Kakani Govardhan Reddy: చంద్రబాబు అవినీతికి పాల్పడినందు వల్లే సీఐడీ అరెస్ట్ చేసిందని రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. దీంతో తట్టుకోలేని టీడేపీ నేతలు ప్రభుత్వాన్ని, న్యాయవాదులను, న్యాయమూర్తులను తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారని ఆయన చెప్పారు. 14 ఏళ్ల అధికారంలో ఉన్న టీడీపీ రాజ్యాంగ వ్యవస్థలను అవమానించడం సరికాదన్నారు. ఓటుకు నోటు కేసులో చిక్కిన చంద్రబాబు అక్కడ అరెస్టు చేస్తారనే భయంతో హడావిడిగా వచ్చేశారని విమర్శించారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల పాలు చేశారని విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన చంద్రబాబు.. అక్కడ పరిమితంగా ఐదేళ్లు పాలించినా ఆంధ్ర ప్రదేశ్‌లో పరపతి ఉందా అంటూ వ్యాఖ్యానించారు. ఐదేళ్లు పాలించినా చంద్రబాబును పట్టించుకోవడం లేదన్నారు. చివరకు టీడీపీ నేతలు కూడా చంద్రబాబును పట్టించుకోవడం లేదన్నారు.
Also Read: Purandeshwari: ప్రధాని మోడీ బర్త్‌డే.. పేదలకు చీరలను పంపిణీ చేసిన పురంధేశ్వరి
లోకేష్ ఢిల్లీ యాత్రకు వెళ్ళాడని.. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన విషయాన్ని వివరించేందుకు ఢిల్లీకి వెళ్ళాడని టీడీపీ నేతలు చెప్పారని.. ఢిల్లీలో కూడా లోకేష్ ఏమీ చెప్పలేకపోయాడని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబును బయటకు తీసుకువచ్చేందుకు ఏ లాయర్లను పట్టుకుంటే బాగుంటుందనే విషయంపై లోకేష్ చర్చిస్తున్నాడని ఆయన అన్నారు. చంద్రబాబును బయటకు తెచ్చేందుకే న్యాయవాదుల చుట్టూ తిరుగుతున్నాడన్నారు. లోకేష్‌ను కూడా అరెస్ట్ చేస్తారని బ్రాహ్మణి ఆందోళన వ్యక్తం చేసిందని మంత్రి పేర్కొన్నారు. లోకేష్ కూడా అవినీతిగా పాల్పడ్డారని చంద్రబాబు కుటుంబం భావిస్తోందని ఆయన చెప్పారు. జరిగిన అవినీతి కుటుంబ సభ్యులకు తెలుసు కాబట్టి వాళ్లు భయపడుతున్నారన్నారు.
రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ రాహుల్ తన భార్యకు ఆరోగ్యం బాగలేక సెలవు పెడితే ఎన్నో కథనాలను సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన భార్య చనిపోయిన తర్వాత ప్రజలకు వాస్తవం తెలిసిందన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డాడని పవన్ కళ్యాణ్ చెప్పాడని.. ఇప్పుడు చంద్రబాబుతో కలిసి పోటీ చేస్తానని చెబుతున్నాడని ఆయన ఆరోపించారు. నాలుగు శాతం ఓట్లు లేని పవన్ కళ్యాణ్. .. వైసీపీని అడ్డుకుంటానని చెప్పడం హస్యాస్పదమన్నారు. చంద్రబాబు చేసిన అవినీతికి ఎప్పుడో 15 ఏళ్ల జైలు శిక్ష పడాల్సి ఉండేదని మంత్రి అన్నారు. కోర్టుల నుంచి స్టే తెచ్చుకొని కొనసాగుతున్నాడన్నారు. టీడీపీ నేతలు న్యాయమూర్తులను, న్యాయవాదులను బెదిరిస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు.