లోక్‌సభలో శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. రాజ్యాంగానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగంపై చర్చ జరుగుతోంది. మరోవైపు పార్లమెంటుకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి సభ్యులు ఘనస్వాగతం పలికారు. ‘భారత్ మాతా కీ జై’ నినాదాలతో పార్లమెంట్ భవనం దద్దరిల్లింది. రాజ్యాంగం ఆవిర్భవించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్‌సభలో మోడీ ప్రసంగించారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని, మన గణతంత్ర దేశం యావత్ ప్రపంచానికి స్ఫూర్తిదాయకమన్నారు. భారతదేశ ప్రజాస్వామ్య నిర్మాణాన్ని దాని సంస్కృతిలో భాగమన్నారు. “భారత ప్రజాస్వామ్యం చాలా గొప్పది. ఇది మన సంస్కృతి, సంప్రదాయలతో నిండిపోయింది. 75 ఏళ్లలో భారతదేశం అసాధారణ విజయాలు సాధించింది. ఎన్నో సవాళ్లను అధిగమించి ముందుకు సాగింది. ఈ శక్తిని ప్రజాస్వామ్యం మనకు అందించింది. మన ప్రజాస్వామ్య గొప్పదనాన్ని చాటి చెప్పుకోవాలి. ఈ రోజు పండుగ జరుపుకోవాలి.” అని మోడీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
READ MORE: CM Chandrababu: డోకిపర్రు శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో సీఎం చంద్రబాబు పూజలు
అంతే కాకుండా.. రాజ్యాంగం 75వ వార్షికోత్సవం సందర్భంగా రాజర్షి పురుషోత్తం దాస్ టాండన్, బాబా సాహెబ్ భీమ్‌రావ్ అంబేడ్కర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. భారతదేశం యొక్క ప్రజాస్వామ్య ప్రయాణం, దాని విజయాలు అసాధారణమైనవిగా ప్రధాని అభివర్ణించారు. భారతదేశ ప్రజాస్వామ్య పునాదిని బలోపేతం చేయడంలో రాజర్షి టాండన్, అంబేడ్కర్ వంటి మహానుభావులు ముఖ్యమైన పాత్ర పోషించారని గుర్తు చేశారు. 75 ఏళ్ల ప్రజాస్వామ్య యాత్రను దేశ పౌరులు సాధించిన గొప్ప విజయంగా చెప్పుకొచ్చారు. నారీ శక్తి వందన్ చట్టాన్ని ప్రస్తావిస్తూ, మహిళా సాధికారత పట్ల ప్రభుత్వ నిబద్ధతకు ప్రతీకగా తెలిపారు. రాజకీయ భాగస్వామ్యంలో మహిళలకు మరిన్ని అవకాశాలు కల్పించడంలో ఈ చట్టం మైలురాయిగా నిలుస్తుందన్నారు. భారతదేశం మొదటి నుంచి మహిళలకు ఓటు హక్కు కల్పించింది. నేడు.. పార్లమెంటులో కూడా మహిళా ఎంపీల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. నారీ శక్తి వందన్ చట్టం ఈ దిశలో ఒక చారిత్రాత్మక అడుగు అని ఆయన తెలిపారు.