వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిని ఏదో ఒత్తిడితో రాజీనామా చేయించారని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. రాజ్యసభ స్థానానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేయటం బాధాకరం అని పేర్కొన్నారు. వైసీపీ పార్టీ కష్ట కాలంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డి అండగా నిలబడ్డారన్నారు. రాజ్యసభ పోయినా పర్లేదు, పార్టీకి సేవ చేయమని తాను కోరుతున్నానన్నారు. రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్టు విజయసాయి రెడ్డి శనివారం తెలిపారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ట్వీట్ చేశారు.
మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ… ‘రాజ్యసభ స్థానానికి విజయసాయి రెడ్డి రాజీనామా చేయటం బాధాకరం. పోలీసులు కాలుస్తామని భయపెట్టినా వెనకంజ వేయని తత్వం ఆయనది. అలాంటి విజయసాయి రెడ్డిని ఏదో ఒత్తిడితో రాజీనామా చేయించారు. పార్టీ కష్ట కాలంలో వైఎస్ జగన్ రెడ్డికి అండగా నిలబడ్డారు. రాజ్యసభ పోయినా పర్లేదు కానీ.. పార్టీకి సేవ చేయమని కోరుతున్నా. అయోధ్య రామ రెడ్డికి పార్టీ అంటే నిబద్ధత ఉంది, వైసీపీ కార్యకర్తల మనోభావాలు దెబ్బ తినే విధంగా అయోధ్య రామిరెడ్డి నిర్ణయం ఉండదు. వైసీపీని బలోపేతం చేయడానికి అయోధ్య రామ రెడ్డి ముందు ఉంటారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకొని భయపెట్టి రాజకీయాలు నడపాలి అనుకుంటే.. ఈ దేశంలో ఏ వ్యక్తి రాజకీయాలలో నిలబడలేడు’ అని అన్నారు.