ఐపీఎల్ 2025 మెగా వేలంకు సంబంధించి నిబంధనలను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈసారి రిటెన్షన్ పరిమితిని ఆరుగురు ఆటగాళ్లకు పెంచింది. ఇందులో ఒక రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎం) ఆప్షన్ ఉంది. ఓ ఫ్రాంచైజీ ఆరుగురు ఆటగాళ్లను ముందుగానే రిటైన్ చేసుకోవచ్చు లేదా మెగా వేలంలో ఆర్‌టీఎం ద్వారా రిటైన్ చేసుకోవచ్చు. అయితే టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కోసమే బీసీసీఐ ఓ రూల్‌ను మరలా తీసుకొచ్చింది.
ఐపీఎల్ 2025లో రిటైన్ చేసుకునే ఆరుగురు ఆటగాళ్లలో ఓ అన్‌క్యాప్డ్ ప్లేయర్ ఉండాలనే కండిషన్‌ను బీసీసీఐ పెట్టింది. గరిష్టంగా ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు ఛాన్స్ ఉంది. అన్‌క్యాప్డ్ ప్లేయర్ నియమం లీగ్‌లో మొదటి నుంచి భాగంగా ఉంది. కానీ ఏ ప్రాంచైజీ దీనిని ఉపయోగించలేదు. దాంతో 2021లో రద్దు చేశారు. ఇప్పుడు మళ్లీ ఆ నియమంను ప్రారంభించాలని నిర్ణయించారు. దీనికి ప్రధాన కారణం ఎంఎస్ ధోనీనే అని తెలుస్తోంది. గత జులైలో రిటెన్షన్ నిబంధనలకు సంబంధించి బీసీసీఐ, ఫ్రాంచైజీ యజమానుల మధ్య సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ధోనీని కొనసాగించేందుకు అన్‌క్యాప్డ్ ప్లేయర్ నిబంధనను మళ్లీ చేర్చాలని బీసీసీఐని సీఎస్‌కే కోరిందట.
Also Read: IPL 2025 Retention: ఐపీఎల్ 2025 మెగా వేలం.. రిటెన్షన్ లిస్ట్ డెడ్‌లైన్ డేట్ ఇదే!
ఎంఎస్ ధోనీ ఆగస్ట్ 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చాడు. కానీ జులై 2019 నుంచే అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. 2024 జులైతోనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించి 5 సంవత్సరాలు పూర్తయింది. ఇపుడు ధోనీ అన్‌క్యాప్డ్ ఆటగాడవుతాడు. ధోనీని కొనసాగించేందుకే అన్‌క్యాప్డ్ ప్లేయర్ రూల్ తీసుకొచ్చారు. ఈ నిబంధన ప్రకారం మహీని అన్‌క్యాప్డ్ ఆటగాడిగా చెన్నై సొంతం చేసుకుంటుంది. అన్‌క్యాప్డ్ ప్లేయర్‌కు రిటెన్షన్ ఫీజు రూ.4 కోట్లు అన్న విషయం తెలిసిందే. తక్కువ ధరకే ధోనీ లాంటి స్టార్ దక్కుతుండడంతో సీఎస్‌కేకు భారీ లాభం చేకూరనుంది. నవంబరులో ఐపీఎల్ 2025 వేలం జరిగే జరిగే అవకాశముంది.