూచిస్తాన్, పీఓకేకు చేరే అవకాశమే లేదు.. ఎందుకంటే మార్గం మధ్యలోనే ప్రజలు దాడి చేసి గోధుమ పిండిని ఎత్తుకెళ్లే పరిస్థితులు ఉన్నాయి. తాజాగా ఓ వీడియో పాకిస్తాన్ తో పాటు ఇండియాతో తెగ వైరల్ అవుతోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో గోధుమపిండి లోడ్ తో వెళ్తున్న ఓ ట్రక్కును వందలాది మంది ప్రజలు బైకులతో వెంబడించడాన్ని గమనించవచ్చు. బైక్ ర్యాలీ తరహాలో ట్రక్కును వెంబడిస్తున్న ఈ వీడియో అక్కడి పరిస్థితులకు అద్దంపడుతోంది. దీనిని నేషనల్ ఈక్వాలిటీ పార్టీ జమ్మూ కాశ్మీర్, గిల్గిత్-బాల్టిస్తాన్ అధ్యక్షుడు సజ్జాద్ రజా ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియో పాకిస్తాన్ పరిస్థితులకు ఉదాహరణ అని, పీఓకే ప్రజలు ఇప్పటికైనా కళ్లు తెరవండి, మనకు పాకిస్తాన్ తో భవిష్యత్తు ఉంటుందని అనుకుంటున్నారా..? పాకిస్తాన్ మనపై వివక్ష చూపిస్తుందంటూ ట్విట్టర్ లో తన బాధను వ్యక్తం చేశారు.
మారుతున్న దేశ భవిష్యత్తుకు వందేభారత్ ఒక ఉదాహరణ
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. మోదీ ఈ రైలును వర్చువల్ గా ప్రారంభించారు. ఈ రైలును ప్రారంభించిన అనంతరం ప్రదాని మోడీ ప్రసంగించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వందేభారత్ పండుగ కానుక అని ప్రధాని మోడీ అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య వేగవంతమైన ప్రయాణానికి ఈ రైలు అవకాశం కల్పిస్తుందని మోడీ అభిప్రాయపడ్డారు. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు వల్ల రెండు తెలుగు రాష్ట్రాలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ రైలుతో సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ప్రయాణ సమయం కూడా తగ్గుతుందని మోడీ చెప్పారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో పూర్తిగా స్వదేశీ రైళ్ల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని మోడీ అన్నారు. దేశ భవిష్యత్తు మారుతుందనడానికి వందే భారత్ ఓ ఉదాహరణ అని మోడీ పేర్కొన్నారు. 2023లో ప్రారంభం కానున్న తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇదేనని ఆయన వివరించారు.అతి తక్కువ సమయంలో ఏడు వందల భారతీయ రైళ్లను ప్రారంభించామని ప్రధాని తెలిపారు. ఈ రైళ్లలో ఇప్పటికే 40 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారు.
నిప్పుకొండ, నిలువెత్తు రాజసం… కలిస్తే చరిత్ర తిరగ రాయడం ఖాయం
గ్లోబల్ స్టార్ ప్రభాస్ వచ్చినప్పుడు తెలుగు ఒటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’ క్రాష్ అయ్యింది. ఇప్పుడు మరోసారి అలాంటిదే ఆహా విషయంలో జరగబోతోంది. అప్పుడు గెస్ట్ ప్రభాస్ అయితే ఈసారి గెస్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నిమ్మళంగా కనపడే నిప్పుకొండ లాంటి పవన్ కళ్యాణ్, నిలువెత్తు రాజసంలా ఉండే బాలకృష్ణలు కలిస్తే మాటల తూటాలు పెలాల్సిందే అంటూ ఆహా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. క్రేజీ ఎపిసోడ్ ని రెడీ అవ్వండి అంటూ ఒక చిన్న గ్లిమ్ప్స్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ ఎంట్రీ నుంచి స్టేజ్ పైకి వచ్చి నిలబడే వరకూ ఉన్న ఈ గ్లిమ్ప్స్ లో బాలయ్య ఒక చిన్న డైలాగ్ తో పవన్ కళ్యాణ్ ని ఫుల్ గా నవ్వించేసాడు.అన్-స్టాపబుల్ సీజన్ 2కి క్లోజింగ్ ఎపిసోడ్ గా త్వరలో స్ట్రీమ్ అవ్వనున్న ఈ ఎపిసోడ్ దెబ్బకి ఆహా షేక్ అవ్వడం గ్యారెంటి. కొంచెం ఫన్, కొంచెం పాలిటిక్స్, కొంచెం పర్సనల్ ఇలా పవన్ కళ్యాణ్ ని సంబంధించిన అన్ని విషయాలని బాలయ్య ఆడియన్స్ కి తెలిసేలా చెయ్యబోతున్నాడట. ఒక టాక్ షో హిస్టరీలోనే ముందెన్నడూ లేని రికార్డ్స్ ని క్రియేట్ చేసిన అన్ స్టాపబుల్ షో సీజన్ 2 పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో ఎండ్ అయిపోతే మరి సీజన్ 3 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? దాని అప్డేట్ ఎప్పుడు ఇస్తారు? సీజన్ 3 ఉంటుందా లేక ఇక్కడితో బాలయ్య టాక్ షోకి ఎండ్ కార్డ్ పడుతుందా అనేది తెలియాలి అంటే ఈ బాలయ్య-పవన్ కళ్యాణ్ ల ఎపిసోడ్ వచ్చే వరకూ వెయిట్ చెయ్యాల్సిందే.
మిస్ యూనివర్స్ 2022 ఆర్ బోని గాబ్రియేల్

మిస్ యూనివర్స్ 2022 కిరీటం అమెరికాకు చెందిన ఆర్‌బోని గాబ్రియేల్ ను వరించింది. అమెరికాలోని లూసియానాలోని న్యూ ఓర్లీన్స్ లో జరిగిన ఈ పోటీల్లో ఆర్‌బోని గాబ్రియేల్ మిస్ యూనివర్స్ కిరిటాన్ని సొంతం చేసుకుంది. 71వ మిస్ యూనివర్స్ పోటీల్లో మొత్తం 84 దేశాల నుంచి అందగత్తెలు పోటీలో పాల్గొన్నారు. మిస్ వెనుజులా ఫస్ట్ రన్నరప్ గా నిలువగా.. మిస్ డొమినికన్ రిపబ్లిక్ సెకండ్ రన్నరప్ గా నిలిచారు. మిస్ యూనివర్స్ 2021గా నిలిచిన భారత మహిళ హర్నాజ్ కౌర్ సంధు, ఆర్‌బోని గాబ్రియేల్ ను కిరీటంతో అలంకరించారు. మిస్ యూఎస్ఏ 2022గా నిలిచిన ఆర్‌బోని గాబ్రియేల్ మిస్ యూనివర్స్ 2022గా కిరిటాన్ని కైవసం చేసుకుంది. ఫ్యాషన్ డిజైనర్, మోడల్ అయిన ఆర్‌బోని గాబ్రియేల్, తన చిన్న తనం నుంచే ఫ్యాబ్రిక్స్, టెక్స్ టైల్స్ డిజైన్స్ మక్కువ పెంచుకున్నారు. యూనివర్శిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌లో, ఆమె 2018లో ఫైబర్స్‌లో మైనర్‌తో ఫ్యాషన్ డిజైన్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందింది. ఆర్‌బోని గాబ్రియేల్ సొంతంగా ఆర్‌బోని నోలా అనే దుస్తుల కంపెనీకి సీఈఓగా ఉన్నారు. ఇదిలా ఇంటే ఇండియాకు చెందిన దివితా రాయ్ మిస్ యూనివర్స్ కిరీటంపై చాలా ఆశలు పెట్టుకున్నప్పటికీ నిరాశే ఎదురైంది.