ప్రస్తుత కాలంలో సిజేరియన్లు పెరుగుతున్నప్పటికీ, ప్రకృతి సిద్ధంగా జరిగే నార్మల్ డెలివరీనే తల్లికి, బిడ్డకు శ్రీరామరక్ష అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రసవ వేదన అనేది ఒక మధురమైన అనుభూతి మాత్రమే కాదు, అది బిడ్డ ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పునాది కూడా. సిజేరియన్ (ఆపరేషన్) తో పోలిస్తే నార్మల్ డెలివరీ వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే, ప్రతి గర్భిణీ దీనికే ప్రాధాన్యత ఇస్తారు. తల్లి ఆరోగ్యంగా కోలుకోవడం నుండి, బిడ్డలో రోగనిరోధక శక్తి పెరగడం వరకు నార్మల్ డెలివరీ లో దాగి ఉన్న ఆ అద్భుతమైన లాభాల ఇవే..
Also Read : Healthy Food Myths: హెల్తీ ఫుడ్ అని తింటున్నారా? జాగ్రత్త.. ఆ ఆహారపు అలవాట్లతోనే అసలు ముప్పు!
సిజేరియన్ (ఆపరేషన్) తో పోలిస్తే నార్మల్ డెలివరీ అనేది తల్లికి, బిడ్డకు ఎంతో సురక్షితమైనది. తల్లి విషయానికి వస్తే, నార్మల్ డెలివరీలో రక్తస్రావం చాలా తక్కువగా ఉండటంతో పాటు, ఆపరేషన్ కుంట్లు పడవు కాబట్టి ఆమె శారీరకంగా చాలా త్వరగా కోలుకుని తన పనులు తాను చేసుకునే వీలుంటుంది. అలాగే దీనికి ఎటువంటి మత్తు (అనస్థీషియా) ఇవ్వాల్సిన అవసరం ఉండదు కాబట్టి, మత్తు వల్ల వచ్చే వాంతులు లేదా తలనొప్పి వంటి ఇబ్బందులు కూడా ఉండవు.
ఇక బిడ్డ ఆరోగ్య విషయానికి వస్తే, పుట్టే సమయంలో వెజైనా లో ఉండే ‘మంచి బ్యాక్టీరియా’కు బిడ్డ ఎక్స్‌పోజ్ అవ్వడం వల్ల, అది బిడ్డ పేగుల్లో రక్షణ కవచంలా మారి భవిష్యత్తులో అద్భుతమైన రోగనిరోధక శక్తిని, మెరుగైన జీర్ణ ఆరోగ్యాన్ని అందిస్తుంది. అంతేకాకుండా, బిడ్డ సహజ మార్గం ద్వారా బయటకు వచ్చేటప్పుడు కలిగే ఒత్తిడి వల్ల ఊపిరితిత్తుల్లో ఉండే ద్రవమంతా (నీరంతా) సహజంగానే బయటకు వచ్చేస్తుంది, దీనివల్ల పుట్టిన తర్వాత బిడ్డకు ఎటువంటి శ్వాస సంబంధిత ఇబ్బందులు కలగవు. అందుకే వైద్యపరంగా అత్యవసరమైతే తప్ప, సహజ ప్రసవానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అటు తల్లికి, ఇటు పుట్టబోయే బిడ్డకు దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.