Nara Lokesh Responds on YS Jagan Arrest: సింగపూర్ పర్యటన వివరాలను వెల్లడించేందుకు ఈరోజు మంత్రి నారా లోకేష్ సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందాలు, ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు, మద్యం కుంభకోణం.. పలు అంశాలపై మాట్లాడారు. ఈ క్రమంలో మద్యం కుంభకోణం కేసులో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అరెస్ట్ అవుతారా? అని ఓ మీడియా ప్రతినిథి ప్రశ్నించగా.. మంత్రి లోకేష్ ఆసక్తికర సమాధానం చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని లోకేష్ అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘మేమంతా అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతో పరుగులు పెడుతోంటే.. వైఎస్ జగన్ తప్పుడు ఈ-మెయిల్స్ పెట్టిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో రాజకీయాన్ని ఆ రాష్ట్రానికే పరిమితం చేస్తారు. ఇతర ప్రాంతాలకు వెళ్తే రాష్ట్రాభివృద్ధి కోసం పని చేస్తారు. కానీ రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఏపీలోనే ఉంది. ఏపీ బ్రాండ్ దెబ్బతీసేలా కుట్రలు పన్నుతున్న వారిని వదిలిపెట్టం, చర్యలు తీసుకుంటాం. ఏపీ బ్రాండ్ దెబ్బ తీసే వ్యక్తులు ఎవరైనా ఉపేక్షించము. ఓ లిక్కర్ కంపెనీ రూ.400 కోట్ల బంగారం కొనుగోలు చేస్తుందా?. లిక్కర్ కంపెనీకి బంగారం ఏమన్నా ముడిసరుకా. అదాన్ డిస్టలరీ కంపెనీ నుంచి పీఎల్ఆర్ కంపెనీకి డబ్బులు ఎందుకెళ్లాయి. దీనికి పాపాల పెద్దిరెడ్డి సమాధానం చెప్పగలరా?, పెద్దిరెడ్డికి ఛాలెంజ్ విసురుతున్నా. రాజ్ కెసిరెడ్డి ఆ డబ్బులు నావి కాదన్నాడంటే.. జగన్ రెడ్డివి అని చెప్పాడని అర్థం చేసుకోవాలి’ అని మంత్రి నారా లోకేష్ అన్నారు.
Also Read: Nara Lokesh: ప్రభుత్వం మారిపోతుందని ఈ-మెయిల్ పంపారు.. ఎవరా అని చూస్తే..!
‘ఎమర్జెన్సీ వాతావరణం ఉంటే అసలు వైఎస్ జగన్ బయటకు రాగలరా. జగన్ హయాంలో చంద్రబాబు నాయుడు ఇంటి గేటుకు తాళ్లేసి కట్టలేదా. పోలీసులను భద్రత పెడితే.. పోలీసులను మొహరించారని అంటారు. పోలీసులని పెట్టకుంటే భద్రత ఇవ్వలేదని అంటారు. సొంత తల్లి, చెల్లి మీద ఎవరైనా కేసులు పెడతారా. ఆ కేసులో గెలిచానని సంబరాలు చేసుకుంటారా. తల్లి మీద కేసు పెట్టి సంబరాలు చేసుకునే ఏకైక వ్యక్తి జగన్ మోహన్ రెడ్డే. తల్లి, చెల్లికి అన్యాయం చేసిన వ్యక్తి అసలు నాయకుడిగా పనికోస్తారా. జగన్ అభివృద్ధి చేయరు. చేసేవాళ్లను అడ్డుకుంటున్నారు. ఆయన పాచికలు పారలేదు’ అని మంత్రి నారా లోకేష్ విమర్శించారు.