బంగ్లాదేశ్ దిగ్గజ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌కు వరుస షాక్‌లు తగిలాయి. ముందుగా షకీబ్ బౌలింగ్ యాక్షన్‌పై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిషేధం విధించగా.. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కూడా నిషేధం విధించింది. అంతర్జాతీయ క్రికెట్ సహా దేశ, విదేశీ బోర్డులకు సంబంధించి ఏ లీగ్‌లలో బౌలింగ్ చేయకుండా ఐసీసీ నిషేధించింది. ఈమేరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఓ ప్రకటనను విడుదల చేసింది. షకీబ్ అన్ని రకాల క్రికెట్‌లో బ్యాటర్‌గా మాత్రం కొనసాగవచ్చు.
‘మా ప్లేయర్ షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌ను నిషేధిస్తున్నట్లు ఐసీసీ మాకు సమాచారం ఇచ్చింది. ఈసీబీ విచారణ అనంతరం ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు విదేశాల్లోని ఏ లీగ్‌లలో కూడా షకీబ్ బౌలింగ్ చేయకూడదు. బౌలింగ్ యాక్షన్ కారణంగానే అతడికి ఈ పరిస్థితి ఎదురైంది’ అని బీసీబీ తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబరులో కౌంటీ మ్యాచ్‌లో షకీబ్ అల్ హసన్ బౌలింగ్ యాక్షన్‌పై ఫిర్యాదులు రావడంతో ఈసీబీ పరీక్షించింది. షకీబ్ మోచేయి 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంపు తిరిగినట్లు తేలింది. దాంతో ఐసీసీ అతడిపై వేటు వేసింది.
Also Read: Israel-Hamas War: ఇజ్రాయెల్ దాడులు.. గాజాలో 69 మంది మృతి!
షకీబ్ అల్ హసన్ కొన్ని నెలల క్రితం టీ20 ఫార్మాట్ నుండి రిటైర్ అయ్యాడు. షకీబ్ ఇప్పుడు కెరీర్ ముగింపులో ఉన్నాడు. ఇటీవల భారత్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా.. స్వదేశంలో చివరి టెస్టు ఆడాలనుందని షకీబ్ చెప్పాడు. అయితే బంగ్లాదేశ్‌లో అల్లర్ల కారణంగా మిర్పూర్‌లో దక్షిణాఫ్రికాతో ఫేర్‌వెల్ టెస్టు ఆడలేకపోయాడు. సరైన ఫామ్ లేని షకీబ్‌ను వన్డే స్క్వాడ్ నుంచి కూడా బీసీబీ మేనేజ్‌మెంట్ పక్కనపెట్టింది. స్వదేశానికి వెళ్లలేని పరిస్థితులలో విదేశీ టోర్నీల్లో ఆడుతున్నాడు. ఇప్పుడు అతడి బౌలింగ్ యాక్షన్‌పై వేటు పడడంతో దాదాపుగా అతడి కెరీర్ క్లోజ్ అయినట్లే.