Minister Narayana: విజయవాడలో మున్సిపల్ కమిషనర్, అధికారులపై మంత్రి నారాయణ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ కండ్రికలో మంత్రి నారాయణ పర్యటించారు. బుడమేరు వరద బాధిత ప్రాంతాలను మంత్రి పరిశీలించారు. మంచినీరు ఏర్పాటు చేయడం లేదని మంత్రి వద్ద స్థానికులు వాపోయారు. వరద ముంపు ప్రాంతాలలో మంత్రులు తిరుగుతుంటే అధికారులకు పట్టడం లేదంటే ఏమిటి పరిస్థితి అంటూ అధికారులను మంత్రి నారాయణ నిలదీశారు. పేదల కాలనీలో ఉంటే సమస్యలు మీకు తెలుస్తాయంటూ కమిషనర్ పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Saria Waterfalls: విషాదం.. సరియా జలపాతంలో ఇద్దరు గల్లంతు
ఒక్కరోజు మంచం వేసుకొని రాత్రి సమయంలో పడుకుంటే ఇక్కట్లు తెలుస్తాయంటూ కమిషనర్ ధ్యానచంద్‌పై మంత్రి నారాయణ నిప్పులు చెరిగారు. యుద్ధ ప్రాతిపదికన ముంపు ప్రాంతాలలో నీరు తొలగేలా చూడాలని, మంచినీళ్లు అందించాలని ఆదేశించారు. స్పందించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల ముందుకు నేరుగా అధికారులను తీసుకువెళ్లారు మంత్రి నారాయణ. ఇదిలా ఉండగా.. బెజవాడ వాసులను బుడమేరు ముంపు ప్రచారం పరుగులు పెట్టించింది. బుడమేరుకు వరద ముంపు వచ్చిందని కొద్దిసేపట్లో మళ్ళీ ఇళ్లలోకి వరదనీరు వస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ వార్త తెలుసుకున్న అజిత్ సింగ్ నగర్, పాయకాపురం, కండ్రికా ప్రాంతాల వారు ఇళ్ళ నుంచి బయటకు వచ్చేసి కంగారు పడిన పరిస్థితి నెలకొంది. ఇదంతా ఫేక్ ప్రచారంగా అధికారులు చెబుతున్నారు. ఎవరు ఈ ప్రచారం చేశారు అనేది గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.