నిజామాబాద్ బీజేపీ జిల్లా కార్యాలయంలో అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించారు దినేష్. ఈ కార్యక్రమంలో ఎంపీ అర్వింద్, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి, ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. హిందూ మతానికి చేసిన పాపాల వల్లే.. కాంగ్రెస్ పార్టీకి అయోధ్య రామయ్యను చూసే భాగ్యం దక్కలేదని ఆయన వ్యాఖ్యానించారు. అయోధ్యకు రాముడొచ్చాడు.. త్వరలో మథురలో శ్రీకృష్ణుడు మందిరంలోకి వస్తారని ఆయన అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో డబ్బులు పంచకుండా గెలుస్తామని ఆయన వెల్లడించారు. ఎన్నికల్లో గాంధీ నోటు అవసరం లేదు, మోడీ పేరుతో గెలుస్తామని ఆయన అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తక్కువ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది, ఇప్పటి వరకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో కోతలు మొదలయ్యాయంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని అర్థమని, కరెంట్ కోతలు కాంగ్రెస్ పేటెంట్ అని ఆయన సెటైర్ వేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు కోసం ఉంచిన 7వేల కోట్లు నిధులను ఇద్దరు మంత్రులకు కాంట్రాక్టు బిల్లులకు మళ్లించారని, రైతులకు ఇన్ స్టాల్ మెంట్లలో రైతు బంధు ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు. రుణ మాఫీ ఎప్పుడు చేస్తారో దేవుడికే తెలియాలని ఆయన ధ్వజమెత్తారు. పసుపు ధర క్వింటాల్‌కు 20వేలు ధర ఇప్పించే బాధ్యత నాదే, నిజామాబాద్ లో 200వందల కోట్లతో పసుపు పరిశోధన కేంద్రం పెట్టితీరుతామన్నారు అర్వింద్. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ను ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు.