Anil Kumar Yadav: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో చేసిన ఆరోపణలపై వైసీపీ మాజీ మంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. తన తండ్రి ఇచ్చిన ఆస్తి కంటే రూపాయి ఎక్కువ ఉన్నా వెంకటేశ్వరస్వామి వద్ద ప్రమాణం చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. నెల్లూరులో పాదయాత్ర సందర్భంగా అనిల్ రూ.వెయ్యి కోట్లకు పైగా ఆస్తులు సంపాదించారని లోకేశ్ ఆరోపించారు. నెల్లూరు జిల్లా మినహా ఏ ప్రాంతంలోనూ తనకు సెంటు భూమి కూడా లేదని.. తన ఆస్తుల పై శ్రీ వెంకటేశ్వర స్వామి వద్ద ప్రమాణానికి సిద్ధంగా ఉన్నానన్నారు. నెల్లూరు నగరంలోని వెంకటేశ్వర పురంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో రేపు ఉదయం 10 గంటలకు ప్రమాణం చేస్తానని.. మీ తాత ఇచ్చిన రెండు ఎకరాల భూమితోనే ఆస్తులు సంపాదించామని దమ్ముంటే లోకేష్ ప్రమాణం చేయాలని ఫైర్ అయ్యారు.
Also Read: NCP Crisis: శరద్ పవార్ కీలక సమావేశం.. జాతీయకార్యవర్గ సమావేశానికి పిలుపు..
నగరంలో తనకు 80 ఎకరాలు ఉందని ఆరోపించారని, కానీ అక్కడ 13 ఎకరాలు మాత్రమే ఉందని అనిల్ చెప్పారు. అందులో కూడా కొంత భాగాన్ని అమ్మేశానని వెల్లడించారు. ఇరుగాళమ్మ గుడి వద్ద 3 ఎకరాలు విక్రయించానని, వైసీపీ కార్పొరేటర్లు లేఅవుట్లు వేస్తే తనకేం సంబంధమని ప్రశ్నించారు. తన పేరిట ఉన్న రూ.50 కోట్ల ఇల్లు ఎక్కడుందో చెబితే అక్కడకు వెళ్లి చేరతానన్నారు. చెన్నైలో తాను అద్దె ఇంట్లో ఉంటున్నట్టు చెప్పుకొచ్చారు. లోకేశ్‌తో చర్చకు సిద్ధంగా ఉన్నానని కూడా చెప్పారు. కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను ఓడించాలంటూ మాజీ మంత్రి నారాయణ రూ.50 లక్షలు పంపిస్తే తాను వాటిని వెనక్కు పంపించేశానని అనిల్ చెప్పారు. ఈ విషయం గురించి ఎవరూ మాట్లాడట్లేదని వాపోయారు. టీడీపీ సమావేశంలో వేదికపై ఉన్న నేతలే అక్రమార్కులనీ, వైసీపీ నుంచి వచ్చిన వారు టీడీపీలో చేరగానే పునీతులయ్యారా? అని ప్రశ్నించారు.
నెల్లూరులో పాదయాత్ర నిర్వహిస్తున్న టీడీపీ నేతలు.. తన ఆస్తులకు సంబంధించి విడుదల చేసిన పత్రాలపై స్పష్టమైన వివరాలు ఇస్తానని.. తాను నెల్లూరు ప్రజలకు, జగన్‌కు మాత్రమే సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. ఈ తరుణంలో చిత్తశుద్ధి నిరూపించుకునే అవకాశం కలిగిందని అన్నారు. దొంతాలిలో 50 ఎకరాలు ఉందన్నారు… అది నా సొంత ఊరు.. అక్కడ 25 ఎకరాలు మాత్రమే కొన్నానని చెప్పారు అనిల్ కుమార్ యాదవ్. ఇనమడుగులో నా బావ మరిది పేరు మీద రెండున్నర ఎకరాలు కొన్నాను… ఐదు ఎకరాలు కాదన్నారు. నాకు రూ.1000 కోట్ల ఆస్తులు ఉన్నాయని టీడీపీ ఆరోపణలు చేసిందని.. కానీ నాకు మూడు, నాలుగు కోట్ల మేర అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు.