బొబ్బిలి వీణ తయారీదారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత హామీ ఇచ్చారు. వీణ తయారీకి 30 ఏళ్లు పెరిగిన పనస చెట్టు కలప మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుందని, రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో పనస చెట్ల పెంపకానికి యాక్షన్ ప్లాన్ రూపొందించామన్నారు. బొబ్బిలి చేనేత చీరల అమ్మకాలు పెరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. హస్తకళాకారులను సీఎం చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా లేపాక్షి షో రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సవిత పేర్కొన్నారు.
శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సవిత సమాధానాలు ఇచ్చారు. ‘బొబ్బిలి వీణ తయారీదారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. వీణ తయారీకి 30 ఏళ్లు పెరిగిన పనస చెట్టు కలప మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో పనస చెట్ల పెంపకానికి యాక్షన్ ప్లాన్ రూపొందించాం. ఇప్పటికే అటవీ, గిరిజన సంక్షేమ శాఖాధికారులతో చర్చించాం. ఇతర రాష్ట్రాల నుంచి పనస కలప కొనుగోలు చేసి వీణ తయారీదారులకు అందించడానికి చర్యలు తీసుకుంటాం. బొబ్బిలి చేనేత చీరల అమ్మకాలు పెరిగేలా చర్యలు తీసుకుంటాం. నూతన డిజైన్లతో చేనేత చీరలు, వస్త్రాల తయారీపై ఉచిత శిక్షణ కూడా ఇస్తున్నాం’ అని మంత్రి చెప్పారు.
‘హస్తకళాకారులను సీఎం చంద్రబాబునాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా లేపాక్షి షో రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతమున్న షో రూమ్‌లను ఆకర్షణీయంగా అభివృద్ధి చేస్తున్నాం. విజయనగరం సంగీత కళాశాల సమస్యల పరిష్కరిస్తాం. తిరుపతిలో నిలిచిపోయిన హ్యాండీ క్రాఫ్ట్స్ విలేజ్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాం’ అని మంత్రి సవిత తెలిపారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా హ్యాండ్ లూమ్, టెక్స్ టైల్స్ శాఖ ద్వారా బనాన్ ఫైబర్ తో తయారు చేసిన బ్యాగ్ లను శాసనసభ్యులకు, శాసనమండలి సభ్యులకు మంత్రి సవిత అందజేశారు. హస్త కళాకారులను ప్రజలందరూ ప్రోత్సాహించాలని మంత్రి కోరారు.