మరోసారి కేంద్ర ప్రభుత్వంపై డిమాండ్ల వర్షం కురిపించారు మంత్రి కేటీఆర్. తాజాగా ఆయన తెలంగాణ టెక్స్ టైల్ రంగానికి కేంద్ర బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా.. ‘తెలంగాణ నేతన్నల సంక్షేమం, టెక్స్ టైల్ రంగ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని ఎన్నో ఏండ్లుగా కోరుతున్నా.. కేంద్ర సహకారం లభించడం లేదు. ఆర్థిక మంత్రులు మారుతున్నారు కానీ కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అందుతున్నది శూన్యం.’ అని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చేనేత, టెక్స్ టైల్ రంగ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకి కేంద్ర బడ్జెట్ లో ఈ సారైనా నిధులు ఇవ్వాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్, సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ కి నిధులు కేటాయించాలన్నారు మంత్రి కేటీఆర్. టెక్స్ టైల్, చేనేత రంగం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జీఎస్టీని పూర్తిగా రద్దు చేస్తన్నట్టు బడ్జెట్ లో ప్రకటించాలన్నారు.
Also Read : Jagan – Bhupendra Yadav: కేంద్రమంత్రి భూపేంద్రతో భేటీలో జగన్ ప్రస్తావించిన అంశాలివే
బ్లాక్ లెవెల్ హ్యాండ్లూమ్ క్లస్టర్ ల ఏర్పాటుకు నిధులు ఇవ్వాలన్నారు. తెలంగాణలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ, నేషనల్ టెక్స్ టైల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, హ్యాండ్లూమ్ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఏర్పాటు ప్రకటన చేయాలని, ఈసారైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ టెక్స్ టైల్ రంగ పురోగతికి నిధులు ఇస్తుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేవారు. కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకాల లేమి, మౌలిక వసతుల కల్పన వైఫల్యంతో మేక్ ఇన్ ఇండియా కేవలం నినాదంగా మాత్రమే మిగిలిపోయిందని, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి చిన్న దేశాలతోనూ పోటీ పడలేని పరిస్థితిలో భారతదేశం ఉండడానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వ విధానాలేనన్నారు. టెక్స్ టైల్, నేతన్నల పరిస్థితుల పై మోడీ సర్కార్ కు కనీస అవగాహన, చిత్తశుద్ది లేదని, తెలంగాణ లాంటి ప్రగతిశీల రాష్ట్రాల ప్రగతికి కేంద్రం సహకరించడం లేదన్నారు. నిధులు కేటాయించకుండా నేతన్నల సంక్షేమం అభివృద్ధినీ అడ్డుకోవద్దని కేటీఆర్ కోరారు. కేంద్రం ప్రవేశపెట్టే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ ఇది, ఇందులోనైన నేతన్నల పట్ల తమ చిత్తశుద్ధిని మోడీ ప్రభుత్వం చాటుకోవాలన్నారు.