Mudragada Padmanabham: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.. నాపై తెరచాటు రాజకీయం చేయడం కాదు.. జూనియర్ ఆర్టిస్టులతో మాట్లాడించడం కాదు.. నీకు దమ్ముంటే ప్రెస్‌మీట్ పెట్టి.. నాపై మాట్లాడు.. నాపై విమర్శలు చేయి.. నన్ను ప్రశ్నించు అంటూ ప్రతీ సమావేశంలోనూ సవాల్ చేస్తూ వస్తున్నారు.. ఇక, ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన కాపు ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌కు సపోర్ట్ చేయమంటున్నారు.. అసలు ఎందుకు చేయాలి అని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకు పద్మనాభాన్ని అవమానించారు అని చంద్రబాబుని పవన్ కల్యాణ్ ప్రశ్నించలేక పోయారు? అని నిలదీశారు.
ఇక, వైఎస్ జగన్ ను ఎందుకు ప్రశ్నించ లేదు అన్న పవన్ కల్యాణ్‌కి వయస్సు అయిపోయింది అని చెప్పాను.. ఆయన ఎందుకు ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకోవాలి అని ప్రశ్నించారు ముద్రగడ.. తెరచాటు రాజకీయాల్లో పవన్ ఎందుకు చేస్తున్నారు.. దమ్ము ఉంటే ప్రెస్ మీట్ పెట్టు.. నన్ను విమర్శించి చూపించు అని మరోసారి ఛాలెంజ్ చేశారు. తెరచాటు రాజకీయం చేసే పవన్ కల్యాణ్‌కు ఎందుకు సపోర్ట్ చేయాలి అని క్వచ్ఛన్ చేశారు. మరోవైపు.. చంద్రబాబు గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది.. ఆ సమయంలో పవన్ జైలుకు వెళ్లి మద్దతు తెలపడంతో బాబు గ్రాఫ్ పెరిగింది.. అందుకే 80 సీట్లు తీసుకోవాలి, పవర్ షేరింగ్ అడగండి అని సూచించాను అని గుర్తుచేసుకున్నారు.
కాపు యువత జీవితాలతో ఆడుకోకండి అంటూ పవన్ కల్యాణ్‌కు సూచించారు ముద్రగడ.. యువత నాశనం అయిపోతున్నారు.. ప్రజాసేవ అనే మాట పవన్ నోట రావడం లేదని దుయ్యబట్టారు. నాకు బద్ధ శత్రువు అయిన చంద్రబాబుతో మీరు వెళ్తూ నన్ను రమ్మంటే ఎలా..? అని ప్రశ్నించారు. ఇక, వైఎస్ జగన్ పెట్టిన పథకాలు అమలు చేయడానికి పవన్, చంద్రబాబులు ఎందుకు..? అని ఎద్దేవా చేశారు. మరోవైపు.. పవన్ తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేసి ఉంటే బాగుంటుంది.. సినిమా హీరోని ఓడించిన ఘనత కొట్టుకి దక్కేదన్నారు. ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టి ప్రజలను ఆదుకున్న వైఎస్ జగన్ లాంటి ముఖ్యమంత్రి ఎవరూ లేరన్నారు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి పీఠాన్ని ఇంకెవరు కన్నెత్తి చూడకుండా అంతా పని చేయాలి అని పిలుపునిచ్చారు కాపు ఉద్యమనేత, వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం.