Aung San Suu Kyi: మయన్మార్ జుంటా గవర్నమెంట్( మిలిటరీ ప్రభుత్వం) పర్యవేక్షణలోని ఎన్నికల సంఘం మంగళవారం సంచలన ప్రకటన చేసింది. ప్రతిపక్ష నేత ఆంగ్ సాన్ సూకీకి భారీ షాక్ ఇచ్చింది. ఆంగ్ సాన్ సూకీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కఠినమైన కొత్త సైనిక-ముసాయిదా ఎన్నికల చట్టం ప్రకారం తిరిగి నమోదు చేసుకోవడంలో విఫలమైందని, అందుకే ఆ పార్టీ గుర్తింపును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
2020 ఎన్నికల్లో గెలిచిన ఎన్‌ఎల్‌డీ ప్రభుత్వాన్ని నిరాధారమైన ఆరోపణలతో కూలగొట్టి ఫిబ్రవరి 2021లో మిలటరీ ప్రభుత్వం పాలనను చేపట్టింది. 10 సంవత్సరాల ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలగొట్టి దేశాన్ని గందరగోళంలోకి నెట్టింది. జనవరిలో, రాజకీయ పార్టీలు తాజా ఎన్నికలకు ముందు సైన్యం రాసిన కఠినమైన కొత్త ఎన్నికల చట్టం ప్రకారం తిరిగి నమోదు చేసుకోవడానికి రెండు నెలల సమయం ఇచ్చింది, అయితే ఇది స్వేచ్ఛగా లేదా న్యాయంగా ఉండదని దాని ప్రతిపక్షాలు ఆందోళన కూడా చేపట్టాయి. ప్రస్తుతం ఉన్న 90 పార్టీలలో 50 మాత్రమే కొత్త నిబంధనల ప్రకారం తిరిగి నమోదు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నాయని రాష్ట్ర ప్రసార సంస్థ తెలిపింది. మిగిలిన వాటిని బుధవారం నుంచి రద్దు చేయనున్నారు.
Read Also: Pakistan: పార్లమెంట్‌లో కొత్త బిల్లును ప్రవేశపెట్టిన పాక్..
మయన్మార్‌లో మిలిటరీ ప్రభుత్వం తీసుకొచ్చిన కఠిన ఎన్నికల చట్టం ప్రకారం కేసులు ఎదుర్కొంటున్న వాళ్లు, అజ్ఞాతంలో ఉన్నవాళ్లు, ఇంకా పలు నిబంధనల కింద రాజకీయ పార్టీలను అధికారికంగా నమోదు చేయడానికి వీల్లేదు. తద్వారా ప్రత్యర్థి పార్టీల అడ్డుతొలగించుకునేందుకు మిలిటరీ ప్రభుత్వం ప్లాన్ వేసింది. ఈ క్రమంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలకు వెళ్తామని చెబుతున్నప్పటికీ, విపక్షాల నుంచి విమర్శలు మాత్రం వినిపిస్తున్నాయి.
Read Also: Karnataka Elections: నేడు కర్ణాటకలో మోగనున్న ఎన్నికల నగారా!
ఆంగ్ సాన్ సూకీ 1988లో ఎన్‌ఎల్‌డీని స్థాపించారు. 1990 జరిగిన ఎన్నికలలో ఘనవిజయం సాధించారు. కానీ అప్పటి జుంటా(మిలిటరీ) ఆ ఎన్నికను రద్దు చేసింది. అయినప్పటికీ ఆమె పోరాడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో 2015, 2020లో జరిగిన ఎన్నికల్లో ఆమె మిలిటరీ భాగస్వామ్య పార్టీలను ఓడించి కూటమి పార్టీల సాయంతో ఘన విజయం సాధించారు. ఇదిలా ఉంటే.. 2020లో జరిగిన ఎన్నికల్లో సూకీ నేతృత్వంలోని ఎన్‌ఎల్‌డీ ఘన విజయం సాధించింది. కానీ, ఎన్నికల్లో మోసం జరిగిందంటూ నిరాధార ఆరోపణలు చేస్తూ.. కిందటి ఏడాది ఫిబ్రవరిలో జుంటా మిలిటరీ నేతలు తిరుగుబాటుకి దిగారు. ఆపై సూకీని జైలు పాలు చేయడంతో పాటు పలు నేరాల కింద ఆమెకు శిక్షలు విధిస్తూ వెళ్తున్నారు. వివిధ కేసుల్లో పడిన జైలుశిక్ష ఇప్పటిదాకా మొత్తం 33 ఏళ్లకు చేరుకుంది. ఫిబ్రవరి 2021లో జరిగిన తిరుగుబాటు ప్రారంభ గంటల నుంచి సూకీ నిర్బంధంలో ఉన్నారు. మరోవైపు ఆమెపై పెట్టిన కేసులపై విచారణ జరుగుతూనే ఉంది. తిరుగుబాటు జరిగినప్పటి నుంచి 3,100 మందికి పైగా మరణించారు. 20,000 మందికి పైగా అరెస్టయ్యారని స్థానిక పర్యవేక్షణ బృందం తెలిపింది.