Mamata Banerjee: లోక్సభ ఎన్నికలకు ముందు అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం ద్వారా బీజేపీ జిమ్మిక్కులకు పాల్పడుతోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం ఈవెంట్ ఓ జిమ్మిక్ షో అని ఆమె వ్యాఖ్యానించారు. ఇతర వర్గాలను వేరు చేసి నిర్వహించే ఉత్సవాలకు తాను మద్దతివ్వబోనని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ తేల్చి చెప్పారు.
Read Also: Uttarpradesh: జనవరి 22న యూపీలో విద్యాసంస్థలకు సెలవు.. మద్యం అమ్మకాలు బంద్
దక్షిణ 24 పరగణాస్ జిల్లాలోని బెంగాల్లోని జాయ్నగర్లో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో ప్రసంగించిన మమతా బెనర్జీ.. మత ప్రాతిపదికన ప్రజలను విభజించడంలో తనకు నమ్మకం లేదని అన్నారు. అన్ని వర్గాల ప్రజలను తీసుకెళ్లి ఐక్యత గురించి మాట్లాడే ఉత్సవాలను తాను నమ్ముతానన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారమే బీజేపీ అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించిందని, కానీ లోక్సభ ఎన్నికలకు ముందు ఆలయాన్ని ఓపెన్ చేయడం ఓ జిమ్మిక్ షో అని మమతా విమర్శించారు. జనవరి 22వ తేదీన అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట జరగనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి సుమారు ఏడు వేల మంది ప్రముఖుల్ని ఆహ్వానిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, 6,000 మందికి పైగా ప్రముఖులు ‘ప్రాణ్ ప్రతిష్ట’ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది.