Boy Suicide: నవమాసాలు మోసి కనిపెంచితే వృద్ధాప్యంలో తోడుగా ఉంటారనుకున్న బిడ్డలు క్షణికావేశంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలతో ఆ తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు.. పరీక్షలో ఫెయిల్ అయ్యానని ఒకరు.. తండ్రి మందలించాడని మరొకరు.. చదువులో రాణించలేకపోతున్నానని ఓ విద్యార్థిని ఇలా చిన్నచిన్న కారణాలతో తల్లిదండ్రులకు కడుపుకోత మిగుల్చుతున్నారు. తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురై 10వ తరగతి చదువుతున్న విద్యార్థి ఎలుకల మందు తిని మృతి చెందిన విషాద ఘటన కృష్ణా జిల్లాలోని పామర్రు మండలం కొరముక్కువానిపురంలో చోటుచేసుకుంది.
Also Read: Electric Shock: ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో విషాదం.. విద్యుదాఘాతంతో మహిళ మృతి
ఓ చిన్న విషయానికి తండ్రి మందలించిన కారణంగా భట్టు యశ్వంత్(16) మనస్తాపం చెంది ఎలుకల మందు తిన్నాడు. యశ్వంత్ ఏఎన్ఎం హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. ఎలుకల మందు తిన్నాడని తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే అతడిని పామర్రులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమంగా మారడంతో విజయవాడకు తరలించేందుకు బయలుదేరారు. కానీ మధ్యలోనే పరిస్థితి విషమంగా మారింది. వెంటనే అతడిని ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. యశ్వంత్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. దీంతో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు.