నర్సుల సేవలు అనితర సాధ్యమైనవని, నర్సులు సంపదను సృష్టిస్తారని ఇవాళే తెలిసిందని వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. చిత్తశుద్ధి, అంకితభావం, కరుణ, సేవ కలగలిపితేనే నర్సు అని.. పవిత్రమైన వృత్తి నర్సింగ్‌ని ఎంచుకున్న అందరికీ అభినందనలు అని పేర్కొన్నారు. ఏపీలో నర్సింగ్ కౌన్సిల్‌లో 1.20 వేల మంది రాష్ట్ర విభజన తరువాత రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో నర్సింగ్ స్టాఫ్ వేకెన్సీలు పూర్తవుతాయని, నర్సింగ్ కాలేజీలలో విదేశీ భాషలు నేర్పించేలా ఏర్పాటు చేస్తాం అని మంత్రి చెప్పారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించింది. ముఖ్య అతిథిగా మంత్రి సత్యకుమార్ పాల్గొని ఐదుగురు నర్సులకు రాష్ట్ర స్ధాయి నైటింగేల్ అవార్డులు అందజేశారు.
‘నర్సుల సేవలు అనితర సాధ్యమైనవి. నర్సులు సంపదను సృష్టిస్తారని ఇవాళే తెలిసింది. ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం జరుపుకుంటున్నాం. జీవితంలో వినోదం అవసరం కానీ.. వినోదమే జీవితం కాకూడదు. చిత్తశుద్ధి, అంకితభావం, కరుణ, సేవ కలగలిపితేనే నర్సు. పవిత్రమైన వృత్తి నర్సింగ్‌ని ఎంచుకున్న అందరికీ అభినందనలు. ఇప్పుడు ఇచ్చిన అవార్డులను కొనసాగిస్తాం. హక్కుల గురించి మాట్లాడుతున్నపుడు బాధ్యత మర్చిపోకూడదు. ప్రజలకు మేం జవాబుదారీ కాబట్టి బాధ్యతల నిర్వహణపై ప్రతీ ఒక్కరినీ ప్రశ్నిస్తాం. మానవతా దృక్పధంతో ఆలోచిస్తాం. నాకు బెదిరిస్తూ ఒక అధికారి కామెంట్ పెట్టాడు. అదే మరో ప్రభుత్వం అయితే ఆయన ఉద్యోగం పోయేది. మేం అలాంటి వారికి కౌన్సిలింగ్ ఇస్తాం’ అని వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు.
Also Read: Chandrababu Naidu: గొప్ప విజయాలు అందుకోవాలంటూ.. ఎన్టీఆర్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పిన సీఎం!
‘ఏపీలో నర్సింగ్ కౌన్సిల్‌లో 1.20 వేల మంది రాష్ట్ర విభజన తరువాత రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. గత ప్రభుత్వం చెప్పిన జీరో వేకెన్సీ పాలసీలో డొల్లతన మేం బయటపెట్టాం. రాబోయే రోజుల్లో నర్సింగ్ స్టాఫ్ వేకెన్సీలు పూర్తవుతాయి. ప్రతీ సంవత్సరం 2600 మంది బయట దేశాల్లో రిజిష్టర్ చేసుకుంటున్నారు. నర్సింగ్ కాలేజీలలో విదేశీ భాషలు నేర్పించేలా ఏర్పాటు చేస్తాం. సరైన అర్హత లేని నర్సులు ఎక్కడా ఉండకూడదు. రాబోయే 6 నెలల్లో ఆన్‌లైన్‌లో ఇంటివద్ద నుంచే నర్సింగ్ రిజిస్ట్రేషన్ చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. సరిహద్దుల్లో సైన్యం ఎలా ప్రాణాలు కాపాడుతుందో, అదేవిధంగా నర్సింగ్ స్టాఫ్ కూడా పని చేస్తున్నారు. వైద్య రంగంలో పని చేసే వారు కూడా మనుషులే అని గుర్తించాలి. ప్రభుత్వ ఆసుపత్రుల సేవలపై సంతృప్తి సూచీ 75 శాతానికి వచ్చింది. రోగులను నవ్వుతూ ఆహ్వానించి, వైద్యం అందించి, నవ్వుతూ పంపించండి’ అని మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు.