Harish Rao: వైద్యం కోసం వచ్చిన రోగులను పట్టించుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటానని వైద్యులు, సిబ్బందికి మంత్రి హరీశ్ రావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మలక్‌పేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు బాలింతల మృతి ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే బాధ్యులను డిస్మిస్ చేస్తామన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో ఉన్నతాధికారులతో కలసి ఆయన వైద్య, ఆరోగ్యశాఖ వార్షిక నివేదిక–2022ను ఆవిష్కరించారు. ఒకట్రెండు ఘటనలు మినహా గతేడాది వైద్య, ఆరోగ్యశాఖ పనితీరు దేశానికి ఆదర్శంగా నిలిచిందని మీడియాతో మంత్రి చెప్పారు. ‘హెల్త్ ఫర్ ఎవ్రీ ఏజ్.. హెల్త్ ఎట్ ఎవ్రీ స్టేజ్.. టువార్డ్స్ ఆరోగ్య తెలంగాణ’ అనే నినాదాన్ని తాము ఎంచుకున్నామని వివరించారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో వైద్య, ఆరోగ్యశాఖకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 11,440 కోట్ల బడ్జెట్ కేటాయించిందని… ఈ కేటాయింపులతో తలసరి హెల్త్ బడ్జెట్‌లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచామన్నారు. నీతి ఆయోగ్ ర్యాంకుల్లో దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో నిలిచిందని గుర్తుచేశారు.
Read Also: Tamilnadu: తప్పిన పెనుప్రమాదం.. అర్ధరాత్రి రన్నింగ్ బస్సులో చెలరేగిన మంటలు
తెలంగాణలో అమలు చేస్తున్న మిడ్ వైఫరీ వ్యవస్థకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ నుంచి టాప్ పర్ఫార్మింగ్ స్టేట్ అవార్డు లభించిందన్నారు. యూనిసెఫ్ కూడా ఈ సేవలను ప్రశింసించిందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. అలాగే తెలంగాణ డయాగ్నోస్టిక్ హైదరాబాద్ సెంట్రల్ హబ్‌కు ఎన్‌ఏబీఎల్ గుర్తింపు లభించిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 31 లక్షల మందికి టెలి కన్సల్టెన్సీ ద్వారా వైద్య సేవలు అందించినందుకు కేంద్రం రాష్ట్రానికి అవార్డు ఇచ్చిందని హరీశ్‌రావు చెప్పారు. ఈ ఏడాది మరిన్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని భావిస్తున్నామన్నారు. ఈఎన్‌టీ, సరోజినీదేవి ఆసుపత్రులను మరింత పట్టిష్టం చేస్తామని, ఆహార కల్తీ నియంత్రణపై మరింతగా దృష్టి పెడతామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద గతేడాది 2.59 లక్షల మంది రోగులు లబ్ధి పొందారని, ఉద్యోగులు, జర్నలిస్టుల పథకంలో 43,702 మంది లబ్ధి పొందారని మంత్రి వివరించారు. గతంలో పరిమితి రూ. 2 లక్షలు ఉంటే దాన్ని రూ. 5 లక్షలకు పెంచామన్నారు.