ఇప్పటివరకు ఒక లెక్కా.. ఇప్పటి నుంచి ఒక లెక్కా అంటున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. రోజు రోజుకు నగరంలో ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతోంది. అందుకు అనుగుణంగానే ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు రాష్ట్రప్రభుత్వంతో పాటు.. పోలీసు శాఖ సమన్వయమవుతూ నిర్ణయాలు తీసుకుంటోంది. భాగ్యనగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు ఇప్పటికే ఎన్నో నిర్ణయాలు తీసుకున్న పోలీసు శాఖ… ఇప్పుడు మరో కీలక నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు సిగ్నల్ వద్ద స్టాప్ లైన్ క్రాస్ చేసినా.. ఫ్రీ లెఫ్ట్‌ను బ్లాక్ చేసినా చూసి చూడనట్లున్నారు. కానీ ఇప్పటి నుంచి అది కుదరదని తేల్చి చెప్పారు. ఇక నుంచి సిగ్నల్స్ దగ్గర స్టాప్ లైన్స్ దాటితే కఠినచర్యలు తీసుకుంటామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.
స్టాప్ లైన్ దాటి ముందుకు వస్తే రూ,100 జరిమానా.. ఫ్రీలెఫ్ట్ ను బ్లాక్ చేస్తే రూ.1000 జరిమానా.. పాదచారులకు ఆటంకం కలిగేలా పార్కింగ్ చేస్తే రూ.600 ఫైన్ విధించనున్నట్లు రూల్స్‌ను రూపొందించారు. అయితే.. ఈ రూల్స్ ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయనే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వకపోయినా.. త్వరలోనే వాహనదారులకు ఫైన్‌ల మోత మోగడం ఖాయమనిపిస్తోంది.