ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకంతో తెలంగాణ పచ్చగా మారిందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. వరంగల్ జిల్లా నర్సంపేటలోని దుగ్గొండి మండలం చలపర్తిలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ నిధులతో 10వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదామును మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి నిరంజన్‌రెడ్డి ఓపెనింగ్ చేశారు. గతంలో 36 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములు మాత్రమే ఉండేవని.. ఈ తొమ్మిదేళ్లలో 74లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెంచినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి మారుమూల పల్లెల్లో రైతు భూముల విలువ గణనీయంగా పెరిగాయన్నారు.
Also Read : MI vs GT: శతక్కొట్టిన సూర్య.. జీటీ ముందు భారీ లక్ష్యం
రైతుబీమా, రైతుబంధు పథకాల గొప్పదనం అంతర్జాతీయ స్థాయిలో వినిపిస్తుందని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. అకాల వర్షంతో నష్టపోయిన ప్రతి రైతుకు రాష్ట్ర నిధులతో రూ.10వేల నష్ట పరిహారం చెల్లిస్తున్నామన్నారు. రూ.65 వేల కోట్లు రైతుబంధుకు రూ.5 వేల కోట్లు రైతుబీమాకు అందించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఒక వ్యవసాయ రంగం పైనే రూ.4.50 లక్షలు కోట్లు, సాగునీటి రంగంపై రూ.1.59 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన తెలిపారు. మొక్కజొన్నల కొనుగోలు కోసం రూ.10వేల కోట్లు ఖర్చు చేశామని మంత్రి నిరంజన్‌రెడ్డి వివరించారు. దేశంలోని ఏ రాష్ట్రం ఈ విధంగా ఖర్చు చేయలేదని వెల్లడించారు. వ్యవసాయ యాంత్రికీకరణ కోసం తప్పకుండా కృషి చేస్తామన్నారు.
Also Read : ప్రపంచంలోనే ఎక్కువ నేర చరిత్ర కలిగిన దేశాలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం మారుమూల గ్రామానికి సైతం సాగు, తాగునీరు అందుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతులందరిని ఆదుకునేందకు నర్సంపేట నియోజకవర్గానికి రూ.40కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా పంట నష్టపోయిన రైతులకు రూ.10వేల చొప్పున పరిహారం ఇస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పండిన పంటకు సరిపడా గోదాములు నిర్మించామని ఆయన వెల్లడించారు. తెలంగాణ రైతులకు అందుతున్న పథకాలు నేడు అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. తడిసిన వడ్లను కూడా కొనాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారన్నారు.