Husband Kills Wife: కృష్ణా జిల్లాలోని గుడివాడలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను ఓ వ్యక్తి పాశవికంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. మహిళను దారుణంగా హత్య చేసిన ఈ ఘటన గుడివాడ ఎన్టీఆర్ కాలనీలో జరిగింది. భార్య రామలక్ష్మిని కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపేశాడు భర్త సూర్యనారాయణ. అడ్డుకోబోయిన రామలక్ష్మి తండ్రి వెంకన్నను కూడా నిందితుడు గాయపరిచాడు.
Read Also: MLA Lasya Nanditha: లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన ఎమ్మెల్యే లాస్య నందిత!
అసలేం జరిగిందంటే.. ఐదేళ్ల క్రితం భీమవరానికి చెందిన సూర్యనారాయణతో గుడివాడకు చెందిన రామలక్ష్మికి వివాహమైంది. పెళ్లైన ఒక సంవత్సరానికి ఒక కుమారుడు కూడా జన్మించాడు. అనంతరం వారిద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో భర్తతో విభేదాల కారణంగా, నాలుగేళ్ల కుమారుడితో కలిసి గుడివాడలోని ఎన్టీఆర్ కాలనీలోని పుట్టింట్లో ఉంటోంది రామలక్ష్మి. భార్యాభర్తల వివాదంపై పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడుకుందామంటూ సూర్యనారాయణను పిలిపించారు రామలక్ష్మి కుటుంబ సభ్యులు. రామలక్ష్మి ఇంటిలో పనులు చేసుకుంటుండగా భర్త సూర్యనారాయణ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అడ్డం వచ్చిన రామలక్ష్మి తండ్రిని కూడా కత్తితో గాయపరిచాడు. గాయపడిన ఆయనను గుడివాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రామలక్ష్మి తండ్రి వెంకన్న ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గుడివాడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.