బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలపై తాత్కాలిక ప్రభుత్వ నాయకుడు, నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ కీలక ప్రకటన చేశారు. 2025 చివరలో లేదా 2026 ప్రథమార్థంలో ఎన్నికలు నిర్వహిస్తామని సోమవారం తెలిపారు. ఎన్నికల సంస్కరణలు, ఓటర్ల జాబితా తయారీల ఆధారంగా ఎన్నికల తేదీని నిర్ణయిస్తామని చెప్పారు. బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ 53వ వార్షికోత్సవం సందర్భంగా యూనస్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘ఎన్నికల సంస్కరణలు, ఓటర్ల జాబితా తయారీ ఆధారంగా సార్వత్రిక ఎన్నికల తేదీని నిర్ణయిస్తాం. ఎన్నికల ప్రక్రియకు కనీసం ఆరు నెలలు పడుతుంది. 2025 చివరలో లేదా 2026 ప్రథమార్థంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల ప్రక్రియలో కీలకమైన దశ అయిన ఓటరు జాబితాను నవీకరించడం మాకు అసలైన పరీక్ష. గత 15 సంవత్సరాలలో ఓటరు జాబితా నవీకరించబడలేదు. గత మూడు ఎన్నికలలో కొత్త వారు ఓటు వేయలేదు కాబట్టి ఇప్పుడు ఓ సవాలుగా మారింది. భవిష్యత్తు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బాధ్యత ఇప్పుడు ఎన్నికల కమిషన్‌పై ఉంది’ అని మహమ్మద్ యూనస్ అన్నారు.
Also Read: Shakib Al Hasan: షకీబ్ అల్ హసన్‌కు ఐసీసీ షాక్.. ఇక బౌలింగ్ చేయకూడదు!
బంగ్లాదేశ్‌లో 2024 జనవరిలో ఎన్నికలు జరిగాయి. ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలకు దూరంగా ఉండటంతో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీకి సునాయాస విజయం దక్కింది. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రిజర్వేషన్లపై విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారి.. వందల మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో హసీనా తన పదవికి రాజీనామా చేసి.. దేశం విడిచి భారత్‌కు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. హసీనా రాజీనామాతో ఆగస్టులో అవామీలీగ్ ప్రభుత్వం పడిపోయింది. అప్పటినుంచి మహమ్మద్ యూనస్ సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం బంగ్లాలో కొనసాగుతోంది.