Minister Seethakka: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. ఈ వ్యాఖ్యల పట్ల తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ మతం, అభిమతం, కుల గణనపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అనవసరమని.. అసలు విషయం నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమని ఆమె పేర్కొన్నారు. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టి, జనాభా ప్రాతిపదికన సంక్షేమ ఫలాలు, రిజర్వేషన్లు కల్పించాలనే అభిమతాన్ని వ్యక్తం చేస్తున్నారని మంత్రి సీతక్క తెలిపారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్ది వారికి న్యాయం చేయాలనే లక్ష్యంతోనే రాహుల్ గాంధీ కుల గణనను డిమాండ్ చేస్తున్నారని, దీనిపై బీజేపీ నేతలు రాజకీయాలు చేయడం సరికాదని ఆమె విమర్శించారు.
Read Also: KTR: మా నాన్న నాకు ఒక్కడికే హీరో కాదు.. తెలంగాణలో అందరికీ హీరోనే
బీజేపీ నాయకులు రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని, అసలు కుల గణన అంశాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని సీతక్క ఆరోపించారు. త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ, పదవుల కోసం పోరాడే వ్యక్తి కాదని, గత 30 ఏళ్లుగా ఎలాంటి మంత్రి పదవులు లేకుండా దేశం కోసం పనిచేస్తున్న నిజమైన నాయకుడని ఆమె పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం రాహుల్ గాంధీ చేసే కృషిని చూసి, బీజేపీ నేతలు ఆయనపై విమర్శలు చేయడం దురుద్దేశంతోనే జరుగుతోందని మంత్రి సీతక్క విమర్శించారు.
Read Also: MLC Srinivas Reddy: కోడి పందేలుకు తనకు ఎలాంటి సంబంధం లేదన్న ఎమ్మెల్సీ
ప్రేమ, శాంతి, సమానత్వం కోసం రాహుల్ గాంధీ పనిచేస్తుంటే.. బీజేపీ మాత్రం విద్వేష, విధ్వంసాలను ప్రేరేపిస్తూ ప్రజలను విభజించే ప్రయత్నం చేస్తోందని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. ప్రజలు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని, బీజేపీ విద్వేష రాజకీయాలను కోరుకుంటారా? లేక కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చే శాంతి, సమానత్వాన్ని ఆశిస్తున్నారా? అనే అంశాన్ని తేల్చుకోవాలని ఆమె సూచించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజ్యాంగంపై ప్రమాణం చేసి, ఇప్పుడు ఆ రాజ్యాంగాన్ని అవమానించేలా నిర్దేశ ప్రసంగాలు చేస్తున్నారని సీతక్క తీవ్ర స్థాయిలో విమర్శించారు. బీజేపీ పాలనలో పేద ప్రజలకు, అణగారిన వర్గాలకు ఎటువంటి ప్రాధాన్యత లేదని, వారు కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసమే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు.