మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్ట్ అయితే ఆయన భార్య కల్పనా సోరెన్ సీఎం అవుతారంటూ వార్తలు హల్‌చల్ చేశాయి. హేమంత్ సోరెన్ కూడా కల్పనా వైపు మొగ్గు చూపారు. కానీ చివరికి ఆ ప్లాన్ రివర్స్ కొట్టింది. కూటమిలో విభేదాలు తలెత్తడంతో సడన్‌గా తెరపైకి మరో కొత్త పేరు వచ్చింది.
బుధవారం మధ్యాహ్నం నుంచి హేమంత్ సోరెన్ ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. దాదాపు ఆరు గంటలకు పైగా ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఏ క్షణంలోనైనా హేమంత్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారీ పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో హేమంత్ తన పదవికి రాజీనామా చేశారు. రిజైన్ లెటర్‌ను ఇప్పటికే గవర్నర్ రాధాకృష్ణన్‌కు అందజేశారు.
ఇదిలా ఉంటే బుధవారం మధ్యాహ్నం జేఎంఎం శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హేమంత్ భార్య కల్పనా సోరెన్ కూడా హాజరయ్యారు. అయితే ముఖ్యమంత్రిగా ఆమెను అంగీకరించేది లేదని కుటుంబ సభ్యురాలైన సీతా సోరెన్ తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాదు పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు కూడా కల్పన అభ్యర్థిత్వాన్ని ఆమోదించలేనట్లుగా సమాచారం. కల్పనాకు ఎలాంటి రాజకీయ అనుభవం లేదని.. ఈ నేపథ్యంలో ఆమెను ముఖ్యమంత్రిగా అంగీకరించోమని కొందరు ఎమ్మెల్యేలు తేల్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలతో కూటమిలో విభేదాలు కొట్టిచ్చినట్లుగా కనబడ్డాయి. ఈ పరిస్థితులు రాజకీయ సంక్షోభానికి దారి తీయకూడదన్న నేపథ్యంలో తెరపైకి చంపై సోరెన్‌ను తీసుకొచ్చారు. చంపై సోరెన్ నాయకత్వాన్ని ఎమ్మెల్యేలంతా అంగీకరించినట్లు ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రాజేశ్ ఠాకూర్ తెలిపారు. చంపై సోరెన్ ప్రమాణస్వీకారానికి గవర్నర్‌ను సమయం కోరనున్నట్లు ఆయన వెల్లడించారు.