IPL 2023 Eliminator match: ఐపీఎల్ 2023 తొలి ఎలిమినేటర్ మ్యాచ్‌లో విక్టరీ కొట్టింది ముంబై ఇండియన్స్.. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఫస్ట్ బ్యాటింగ్ కు వచ్చిన ముంబై టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసి.. లక్నో ముందు 183 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది.. టార్గెట్ అంత పెద్దది కాకపోయినా.. లక్నో బ్యాటర్లు తడబడ్డారు.. వరుసగా పెవిలియన్‌కు క్యూకట్టారు.. 16.3 ఓవర్లలో కేవలం 101 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది ఆ జట్టు..
లక్నో ఇన్నింగ్స్‌లో స్టాయినీస్ 40 ఆకట్టుకోగా.., మేయర్స్ 18, హుడా 15 పరవాలేదనిపించారు. అయితే, కృనాల్ 8, మన్కాడ్ 3, బిష్ణోయ్ 3, గౌతమ్ 2, బదోనీ 1 పరుగు మాత్రమే చేశారు.. ఇక, పూరన్ డకౌట్‌గా వెనుదిరిగాడు.. ఈ మ్యాచ్‌లో మాధ్వల్ 3.3 ఓవర్లు వేసి కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీసుకోగా.. జోర్దాన్, పీయూష్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.. మొత్తంగా ఈ మ్యాచ్‌లో లక్నోపై 81 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది.. ఐపీఎల్ ఫస్ట్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజయం సాధించి మరో ముందడుగు వేసింది..
ఇక, ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ 11 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. దీంతో 30 పరుగులకే తొలి వికెట్ ను కోల్పోయింది. ధాటిగా ఆడుతున్నట్లు కనిపించిన మరో ఓపెనర్ ఇషాంత్ కిషన్ 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. యశ్ ఠాకూర్ బౌలింగ్ లో నికోలస్ పూరన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 62 పరుగులకే కీలకమైన రెండు వికెట్లను ముంబై ఇండియన్స్ జట్టు కోల్పోయింది. ఇక క్రీజులోకి వచ్చిన కామెరూన్ గ్రీన్.. సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు కలిసి భారీ షాట్స్ కొట్టడంతో 6 ఓవర్లు ముగిసే సరికే ముంబై స్కోర్ 62 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ జట్టు 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. ఇక పదకొండవ ఓవర్ బౌలింగ్ కు వచ్చిన నవీన్ హుల్ హక్ అద్భుతమైన ఫామ్ లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ ( 20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్ తో 33 పరుగులు), కామెరూన్ గ్రీన్ 23 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ తో 41 పరుగులు)లను అవుట్ చేసి ముంబై ఇండియన్స్ జట్టును కోలుకోని దెబ్బ కొట్టాడు. ముంబై ఇండియన్స్ 16 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి..141 పరుగులు చేసింది.
ఇక ఐదో వికెట్ గా టిమ్ డేవిడ్ 13 పరుగులు చేసి యశ్ ఠాకూర్ బౌలింగ్ లో ఔటయ్యాడు. 18 ఓవర్లో నవీన్ ఉల్ హక్ బౌలింగ్ లో తిలక్ వర్మ భారీ షాట్ ఆడబోయి దీపక్ హుడాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. 19వ ఓవర్ వేసిన మోసిన్ ఖాన్ బౌలింగ్ లో లాంగ్ ఆఫ్ లో ఉన్న దీపక్ హుడాకు క్యాచ్ ఇచ్చి క్రిస్ జోర్దాన్ డగౌట్ కు వెళ్లాడు. ఇక చివర్లో నేహాల్ వధేరా అద్భుతమైన బ్యాటింగ్ తో ముంబై ఇండియన్స్ జట్టుకు భారీ స్కోర్ ను అందించాడు. లాస్ట్ బాల్ కు యశ్ ఠాకూర్ బౌలింగ్ లో వధేరా ఔట్ కావడంతో 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఇక లక్నో సూపర్ జెయింట్స్ టార్గెట్ 183 పరుగులు. ఇక లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్ 4 వికెట్లు, యశ్ ఠాకూర్ 3 వికెట్లు, మోసిన్ ఖాన్ ఒక్క వికెట్ తీసుకున్న విషయం విదితమే.