Vasantha vs Deveneni: మైలవరం టీడీపీలో పొలిటికల్ రచ్చ జరుగుతోంది. వసంత వర్సెస్ దేవినేనిగా మారిన మైలవరం నియోజకవర్గ రాజకీయాలు మారిపోయాయి. పోటా పోటీ కార్యక్రమాల దెబ్బకి టీడీపీ క్యాడర్‌లో హైరానా మొదలైనట్లు తెలుస్తోంది. దేవినేని ఉమ, సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మైలవరం టికెట్ కోసం పట్టుబడుతున్నారు. టికెట్ తనకే అంటూ వసంత కృష్ణ ప్రసాద్ ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. మండల స్థాయి నేతలతో వసంత కృష్ణ ప్రసాద్ ఫోన్‌లో టచ్‌లోకి వెళ్లారు. అయితే, వసంత కృష్ణ ప్రసాద్ ఇంతవరకు టీడీపీలో చేరలేదు.అంతేకాకుండా దేవినేని ఉమతో తనకు ఎలాంటి విబేధాలు లేవంటున్నారు వసంత. రేపు టీడీపీలో చేరేందుకు తన వర్గం నేతలతో హైదరాబాద్ వెళ్తున్నారు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.
Read Also: Harirama Jogaiah: జనసేన సహకారం లేకుండా టీడీపీ నెగ్గడం అసాధ్యం
ఇదిలా ఉండగా.. టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి దేవినేని ఉమ సైతం మైలవరం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మైలవరం టికెట్‌పై దేవినేనికి చంద్రబాబు క్లారిటీ ఇచ్చారని చర్చ జరుగుతోంది. దీంతో మైలవరం నియోజకవర్గం కార్యకర్తలు గందరగోళంలో పడిపోయారు. ఓవైపు వసంత కృష్ణ ప్రసాద్, మరోవైపు దేవినేని ఉమ.. మైలవరం టికెట్ నాదే అంటే నాదే అంటూ ప్రచారం చేసుకోవడంతో.. నియోజకవర్గంలోని టీడీపీ కేడర్ అయోమయంలో పడిపోయింది. ఇంతకీ మైలవరం టీడీపీ అభర్థి ఎవరో త్వరగా తేల్చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇవాళ నియోజక వర్గంలో ఎన్నికల శంఖారావం నిర్వహిస్తున్నారు దేవినేని ఉమా. ఇంకా అధిష్ఠానం టికెట్ ఖరారు చేయకపోవడంతో ఎవరికి వారు ప్రయత్నాల్లో మునిగిపోయారు. ఉమాను చంద్రబాబు పిలిచి మాట్లాడితే బాబు మాటే శిరోధార్యం అని దేవినేని ఉమా చెప్పినట్లు తెలిసిది. ఉమా కార్యక్రమాలపై పార్టీ నేతలు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఉమా, వసంత మధ్య సయోధ్య కుదరకపోతే పార్టీ గెలుపు ఓటములపై ప్రభావం చూపుతుందని క్యాడర్ టెన్షన్ పడుతోంది.