మహారాష్ట్రలో రాజీకీయ సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఉమ్మడి కూటమి ప్రభుత్వం కూలిపోయే స్థితికి చేరుకుంది. మహావికాస్ అఘాడీని లీడ్ చేస్తున్న శివసేన పార్టీలోనే చీలిక వచ్చింది. శివసేన కీలక నేత, మంత్రి ఏక్ నాథ్ షిండే దాదాపు 35 మంది పైగా ఎమ్మెల్యేలతో అస్సాం గౌహతిలో క్యాంప్ పెట్టారు. శివసేన తన మూల సిద్ధాంతాలకు వ్యతిరేఖంగా వ్యవహిరిస్తోందని ఆరోపించారు. బీజేపీతో చేతులు కలపాలని ఉద్ధవ్ ఠాక్రేకు సూచించారు.
అయితే మహారాష్ట్రలో ‘మహా’ సంక్షోభానికి బీజేపే కారణం అని ఇటు శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలు నిందిస్తున్నాయి. అయితే తాజాగా త్రుణమూల్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఉద్ధవ్ ఠాక్రేకు న్యాయం జరగాలని కోరారు. బీజేపీ మనీ, మజిల్, మాఫియా పవర్ ను ఉపయోగిస్తోందని విమర్శించారు. ఏదో ఒక రోజు బీజేపీ కూడా అధికారం నుంచి వెళ్తుందని.. మీ పార్టీని కూడా విచ్ఛిన్నం చేయవచ్చని ఆమె హెచ్చరించారు. అయితే ఇటువంటి వాటికి నేను సపోర్ట్ చేయనని అన్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలను అస్సాంకు బదులు బెంగాల్ పంపితే మంచి ఆతిథ్యం ఇస్తామని సెటైర్లు వేశారు. మహారాష్ట్ర తరువాత బీజేపీ ఇతర ప్రభుత్వాలను కూడా కూల్చేస్తారని.. ప్రజలకు న్యాయం జరగాలని, రాజ్యాంగాన్ని కోరుకుంటున్నామని మమతా బెనర్జీ అన్నారు.
మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ మల్లికార్జున ఖర్గే కూడా బీజేపీపై విమర్శలు గుప్పించారు. మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వాన్ని, అస్థిర పరిచి రాష్ట్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ, కేంద్రం ప్రభుత్వ భావిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రపతి ఎన్నికల కోసం ఇలా చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ మహావికాస్ అఘాడీని బలపరుస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కూటమికి అండగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. గతంలో బీజేపీ కర్నాటక, గోవా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఇలాగే చేసిందని గుర్తుచేశారు.