IPL 2025 Retention Deadline: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలానికి సంబంధించిన నిబంధనలు ఖారారు అయ్యాయి. శనివారం బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఫ్రాంఛైజీలు ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ (అట్టిపెట్టుకోవడానికి) చేసుకోవడానికి గవర్నింగ్ కౌన్సిల్ అనుమతిని ఇచ్చింది. ఇందులో ఒక రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎం) ఆప్షన్ ఉంది. అంతేకాదు ప్రతీ ఫ్రాంచైజీ పర్స్ వాల్యూను రూ.120 కోట్లకు పెంచారు.
ఐపీఎల్ 2025 రిటెన్షన్ లిస్ట్‌కు డెడ్‌లైన్ అక్టోబర్ 31 సాయంత్రం 5 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఈలోపు అన్ని ఫ్రాంఛైజీలు తమ రిటెన్షన్ లిస్ట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. నిబంధనలు ఖరారు చేయకముందే.. చాలా ఫ్రాంఛైజీలు రిటెన్షన్ లిస్ట్‌పై కసరత్తులు చేశాయి. ఫ్రాంఛైజీలు ఐదుగురు ఆటగాళ్లతో లిస్ట్‌ను ఇప్పటికే సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా బీసీసీఐ నిబంధనలను అధికారికంగా ప్రకటించడంతో.. స్వల్ప మార్పులతో ప్రకటించనున్నాయి. ఆరుగురు ఆటగాళ్ల రిటైన్ చాలా ప్రాంచైజీలకు ప్రయోజనం చేకూర్చనుంది.
Also Read: Kanpur Test: మూడో రోజు ఆట ఆలస్యం.. 12 గంటలకు మరోసారి పిచ్ పరిశీలన!
అట్టిపెట్టుకున్న మొదటి ఆటగాడికి ఫ్రాంఛైజీ రూ.18 కోట్లు ఇవ్వాలి. రెండో ఆటగాడికి రూ.14 కోట్లు, మూడో ఆటగాడికి రూ.11 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. నాలుగు, అయిదవ ఆటగాడిని కూడా అట్టిపెట్టుకుంటే.. వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు చెల్లించాలి. ఏ ఫ్రాంఛైజీ అయినా అయిదుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకుంటే.. రూ.75 కోట్లు చెల్లించాలి. అన్‌క్యాప్డ్ ఆటగాడికి 4 కోట్లు ఇవ్వాలి. ఆరుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకుంటే ప్రాంచైజీ వద్ద రూ.41 కోట్లు మాత్రమే మిగులుతాయి. వేలంలో మరో 15 మందిని ఆ సొమ్ముతో మాత్రమే కొనాల్సి ఉంటుంది.