Kotamreddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.. అదేంటి.. ఈ మధ్యే ఆయనపై పార్టీ వేటు వేసింది.. ఇప్పుడు ఆయన సీఎంకు, ప్రభుత్వానికి అభినందనలు తెలపాల్సిన అవసరం ఏమొచ్చిందంటారా? ఇక, ఆ విషయంలోకి వెళ్తే.. బారాషాహిద్ దర్గా అభివృద్ధికి రూ.15 కోట్ల పనులకు జీవో జారీ చేసి నిధులు విడుదల చేసినందకు సీఎం, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు కోటంరెడ్డి.. నిధుల కోసం 6 నెలల పాటు ప్రభుత్వంతో పాటు, పెద్దల చుట్టూ తిరిగాను అని ఆయన గుర్తుచేసుకున్నారు. నాలుగు సార్లు టెండర్లు పిలిచినా ఒక కాంట్రాక్టర్ కూడా ముందుకు రాలేదు.. వారం రోజుల నుండి ప్రత్యేక కార్యక్రమం చేపట్టాం.. పవిత్ర రంజాన్ మాసంలో దర్గా కోసం ఉద్యమం చేపడితే నెరవేరుతుందని శ్రీకారం చుట్టాం. మా ప్రయత్నంలో విజయం సాధించామని వెల్లడించారు.
రాత్రి దర్గా అభివృద్ధి పనులకు ఆర్ధిక శాఖ అనుమతులు ఇచ్చిందన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. ఇది నా విజయం కాదు నెల్లూరు ముస్లిం సోదరుల పోరాటంగా అభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వానికి నెల్లూరు ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు.. అధికార పక్షమా, ప్రతిపక్షమా అనికాదు సంకల్పం ఉంటే ఏదైన సాధ్యం అవుతుందన్నారు. ఇదే, సమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పొట్టేపాలెం కలుజుపై కూడా స్పందించాలని కోరారు.. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. జగనన్న కాలనీలలో కనీస వసతులు కల్పించాలి.. గణేష్ ఘాట్ నిర్మాణం కోసం కేంద్ర ఇచ్చిన రూ.16 కోట్ల నిధులు వెనక్కిపోకుండా చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల వేళ మాత్రమే జెండా.. అజెండాలు.. మిగిలిన సమయంలో ప్రజా సమస్యలే అన్నారు.. నెల్లూరు రూరల్ సమస్యలపై రేపటి నుండి మరో ఉద్యమానికి శ్రీకారం చూడతానని ఈ సందర్భంగా ప్రకటించారు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.