Vasantha Krishna Prasad: మాజీ మంత్రి దేవినేని ఉమాపై మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మండిపడ్డారు. ‘అన్నీ ఉన్నమ్మ అణిగి మణిగి ఉంటే ఏమి లేనమ్మ ఎగిరెగిరి పడుతోంది’ అన్నట్లుగా దేవినేని ఉమా పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. తను శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, మంచి పనులు చేస్తుంటే చూసి తట్టుకోలేకపోతున్నాడని ఆయన అన్నారు. నాకంటే ముందు ఐదేళ్ళు మంత్రిగా పనిచేసి మైలవరంలో డ్రైనేజీలు ఎందుకు కట్టించలేదని దేవినేని ఉమను వసంత కృష్ణ ప్రసాద్ ప్రశ్నించారు. రాష్ట్రంలో పెద్ద తోపును, తురుమును అని చెప్పుకున్న దేవినేని ఉమా.. మైలవరంను ఎందుకు అభివృద్ధి చేయలేక పోయారన్నారు.
Also Read: Boy Suicide: తండ్రి మందలించాడని ఎలుకల మందు తిని విద్యార్థి మృతి
నువ్వు అభివృద్ధి చేసి ఉంటే ఈ రోజున నన్ను ప్రశ్నించే అవకాశం నీకు ఉండేది కాదు కదా అంటూ ఎమ్మెల్యే అన్నారు. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి పనులు చూసిన దేవినేని ఉమా రేపో మాపో మళ్ళీ ఎక్కడో ఒక చోట మురికి గుంటల వెంట పడతాడరని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ఎప్పుడూ చూడని వింతల తరహాలో మురికి కాలవలను చూపిస్తూ శునకానందం పొందటం దేవినేని ఉమా నైజం అంటూ ఆయన విమర్శించారు. దేవినేని ఉమాకు విలువ, గౌరవం, మర్యాద ఏమీలేవన్నారు. 2019 నాటికి పోలవరం పూర్తి అవుతుంది రాసి పెట్టుకో అన్నాడు..అదీ పూర్తి చేయలేదన్నారు. దేవినేని ఉమా వికృత చేష్టలు చూసి జనం అసహ్యించుకుంటున్నారని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అన్నారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ, శక్తిమేరకు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.