Vijayawada: విజయవాడలో వరద బాధితుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే సర్వం కోల్పోయి సాయం కోసం ఎదురుచూస్తున్న బాధితులను దోచుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. తినడానికి తిండి, తాగడానికి నీరు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలను కనీసం కనికరం లేకుండా దోచుకుంటున్నారు. ఒక్కొక్కరిని పడవల్లో ఒడ్డుకు చేర్చేందుకు రూ.1000 నుంచి రూ.1500 డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక వరదలోనే బాధితులు భిక్కుభిక్కుమంటూ గడుపుతున్నారు. రెస్క్యూ బృందాలు స్పందించి తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వేడుకుంటున్నారు.
Read Also: AP Rains and Floods: వరద బాధితులకు ఆహార పంపిణీ.. రంగంలోకి దిగిన హెలికాఫ్టర్లు..
30 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంతగా విజయవాడలో కుంభవృష్టి కురిసింది. విజయవాడ నగరమంతా నీట మునిగింది. దాదాపు 3 లక్షల మంది బాధితులుగా మిగిలారు. విజయవాడలో వరదలు, భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లో 12 మంది ప్రాణాలు కోల్పోగా.. ఆస్తినష్టం గురించి ప్రస్తుతానికి అంచనా వేసే పరిస్థితి లేదు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పినట్టు.. వాయుగుండం తీరం దాటిన ప్రాంతంలోనే దాని ప్రభావం ఉంటే.. ఈ స్థాయిలో ఆస్తినష్టం సంభవించి ఉండేది కాదని తెలుస్తోంది. భారీగా వరదలు ముంచెత్తడంతో విజయవాడ ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేయాలని వేడుకుంటున్నారు.