ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని గొల్లపూడిలో ఉన్న బీసీ సంక్షేమ భవన్ ను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, చేనేత & జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత సందర్శించారు. బీసీ సంక్షేమ భవన్‌లో ఉన్న వివిధ బీసీ కార్పొరేషన్ల విభాగాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. 2014- 19 లో చంద్రబాబు ప్రభుత్వంలో బీసీలకు పెద్దపెట్టవేశామని, 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం బీసీల అభ్యున్నతిని విస్మరించిందన్నారు. టీడీపీ పాలనలో బీసీ సంక్షేమ హాస్టల్స్, బీసీ కులాలను అభివృద్ధి చేసామని, మాజీ ముఖ్యమంత్రి జగన్ బీసీల ద్రోహి అని ఆమె విమర్శించారు. నా బీసీ అని ప్రజలను ముంచేసిన వ్యక్తి జగన్ అని ఆమె మండిపడ్డారు. బీసీ కార్పొరేషన్ లలో వసతులు కరువయ్యాయని, వైసీపీ ప్రభుత్వ పాలనలో బీసీ కార్పొరేషన్ లో చైర్మన్లు సీట్లకే పరిమితమయ్యారన్నారు. బీసీ కార్పొరేషన్ ల వల్ల ఒక బీసీకి మేలు జరగలేదని, బీసీలు పార్టీ అని జగన్ ఓట్లు వేయించుకొని మోసం చేశాడన్నారు. గతంలో చంద్రబాబు పాలనలో 2014- 19లో బీసీలకు పూర్వపు వైభవం వచ్చిందో అదే విధంగా మళ్ళీ తీసుకువస్తామని, తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అన్నారు.
బీసీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేది చంద్రబాబు ప్రభుత్వమేనని, వైసీపీ ప్రభుత్వం 56 బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించలేదన్నారు మంత్రి సవిత. త్వరలోనే టీడీపీ కూటమి ప్రభుత్వం బీసీలకు అన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని, 56 కార్పొరేషన్లే కాకుండా బీసీల్లోనే ఇతర కులాలకు సైతం కార్పొరేషన్లు ఏర్పాటు చేసే విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన చేస్తున్నారన్నారు. జనాభా ప్రకారం బీసీలకు కార్పొరేషన్లు, నిధులు కేటాయిస్తామని, గత ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్ చైర్మన్ లు జీతాలు తీసుకొని వైసిపి పార్టీ కార్యకర్తలుగా పని చేశారన్నారు.
తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో బీసీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, చంద్రబాబు బీసీ మంత్రిగా నాకు ఇవ్వటం ఎంతో సంతోషంగా ఉంది బీసీ మంత్రి పదవి న్యాయం చేస్తామని బీసీలకు అండగా ఉంటామని తెలిపారన్నారు.