జనగామ జిల్లాలో రిటైర్డ్ ఎంపిడివో రామకృష్ణయ్య కిడ్నాప్ హత్య ఘటన మరిచిపోక ముందే ములుగు జిల్లాలో ఎంపిడివో పై దాడి హత్యాయత్నం కలకలం సృష్టిస్తోంది. వెంకటాపూర్ ఎంపీడీవో శ్రీనివాస్ పై దాడికి ఆరుగురు కారులో వెంబడించారు. తృటిలో తప్పించుకుని పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఫిర్యాదు చేశారు. ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ములుగు జిల్లా వెంకటాపూర్ ఎంపీడీవో సిహెచ్.శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘పోడు భూముల పట్టాల గురించి మాట్లాడేందుకు మల్లయ్యపల్లి, అడవి రంగాపూర్, రామకృష్ణాపూర్ గ్రామాలకు వెళ్లారు. అక్కడి సర్పంచ్ లు, గ్రామకార్యదర్శులతో చర్చించి తిరిగి వస్తుండగా బూర్గుపేటకు చెందిన భీంరావు, దుగ్యాల రాజు మరో నలుగురు కారులో వెంబడించారు. స్క్రూటి పై వెళ్తున్న ఎంపీడీవోను అడవి రంగాపూర్ దగ్గర ఆపి అడవి రంగాపూర్ సర్పంచ్, కార్యదర్శులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని బూతులు తిట్టారు. ఎంపీడీవో తప్పించుకుని పోగా లక్ష్మీదేవి పేట వద్ద కారు అడ్డుగా పెట్టారు. అక్కడి నుంచి కూడా తప్పించుకుపోగా వదలకుండా నల్లగుంట, రామకృష్ణాపూర్ వరకు వచ్చి కారుతో డ్యాష్ ఇవ్వడానికి ప్రయత్నించారు. సినిమా థ్రిల్లర్ ను తలపించేలా వెంబడించిన వారు దాడికి యత్నించడమే కాకుండా సెల్ ఫోన్ లో వీడియో సైతం తీసుకున్నారు.’ అని తెలిపారు.
ప్రాణభయంతో తప్పించుకుని వెంకటాపూర్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న ఎంపీడీవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంకుడు గుంతల కాంట్రాక్టు తీసుకున్న రాజు, భీంరావు పనులు చేయకుండానే ఎంబి రికార్డు చేసి బిల్లులు చెల్లించాలని ఒత్తిడి చేశారని అందుకు నిరాకరించడంతో దూషించి దాడి చేసి చంపేందుకు యత్నించారని శ్రీనివాస్ తెలిపారు.
స్క్రూటిపై విధులకు హాజరై వెళ్తున్న ఎంపిడిఓ పై దాడికి యత్నించిన రాజు, భీంరావు తోపాటు ఆరుగురుపై ఐపీసీ 353, 341, 506, 290 r/w 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని మిగతా వారికోసం ఆరా తీస్తున్నారు. దాడికి యత్నించిన వారు ఎంతటివారైనా చర్యలు తప్పవని ఎస్ఐ స్పష్టం చేశారు.
పదిరోజుల క్రితం జనగామ జిల్లా పోచన్నపేటకు చెందిన రిటైర్డ్ ఎంపిడిఓ రామకృష్ణయ్య కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటన మరిచిపోకముందే ములుగులో మరో ఎంపిడివో పై దాడికి యత్నించడం ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు.