MP Magunta Srinivasulu Reddy: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో మార్పులు, చేర్పులు ఇంకా కాకపుట్టిస్తూనే ఉన్నాయి.. కొందరు సిట్టింగ్‌లకు ఈ సారి సీటు లేదంటూ పార్టీ అధిష్టానం స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో.. వారు పక్కపార్టీల వైపు చూపుస్తున్నారు.. ప్రకాశం జిల్లా వైసీపీలో తాజా పరిణామాల నేపథ్యంలో.. ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి సమావేశం కానున్నట్టు ప్రచారం సాగుతోంది.. హైదరాబాద్ లో నేడు చంద్రబాబుతో ఎంపీ మాగుంట భేటీ కానున్నట్లు సమాచారం..
Read Also: IT Raids: హైదరాబాద్ లోని పాతబస్తీలో ఐటీ సోదాలు..
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిసిన అనంతరం ఢిల్లీ నుంచి రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు మాగుంట.. ఇప్పటికే మాగుంట సిట్టింగ్ స్థానాన్ని కొనసాగించలేమని వైసీపీ అధిష్టానం స్పష్టం చేసిన నేపథ్యంలో.. పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు మాగుంట సిద్ధమైనట్టు ప్రచారం సాగుతోంది.. అందులో భాగంగానే ఈ రోజు చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యి.. టీడీపీలో చేరికపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.. పార్టీ అధినేతతో చర్చలు, సీటుపై హామీ తదితర అంశాలు తేలిన తర్వాత.. రేపు ఒంగోలు వెళ్లి అధికారికంగా టీడీపీలో చేరికపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అనుచరులు చెబుతోన్న మాట.. కాగా, ఎంపీ మాగుంట కోసం చివరి కోసం తీవ్ర ప్రయత్నాలే చేశారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి.. ఈ విషయంలో అధిష్టానంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేసిన ఆయన.. ఇక, సాధ్యం కాదనే సంకేతాలు రావడంతో.. పార్టీకే నిర్ణయాన్ని వదిలేరు. మరి.. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి.. టీడీపీలో చేరతారా? మరోసారి ఎన్నికల బరిలో నిలుస్తారా? అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.